భీమవరం(ప్రకాశం చౌక్): పేద, మధ్యతరగతి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత పారదర్శక సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా ఫేస్ రికగ్నేషన్ (ముఖ ఆధారిత) యాప్ ద్వారా హాజరు వేసే విధానాన్ని ప్రవేశపెట్టింది.
గురువారం (డిసెంబర్ 1) నుంచి జిల్లావ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానుంది. ఆయా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది అందరూ ఈ విధానంలోనే హాజరు వేయాల్సి ఉంటుంది. దీనిద్వారా వారు పనిచేస్తున్న ప్రాంతంలోనే నిర్దేశించిన సమయంలోనే హాజరు వేయాల్సి ఉండటంతో విధులకు డుమ్మా కొట్టే అవకాశం ఉండదు. డ్యూటీ సమయంలో వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండి సేవలు అందించేలా ఈ కొత్త యాప్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది.
రోజుకు మూడు సార్లు చొప్పున..
వైద్యులు, సిబ్బంది రోజుకు మూడుసార్లు ఆస్పత్రిలో ముఖ ఆధారిత యాప్ ద్వారా హాజరు వేయాలి. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 4 గంటలకు హజరు వేయాల్సి ఉంటుంది. రోజుకు మూడుసార్లు కచ్చితంగా హాజరు వేయాల్సిందే.
జిల్లాలో 1,212 మంది..
జిల్లాలో ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్యులు, అన్నిరకాల సిబ్బంది కలిపి మొత్తం 1,212 మంది ఉన్నారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 500 మంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 712 మంది ఉన్నారు. 99 శాతం మేర ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేశారు.
నేటి నుంచి అమలు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది అంతా ప్రభుత్వ నూతనంగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా బయోమెట్రిక్ వేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలోని అన్ని ఆస్పత్రుల నుంచి సుమారు 1,212 వైద్య సిబ్బందికి సంబంధించి ప్రక్రియ చేపట్టగా 98 శాతం మేర నమోదు కార్యక్రమం పూర్తి చేశారు. రోజుకు మూడుసార్లు వైద్య సిబ్బంది యాప్ ద్వారా బయోమెట్రిక్ వేస్తారు.
–మహేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ, పశ్చిమగోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment