face recognition
-
హాస్టల్ విద్యార్థులకూ ఫేస్ రికగ్నిషన్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఫేస్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్ఎస్) పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీన్లో భాగంగా తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు రెండు హాస్టళ్లను ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,100 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉంటే వాటిలో 52 హాస్టళ్లలో ఎఫ్ఆర్ఎస్ అమలుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనుంది వాటికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను కూడా పూర్తిచేసిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.ప్రభుత్వం వారం రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని సర్వీస్ ప్రొవైడర్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఎఫ్ఆర్ఎస్ అమలు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను ఆయా వసతి గృహాలకు చెందిన హాస్టల్ సంక్షేమ అధికారి (హెచ్‌డబ్ల్యూఓ)కి అప్పగించనున్నారు. ఎంపిక చేసిన ప్రతి హాస్టల్‌కు చెందిన విద్యార్థుల ఫొటోలు తీసి, ఆథార్, ఫోన్ నంబర్, చిరునామా, తరగతి తదితర వివరాలను ఆయా యాప్‌ల్లో అప్లోడ్ చేస్తారు.తద్వారా యాప్ ఉన్న మొబైల్ ఫోన్, పరికరాల్లోనూ విద్యార్థి ముఖం చూపిస్తే హాజరు పడుతుంది. ఇలా ఉదయం ప్రార్థన, సాయంత్రం స్కూల్ సమయం తర్వాత ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు సేకరిస్తారు. తద్వారా ఏఏ వసతి గృహాల్లో ఏ రోజు ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? మిగిలిన వాళ్లు ఎందుకు రాలేదు? తదితర హాజరు సంబంధ సమాచారంతోపాటు, హాస్టల్ సంక్షేమ అధికారుల అలసత్వాన్ని, నిర్వహణ లోపాలపై తదుపరి చర్యలు తీసుకునే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. -
వ్యక్తులను గుర్తించే ‘దివ్యదృష్టి’!
పుర్రె భాగాన్ని స్కాన్‌చేసి వ్యక్తులను గుర్తించే ఏఐ సాంకేతికత ‘దివ్యదృష్టి’ను తయారు చేసినట్లు రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) తెలిపింది. డీఆర్డీఓ ఏర్పాటు చేసిన ‘డేర్ టు డ్రీమ్ ఇన్నోవేషన్ కంటెస్ట్ 2.0’లో ఈ టెక్నాలజీను ఆవిష్కరించిన ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ విజేతగా నిలిచిందని చెప్పింది.డీఆర్డీఓ తెలిపిన వివరాల ప్రకారం..‘దేశవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డేర్ టు డ్రీమ్ ఇన్నోవేషన్ కంటెస్ట్ 2.0ను ఏర్పాటు చేశాం. అందులో భాగంగా కొత్త ఏఐ టూల్‌ను పరిచయం చేసిన ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ గెలుపొందింది. శివాని వర్మ అనే మహిళా వ్యాపారవేత్త ఈ కంపెనీను స్థాపించారు. సంస్థ తయారు చేసిన ‘దివ్యదృష్టి’ అనే ఏఐ టూల్ ద్వారా విభిన్న వ్యక్తులను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. ఇందులో భాగంగా మానవుల పుర్రె భాగాన్ని వివిధ శారీరక పరామితులను ఉపయోగించి స్కాన్ చేస్తారు. పుర్రె పరిమాణం, అందులోని ఇతర పరామితులు వ్యక్తులనుబట్టి మారుతాయి. దాంతో విభిన్న వ్యక్తుల ముఖాలను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. అడ్వాన్స్డ్ బయోమెట్రిక్ సాంకేతికతను కూడా ఈ ‘దివ్యదృష్టి’లో ఉపయోగించారు.కొత్తగా కనుగొన్న ఏఐ టూల్‌ను రక్షణ, లా ఎన్ఫోర్స్మెంట్, కార్పొరేట్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా విభిన్న రంగాల్లో వినియోగించవచ్చని డీఆర్డీఓ తెలిపింది. బెంగళూరులోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్(సీఏఐఆర్) మార్గదర్శకత్వంతో ఈ టూల్‌ను కనుగొన్నట్లు ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ తెలిపింది.ఇదీ చదవండి: మార్కెట్ ట్రెండ్ గమనిస్తున్నారా? ఇప్పుడేం చేయాలంటే..డిఫెన్స్ ఆర్ అండ్ డీ సెక్రటరీ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ..కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేలా డీఆర్డీఓ అనుసరిస్తున్న మార్గాలు అభినందనీయమన్నారు. ‘దివ్యదృష్టి’ అభివృద్ధికి టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ (టీడీఎఫ్) సహాయం చేయడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఫేస్ రికాగ్నిషన్ టెక్నాలజీలో కేవలం ముఖ కవలికలు, ముక్కు, కళ్లు, కనుబొమ్మలు.. వంటి భాగాలను స్కాన్ చేసి వ్యక్తులను గుర్తిస్తున్నారు. అయితే దాదాపు ఒకేలా ఉన్న వ్యక్తులను ఈ టెక్నాలజీతో కనిపెట్టడం కొంత కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చిన ‘దివ్యదృష్టి’ ఏకంగా పుర్రె భాగాలను స్కాన్ చేస్తుంది కాబట్టి మరింత కచ్చితత్వంతో కనిపెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
నిండు గర్భిణిని నేరస్తురాలిని చేసిన ఏఐ.. మున్ముందు ఎన్ని ఘోరాలు చూడాలో?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పాటు మెషిన్ లెర్నింగ్ అనేది ప్రస్తుతం మన జీవితాల్లో ప్రధాన భాగంగా మారిపోయింది. అయితే ఏఐ చేసిన పొరపాటు కారణంగా పోలీసులు ఎవరినైనా అరెస్టుచేస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం చాలా కష్టం. ఇటువంటి ఘటన అమెరికాలోని డెట్రాయిట్లో చోటుచేసుకుంది. మెషీన్ చేసిన పొరపాటు కారణంగా పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీలో జరిగిన పొరపాటు కారణంగా పోలీసులు 8 నెలల గర్భిణిని అరెస్టు చేశారు. 32 ఏళ్ల పోర్చ్ ఉడ్రఫ్ కోర్టులో జరుగుతున్న వాదనల్లో మాట్లాడుతూ తాను తన ఇద్దరు పిల్లలను స్కూలుకు రెడీ చేస్తుండగా, పోలీసులు తనను అరెస్టు చేసేందుకు వచ్చి, తన చేతులకు బేడీలు వేసి, తనను తీసుకువెళ్లారని ఆరోపించింది. ఈ ఉదంతం గురించి బాధితురాలి తరపు న్యాయవాది మాట్లాడుతూ తన క్లైంట్‌ను అనవసరంగా అరెస్టు చేశారని అన్నారు. పోలీసులు ఆమె ఇంటికి దొంగతనం, కార్జాకింగ్ ఆరోపణలకు సంబంధించిన అరెస్ట్ వారెంట్‌తో పాటు వచ్చారన్నారు. తన క్లైంట్ ఆ సమయంలో గర్భిణిగా ఉందన్నారు. అరెస్టుకు వ్యతిరేకంగా కోర్టులో జరుగుతున్న కేసులో పోలీసు అధికారులు తమ వాదన వినిపిస్తూ, తాము ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీనే నమ్మామని తెలిపారు. అయితే దీనిని పూర్తిగా నమ్మకూడదని, దానిలో చాలా లోపాలు ఉన్నాయన్నారు. ఒక బ్లాక్ ఉమెన్ను అరెస్టు చేయబోయి ఉడ్రఫ్ను అరెస్టు చేశామని తెలిపారు. ఐటీ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో నమ్మదగినది కాదని, దీనిలో మరింత పరిశీలన అవసరమన్నారు. కాగా వేన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఒక ప్రకటనలో ఉడ్రఫ్ అరెస్టు వారెంట్ పటిష్టమైన ప్రాతిపదికన జారీ చేశారన్నారు. వాస్తవాల ఆధారంగా చూస్తే ఈ తరహా వారెంట్ సరైనదేనని అన్నారు. ఈ ఉదంతం జరిగిన రోజున పోలీసులు.. కొందరు ముష్కరుల కారుజాకింగ్ కేసును పరిశోధిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లోని ఒక మహిళను గుర్తించేందుకు పోలీసులు ఒక గ్యాస్ స్టేషన్‌లోని సీసీటీవీ వీడియో ఫుటేజ్ సేకరించారు. వీడియో ఆధారంగా ఫేస్ రికగ్నిషన్ ఎనాలసిస్ జరగగా ఉడ్రఫ్కు సరిపోలిన రూపం కనిపించింది. కోర్టు వాదనల అనంతరం ఉడ్రఫ్ నేరానికి పాల్పడినట్లు సరైన రుజువులు దొరకకపోవడంతో ఆమెను పోలీసులు విడిచిపెట్టారు. అయితే ఈ ఆధునిక టెక్నాలజీ మున్ముందు ఎన్ని సమస్యలను తెచ్చిపెట్టనున్నదోనని పలువురు వాపోతున్నారు. ఇది కూడా చదవండి: ‘ప్రతిరోజూ నా అండర్వేర్ చెక్ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య! -
ఆధార్ ముఖ ధ్రువీకరణ లావాదేవీలు 1.06 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకణ లావాదేవీలు (గుర్తింపు ధ్రువీకరణ) మే నెలలో 10.6 మిలియన్లు (1.06 కోట్లు) నమోదయ్యాయి. ఈ లావాదేవీలు వరుసగా రెండో నెలలో కోటికి పైగా నమోదయ్యాయి. ‘‘ముఖ ధ్రువీకరణ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. నెలవారీ లావాదేవీలు ఈ ఏడాది జనవరి నెలతో పోల్చి చూసినప్పుడు మే నెలలో 38 శాతం అధికంగా నమోదయ్యాయి. దీని వినియోగం పెరుగుతుందన్న దానికి సంకేతం’’అని యూఐడీఏఐ ప్రకటించింది. 2021లో ఈ సేవను ప్రారంభించిన తర్వాత ఒక నెలలో అత్యధికంగా లావాదేవీల నమోదైంది ఈ ఏడాది మే నెలలోనేనని తెలిపింది. ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకరణ సేవలకు డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించింది. యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఏఐ/మెíÙన్ లరి్నంగ్ ఆధారిత ముఖ ధ్రువీకరణ సొల్యూషన్‌ను ప్రస్తుతం 47 సంస్థలు వినియోగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంక్‌లు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, పీఎం కిసాన్ పథకంలో లబి్ధదారుల నమోదుకు, పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సరి్టఫికెట్లు పొందేందుకు ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకరణను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాల ప్రారంభానికీ దీన్ని తీసుకుంటున్నారు. వినియోగానికి సులభంగా ఉండడం, వేగంగా గుర్తింపు ధ్రువీకరణ, ఫింగర్ ప్రింట్, ఓటీపీలతో సౌకర్యవంతంగా ఉంటున్నట్టు యూఐడీఏఐ వివరించింది. మే నెలలో ఆధార్‌కు సంబంధించి 1.48 కోట్ల అప్డేట్ అభ్యర్థనలను కూడా పూర్తి చేసినట్టు తెలిపింది. ఇక బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో ఆధార్ ఈ కేవైసీకి డిమాండ్ పెరుగుతోంది. మే నెలలో 25.4 కోట్ల ఈకేవైసీ లావాదేవీలు నమోదైనట్టు యూఐడీఏఐ ప్రకటించింది. -
ఫేస్ రికగ్నిషన్‌తో అక్రమాలకు అడ్డుకట్ట
తిరుమల: భక్తులకు మెరుగైన సేవలందించేందుకు టీటీడీ ఫేస్ రికగ్నిషన్ అనే నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులకు సులభతరంగా సేవలందించడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చింది. సర్వదర్శనం భక్తులకు, లడ్డూ కౌంటర్లు, గదులు కేటాయింపు, నగదు రీఫండ్ కౌంటర్ల వద్ద బుధవారం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. పనితీరు ఇలా.. ఇప్పటివరకు సర్వ దర్శనం భక్తులకు టోకెన్ జారీ చేసే సమయంలో వారి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసి, వారి ఫొటో తీసుకుని టోకెన్ జారీ చేస్తున్నారు. వారు దర్శనానికి వెళ్లే సమయంలో ఆధార్ కార్డును పరిశీలించి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇకపై ఫేస్ రికగ్నిషన్ విధానంతో వారికి టోకెన్ జారీ చేసే సమయంలోనే ఫొటో తీసుకుంటారు. వారు దర్శనానికి వెళ్ళే సమయంలో ఫేస్ రికగ్నిషన్ అయిన వెంటనే దర్శనానికి అనుమతిస్తారు. దీంతో ఒకరి టోకెన్‌పై మరొకరు దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే..ఫేస్ రికగ్నేషన్లో వారి ఫొటో మ్యాచ్ కాదు. దీంతో అక్రమాలకు చెక్ పెట్టవచ్చని టీటీడీ భావిస్తోంది. లడ్డూ టోకెన్లకు సంబంధించి కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ప్రవేశించే సమయంలో ఫేస్ రికగ్నిషన్ విధానంలో టోకెన్ జారీ చేస్తారు. అదే పద్ధతిలో దర్శనానంతరం లడ్డూ కౌంటర్ వద్ద కూడా ఫేస్ రికగ్నిషన్ అయిన తర్వాతనే లడ్డూలను అందజేస్తారు. దీంతో అక్రమ పద్ధతిలో లడ్డూలు పొందే దళారీ వ్యవస్థకు చెక్ పెట్టవచ్చునని టీటీడీ భావిస్తోంది. ఇదే విధానాన్ని గదుల కేటాయింపు, వాటిని ఖాళీ చేసిన సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లింపునకు వినియోగించనున్నారు. సేవలు సులభతరం ఈ విధానం అమలైతే గదులను దళారులు రొటేషన్ చేసే పద్ధతికి అడ్డుకట్ట వేయవచ్చునని చెబుతున్నారు. గదులు ఖాళీ చేసిన 48 గంటల్లోనే భక్తుల డిపాజిట్లు వారి ఖాతాలో జమవుతుందని అంటున్నారు. ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని విజిలెన్స్ విభాగానికి అనుసంధానం చేస్తే నేర చరిత్ర కలిగిన వారిని సులభతరంగా గుర్తించవచ్చునని, దీంతో నేరాలు జరగకుండా నిరోధించే అవకాశముంది. -
మార్చి ఒకటి నుంచి ఫేస్ రికగ్నిషన్
తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి ఒకటో తేదీ నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా నివారించడానికి, గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. అదేవిధంగా దళారీలను ఏరివేసేందుకు కూడా ఇది ఎంతగానో దోహదపడనుంది. కాగా, తిరుమలలో ఆదివారం అర్ధరాత్రి వరకు 79,555 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టికెట్లు లేని వారికి ఆరు గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీవారిని సోమవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్, ఎస్పీఎఫ్ డీజీ సంతోష్ మెహ్రా, నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ (న్యూఢిల్లీ) దర్శించుకున్నారు. -
వైద్య సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు
భీమవరం(ప్రకాశం చౌక్): పేద, మధ్యతరగతి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత పారదర్శక సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా ఫేస్ రికగ్నేషన్ (ముఖ ఆధారిత) యాప్ ద్వారా హాజరు వేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. గురువారం (డిసెంబర్ 1) నుంచి జిల్లావ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానుంది. ఆయా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది అందరూ ఈ విధానంలోనే హాజరు వేయాల్సి ఉంటుంది. దీనిద్వారా వారు పనిచేస్తున్న ప్రాంతంలోనే నిర్దేశించిన సమయంలోనే హాజరు వేయాల్సి ఉండటంతో విధులకు డుమ్మా కొట్టే అవకాశం ఉండదు. డ్యూటీ సమయంలో వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండి సేవలు అందించేలా ఈ కొత్త యాప్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. రోజుకు మూడు సార్లు చొప్పున.. వైద్యులు, సిబ్బంది రోజుకు మూడుసార్లు ఆస్పత్రిలో ముఖ ఆధారిత యాప్ ద్వారా హాజరు వేయాలి. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 4 గంటలకు హజరు వేయాల్సి ఉంటుంది. రోజుకు మూడుసార్లు కచ్చితంగా హాజరు వేయాల్సిందే. జిల్లాలో 1,212 మంది.. జిల్లాలో ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్యులు, అన్నిరకాల సిబ్బంది కలిపి మొత్తం 1,212 మంది ఉన్నారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 500 మంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 712 మంది ఉన్నారు. 99 శాతం మేర ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. నేటి నుంచి అమలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది అంతా ప్రభుత్వ నూతనంగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా బయోమెట్రిక్ వేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలోని అన్ని ఆస్పత్రుల నుంచి సుమారు 1,212 వైద్య సిబ్బందికి సంబంధించి ప్రక్రియ చేపట్టగా 98 శాతం మేర నమోదు కార్యక్రమం పూర్తి చేశారు. రోజుకు మూడుసార్లు వైద్య సిబ్బంది యాప్ ద్వారా బయోమెట్రిక్ వేస్తారు. –మహేశ్వరరావు, డీఎంహెచ్ఓ, పశ్చిమగోదావరి జిల్లా -
ప్రభుత్వాఫీసుల్లోనూ ఫేస్ రికగ్నిషన్ యాప్
సాక్షి, అమరావతి: త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ వ్యవస్థను తీసుకురానున్నామని.. అందులో భాగంగా తొలుత విద్యాశాఖలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడలో గురువారం ఉపాధ్యా య సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల అటెండెన్స్ నమోదు కోసం రూపొందించిన యాప్ వినియోగంలో ఉన్న అపోహలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడు తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరూ ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్‌నే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా తొలుత విద్యాశాఖ లో దీనిని ప్రవేశపెట్టామన్నారు. అటెండెన్స్ యాప్ విషయంలో ఉపాధ్యాయులు ఎంతమాత్రం ఆందోళ న చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశా రు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని మంత్రి అన్నారు. విద్యార్థుల బాగోగులు, మంచి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా, పూర్తి సానుకూల దృక్పథంతోనే విధానపరమైన నిర్ణయా లు తీసుకుంటున్నామని, వాటిని అమలుచేయడంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించ డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని బొత్స తెలిపా రు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల అటెండెన్స్‌కు సం బంధించిన యాప్ విషయంలో కొంత సమాచార లోపం వచ్చిందని.. దానిని సరిదిద్దే క్రమంలో ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సందేహా లను నివృత్తిచేసే చర్యలు చేపట్టామన్నారు. వారి అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలకు ఆలస్యంగా వస్తే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారన్న ప్రచారం పై మంత్రి స్పష్టతనిస్తూ.. ఉద్యోగుల హాజరు విషయంలో ఏళ్ల తరబడి ఉన్న నిబంధనలనే అమలుచేస్తున్నామని, కొత్తగా ఏమీ చేర్చలేదన్నారు. మూడు సార్లకు మించి నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ కింద పరిగణించడం తప్ప కొత్త నిబంధనలేమీ పెట్టలేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో 1.83 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే, ఇంతవరకు దాదాపుగా లక్ష మంది యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని, మిగిలిన వారందరూ కూడా యా ప్ను డౌన్లోడ్ చేసుకుని దాని వినియోగాన్ని అల వాటు చేసుకునేందుకు 15 రోజులను ట్రైనింగ్ పీరి యడ్గా పరిగణించాలని నిర్ణయించామన్నారు. 5 జూనియర్ కాలేజీలు క్లస్టర్ కళాశాలలుగా మార్పు మరోవైపు.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురంలోని ఐదు జూనియర్ కాలేజీలను గుర్తించి వాటిని క్లస్టర్ జూనియర్ కాలేజీలుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వీటిల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్, లాంగ్వేజ్ల్యాబ్స్, డిజిటల్ బోర్డ్స్ ఇతర ఆధునిక మౌలిక సదుపాయాల ఏర్పాటుపై చర్చిం చారు. ఇంటర్ విద్యాశాఖ సర్వీస్ అంశాలపై ఇంట ర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ప్రిన్సిపాళ్ల పదోన్నతుల సమస్యలపై చర్చించి పరిష్కారం దిశగా పలు ఆదేశాలు జారీచేశారు. కొత్తగా విశాఖపట్నంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి ఆమోదం తెలిపారు. నాడు–నేడు కింద ఉన్న అన్ని జూనియర్ కళాశాలల్లోని అన్ని తరగతులకు డిజిటిల్ బోర్డుల ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు. సమావేశంలో మండలి కార్యదర్శి శేషగిరిబాబు కూడా పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘టీడీపీ కుట్ర బట్టబయలు.. ఫేక్ సర్టిఫికెట్తో దొరికిపోయిన బాబు అండ్ గ్యాంగ్’ -
EPFO: ఇక ఎక్కడి నుంచైనా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
న్యూఢిల్లీ: వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ పీఫ్ ఆఫీస్‌లకు వచ్చి లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించలేని పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) కొత్త వెసులుబాటు కల్పించింది. ఇకపై ఎక్కడి నుంచైనా సరే ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్ సాయంతో డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికెట్‌ను పంపేందుకు అనుమతినిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణాయక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 73 లక్షల మంది పెన్షనర్లలో ఇల్లు విడిచి బయటకు రాలేని వృద్ధులకు లబ్ధి చేకూరనుంది. పెన్షనర్ల కోసం కొత్తగా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. దీంతోపాటు పెన్షన్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకానికి సంబంధించిన కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. స్కీమ్ ప్రయోజనాలను పెన్షనర్, కుటుంబ సభ్యులు ఈ కాలిక్యులేటర్ ద్వారా తెల్సుకోవచ్చు. మరోవైపు, ఈపీఎఫ్‌వో సెక్యూరిటీస్‌కు కస్టోడియన్‌గా సిటీ బ్యాంక్‌ను ఎంపిక చేస్తూ పీఎఫ్ నిర్ణాయక మండలి సీబీటీ నిర్ణయం తీసుకుంది. -
ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు..
పనిదొరక్క ఖాళీగా ఉండే చాలామంది పడే మాట.. ‘ రూపాయి సంపాదించిన మొహమా?’ అని. ఇకపై ఎవరైనా అలా అంటే ‘రూపాయేం కర్మ.. అక్షరాలా కోటిన్నర సంపాదించే మొహం’ అని దర్జాగా సమాధానం చెప్పొచ్చు. నిజం.. రష్యాకు చెందిన ప్రోమోబోట్ సంస్థ మనిషి ముఖం, స్వర హక్కులను కొనుగోలు చేస్తోంది. 2019 నుంచి ఈ సంస్థ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తోంది. అయితే, వీటిని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓ ఉపాయాన్ని ఆలోచించింది. అదే మనిషి ముఖం, వాయిస్‌ల పేటెంట్ రైట్స్‌ను కొనుగోలు చేయటం. ఈ రెండిటిని ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబో తయారు చేస్తే.. రోబోలు మరింత రియలిస్టిక్‌గా కనిపిస్తాయట. అందుకే, ‘25 సంవత్సరాలు లేదా అంతకంటే పైబడిన వారు ఎవరైనా సరే మీ ముఖం, వాయిస్ రైట్స్‌ను మా సంస్థకు అందించొచ్చు. ఇందుకు రెండు లక్షల డాలర్లు (రూ.1,50,43,976) చెల్లిస్తామని’ సంస్థ ప్రకటించింది. అయితే, ముందుకు వచ్చిన అందరినీ వీరు సెలెక్ట్ చేయరు. వివిధ పరీక్షల్లో ఎంపికైన వారి రైట్స్‌నే కొనుగోలు చేస్తారు. ఆ పరీక్షల్లో భాగంగా వంద గంటల ప్రసంగంతో పాటు, వివిధ ఫొటోషూట్లలో పాల్గొనాలి. కొన్ని షరతులనూ అంగీకరించాల్సి ఉంటుంది. అన్నీ నచ్చితే ఇక మీరు కూడా మీ ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు. బాగుంది కదూ! -
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్‌కు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: వృద్ధాప్యం మీదపడుతున్న పెన్షనర్లు సుదూరంలోని సంబంధిత కార్యాలయాలకు తాము నేరుగా వచ్చి లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి వచ్చేది. అలాంటి వారికి లైఫ్ సర్టిఫికెట్ విషయంలో ఎంతగానో సాయపడే కొత్త రకం ఫేస్ రికగ్నేషన్ సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చింది. ప్రతీ సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ శాఖకు సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్‌కు ఇకపై ఒక సాక్ష్యంగా పనికొచ్చే ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని పెన్షన్ల శాఖ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రారంభించారు. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ రూపంలో ఇచ్చేందుకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ ఒక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ వారికి మరింతగా ఉపయోగపడనుందని మంత్రి చెప్పారు. 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతోపాటు ఈపీఎఫ్‌వో, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వారికీ ఈ టెక్నాలజీ సహాయకారిగా ఉంటుందన్నారు. -
మహానగరంలో నేరగాళ్లను పంట్టించే కెమెరాలు
-
‘జాడ’ను ఇట్టే పట్టేయొచ్చు..!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఓ గుర్తు తెలియని మహిళ పోలీసులకు కనిపించింది. ఆమె ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది.. అన్న వివరాలు ఎలా గుర్తించాలో కష్టసాధ్యమైంది. అయితే ప్రస్తుతం పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన టీఎస్‌కాప్ యాప్ ద్వారా క్షణాల్లో ఆ మహిళ వివరాలన్నీ ఆన్లైన్ ద్వారా తెలిసిపోతాయి. రాష్ట్రవ్యాప్తంగా అదృశ్యమైన వారి జాబితా, ఫొటోలు టీఎస్‌కాప్ యాప్‌కు అనుసంధానించారు. దీంతోపాటు అదృశ్యమైన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఫొటోలను ట్యాబ్ ద్వారా తీసి ఫేస్ రికగ్నైజేషన్‌తో సరిపోల్చే సౌకర్యాన్ని పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన మహిళ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించి సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఇలా ఏళ్ల నుంచి ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియని వారి జాడను టెక్నాలజీ ద్వారా సులువుగా గుర్తించే విధానం దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే అందుబాటులోకి వచ్చింది. ‘వాంటెడ్ క్రిమినల్స్’కి సైతం.. నేరాల నియంత్రణలో టెక్నాలజీ వినియోగం పెరిగిపోవడంతో అనుమానిత వ్యక్తులను అక్కడికక్కడే గుర్తించేందుకు ఈ ఫేస్ రికగ్నైజేషన్ ఉపయోగపడుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది. నేరాలు జరిగిన ప్రాంతాలను ఇప్పటికే క్రైమ్ హాట్‌స్పాట్స్‌గా గుర్తించింది. అలాగే 70 వేల మందికి పైగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారి జాబితాను టీఎస్‌కాప్ డేటా సర్వర్లోకి అప్లోడ్ చేశారు. పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో కానీ, నాకాబందీ చేస్తున్న సమయంలో కానీ, వేరే సమయంలో కానీ అనుమానిత వ్యక్తి కనిపిస్తే అతడు పాతనేరస్తుడా.. లేదా కొత్త వ్యక్తా అన్న వివరాలను తెలుసుకునేందుకు ఫేస్ రికగ్నైజేషన్ ఉపయోగపడనుంది. అనుమానితు డిని ట్యాబ్ ద్వారా ఫొటో తీసి టీఎస్‌కాప్ పాత చిత్రంతో పోలుస్తుంది. ఒకవేళ కొత్త వ్యక్తి అయితే వదిలేస్తారు. పాత నేరస్తుడిగా రుజువైతే అదుపులోకి తీసుకొని విచారించేందుకు సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు అనుమానితులపై ఉన్న పాత కేసులను రికార్డులు తిరగేస్తే కానీ తెలిసేవి కావు. ఈ కొత్త విధానం ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఇది కీలకంగా మారుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. మూడు రకాల ఆప్షన్లు.. అదృశ్యమైన వారి వివరాలు, వాంటెడ్ క్రిమినల్స్ వివరాలను సరిపోల్చుకునేందుకు మూడు ఆప్షన్స్‌ను టీఎస్‌కాప్ యాప్‌లో క్రోఢీకరిస్తున్నారు. ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది వాంటెడ్ ఆప్షన్, మూడోది మీడియా ఆప్షన్ కింద అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ నేరంలో అరెస్టయినా మీడియా ముందు ప్రవేశపెట్టినప్పటి ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేశారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు నిందితుల డేటా అప్డేట్ అవడంతో పాటు అదృశ్యమైన వారి వివరాలు యాప్‌లో ఉండేలా చేస్తున్నారు. -
తెల్ల ‘మొహం’
పౌర సరఫరాల వ్యవస్థకు మంగళం పాడేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రేషన్ డిపోల ద్వారా అందించే సరుకులన్నింటినీ ఒక్కొక్కటే కుదించుకుంటూ వచ్చింది. తాజాగా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు ఫేస్ రికగ్నైజేషన్(ముఖాల గుర్తింపు) పరికరాలు ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వేలిముద్రలు పడక, ఈ పోస్ పనిచేయక అవస్థలు పడుతున్న రేషన్‌దారులకు కొత్త పద్ధతిలో మరింత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సాక్షి,విజయవాడ: పేదలకు ఇచ్చిన తెల్లకార్డును రద్దుచేసేందుకు ప్రభుత్వం కొత్తకొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, బయోమెట్రిక్ తదితర విధానాలను ప్రవేశపెట్టింది. అయినప్పటీకీ తెల్ల కార్డులు ఉన్న పేదల సంఖ్య తగ్గలేదు. దీంతో కొత్తగా ఫేస్ రికగ్నైజేషన్ (ముఖ గుర్తింపు) విధానాన్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ–పోస్ మిషన్‌కే కార్డుదారుడు ముఖం నమోదు చేసే కెమెరాను అనుసంధానం చేస్తారు. దాంతో ఆ ముఖాన్ని కార్డుపై ఉన్న ముఖాలతో సరిపోల్చి దాని ఆధారంగా కార్డుదారులను గుర్తించి, సరుకులు పంపిణీ చేస్తారు. కార్డులపై ఉన్న ఫొటో గుర్తింపు ఆధారంగా.. జిల్లాలో 12.57 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతికార్డుకు కార్డుదారుడు, వారి కుటుంబసభ్యుల ఫొటోలను అను సంధానం చేశారు. అయితే ఈ ఫొటోలు స్పష్టంగా లేవు. కుటుంబసభ్యులంతా ఒక గ్రూపుగా తీయించుకున్నారు. దీంతో కొంతమంది ముఖాలు స్పష్టంగా కనపడటం లేదు. అయితే వేలిముద్రలు నమోదు ఆధారంగా ఫొటోలు సరిగా లేకపోయినా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే వృద్ధులకు, కాయకష్టం చేసుకునే వారికి వేలిముద్రలు సరిగా పడక పోవడం వల్ల సరుకులు పూర్తిగా అందడం లేదు. జిల్లాలోనే ప్రతి నెల కనీసం రెండువేల మందికి ఈ విధంగా నిత్యావసరాలు అందడం లేదు. ఇది కాక సర్వర్ మొరాయిస్తూ ఉండటంతో పేదలు గంటలు తరబడి రేషన్ దుకాణాల వద్దనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కొత్తగా ముఖాలు గుర్తింపు పెడితే ఇంకా ఎన్ని ఇబ్బందులు వస్తాయోనని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ఒడిశా తరహాకు భిన్నంగా... ఒడిశాలో ఇప్పటికే ముఖాలు గుర్తింపు ఆధారంగా సరుకులు పంపిణీ జరుగుతోంది. అయితే అక్కడ కార్డుదారుల కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫొటోలను తీసి వేర్వేరుగా ఆన్లైన్ చేశారు. అందువల్ల కార్డులోని ఎవరు సరుకులకు వచ్చినా వెంటనే వారి ఫొటో ఆధారంగా ఈపోస్ మిషన్ వారిని గుర్తిస్తోంది. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా ఫొటోలు తీయకుండా కార్డులో ఉన్న గ్రూపు ఫొటో ఆధారంగా సరిపోల్చాలంటే ఒకొక్క కార్డుకు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు పట్టే అవకాశం ఉంది. 20శాతం మించి ఫొటో గుర్తించకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ముఖాలు సరిగా లేకపోతే మిషన్ గుర్తించకపోతే సరుకులు లభించవు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారుల వాయిస్ రికార్డింగ్ పద్ధతిని ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో ప్రవేశపెట్టింది. అది విజయవంతం కాలేదు. ఇప్పుడు తిరిగి ముఖాల గుర్తింపు పద్ధతి ప్రవేశపెడుతున్నారని ఇది ఎంతమేరకు విజయవంతమవుతుందో చూడాలని పౌరసరఫరాల శాఖాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధానంపై ఆలోచిస్తున్నాం. ఐరిస్, వేలిముద్రలు సరిగా పడని నేపథ్యంలో ముఖాలను గుర్తించే మెషిన్లను పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఆమేరకు కసరత్తు జరుగుతుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మాకు ఏవిధమైన ఉత్తర్వులు అందలేదు. – నాగేశ్వరరావు, డీఎస్వో -
ఆధార్: జూలై 1నుంచి ఫేస్ రికగ్నిషన్
సాక్షి, న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఈఏడాది జనవరిలో ప్రకటించిన ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఆధార్ పరిశీలన కోసం వేలిముద్రలు, కనుపాపలతో పాటు ముఖ గుర్తింపు సదుపాయన్నీ ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు యుఐడిఎఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే అధికారికంగా జూలై 1న లాచ్ చేయనున్నామని గత వారం సుప్రీంకోర్టుకు తెలిపారు. వేలిముద్రలు చెరిగిపోయిన, మసకబారిన వంటి సమస్యల వల్ల బయోమెట్రిక్ వివరాల ధృవీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న(ముఖ్యంగా వృద్ధులు) వారి కోసం ఇలాంటిది తీసుకు వస్తామని జనవరిలోనే యూఐడీఏఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల సుప్రీం కోర్టుకు కూడా ఈ విషయన్ని నివేదించింది. అయితే ఆధార్ ధ్రువీకరణకు ముఖం ఒక్కటే సరిపోదని యూఐడీఏఐ పేర్కొంది. దీనికి అదనంగా వేలిముద్రలు, కంటిపాప, వన్‌టైం పాస్వర్డ్(ఓటీపీ)ల్లో ఒకదాన్ని కూడా సరిపోల్చాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది. -
ముఖాలను గుర్తించే తొలి ఏటీఎం
బీజింగ్: ప్రపంచంలో మనమెక్కడైనా మన బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ టెల్లర్ మషన్ (ఏటీఎం)ల ద్వారా మనకు అవసరమైన సొమ్మును తీసుకోవాలంటే కార్డులను ఉపయోగించడంతోపాటు పిన్ నెంబర్‌ను ఫీడ్ చేయడం ప్రస్తుతం సంప్రదాయంగా వస్తున్న విధానం. మన కార్డును ఇతరుల ఉపయోగించి సరైన పిన్ నెంబర్ ఎవరు ఫీడ్ చేసినా వారు మన ఖాతా నుంచి సొమ్ము తీసుకునే అవకాశం ఈ విధానం కల్పిస్తుంది. దీనివల్ల మన సొమ్మును ఇతరులు చోరీచేసే అవకాశమూ ఉంది. ఇక అలాంటి అవకాశానికి ఆస్కారం లేకుండా చైనాకు చెందిన ఇంజనీర్లు ప్రపంచంలోనే తొలిసారిగా ఖాతాదారుల ముఖాన్ని గుర్తించే ఏటీఎం టెక్నాలజీని సృష్టించారు. సింగువా యూనివర్శిటీ, హాంగ్జౌలోని జెక్వాన్ టెక్నాలజీ ఈ ఆధునిక ఏటీఎం టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీని పనితీరును చైనాలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రదర్శించినట్టు ‘పీపుల్స్ డెయిలీ ఆన్లైన్’ వెల్లడించింది. ఈ ఏటీఎంలో కార్డును పెట్టగానే అందులోని బిల్ట్ ఇన్ కెమేరా పని చేయడం ప్రారంభమవుతుంది. ఖాతాదారుని ముఖాన్ని అది స్కాన్ చేస్తుంది. బ్యాంకు ఖాతాలో నిక్షిప్తమైన మీ ఐడీ ఫొటోతో సరిపోల్చుకుంటుంది. స్కానింగ్ ఫొటో బ్యాంకులోని ఖాతాదారుడి ఫొటోతో సరిపోలినప్పుడు మాత్రమే లావా దేవీలను అనుమతిస్తుందని జెక్వాన్ టెక్నాలజీ చైర్మన్ గూ జికున్ మీడియాకు వివరించారు. ఈ రకమైన ఏటీఎం ప్రపంచంలో ఇదే మొదటిదని, త్వరలోనే ఈ ఏటీఎంలను మార్కెట్లో ప్రవేశపెడుతున్నామని ఆయన చెప్పారు. ఈ ఏటీఎంలలో మరో విశేషముందని, చైనా కరెన్సీతో ప్రపంచంలోని 256 దేశాల విదీశీ కరెన్సీగా మార్చుకునే సౌలభ్యం కూడా ఆందని ఆయన వివరించారు.