బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ప్రయోగాత్మకంగా అమలు
ఉదయం ప్రార్థనకు ముందు.. సాయంత్రం స్కూల్ తర్వాత..
52 హాస్టళ్లలో ప్రయోగాత్మకంగా అమలుకు ప్రతిపాదన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఫేస్ రికగ్నిషన్ (ఎఫ్‌ఆర్‌ఎస్) పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీన్లో భాగంగా తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు రెండు హాస్టళ్లను ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,100 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉంటే వాటిలో 52 హాస్టళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనుంది వాటికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను కూడా పూర్తిచేసిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.
ప్రభుత్వం వారం రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని సర్వీస్ ప్రొవైడర్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను ఆయా వసతి గృహాలకు చెందిన హాస్టల్ సంక్షేమ అధికారి (హెచ్‌డబ్ల్యూఓ)కి అప్పగించనున్నారు. ఎంపిక చేసిన ప్రతి హాస్టల్‌కు చెందిన విద్యార్థుల ఫొటోలు తీసి, ఆథార్, ఫోన్ నంబర్, చిరునామా, తరగతి తదితర వివరాలను ఆయా యాప్‌ల్లో అప్‌లోడ్ చేస్తారు.
తద్వారా యాప్ ఉన్న మొబైల్ ఫోన్, పరికరాల్లోనూ విద్యార్థి ముఖం చూపిస్తే హాజరు పడుతుంది. ఇలా ఉదయం ప్రార్థన, సాయంత్రం స్కూల్ సమయం తర్వాత ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు సేకరిస్తారు. తద్వారా ఏఏ వసతి గృహాల్లో ఏ రోజు ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? మిగిలిన వాళ్లు ఎందుకు రాలేదు? తదితర హాజరు సంబంధ సమాచారంతోపాటు, హాస్టల్ సంక్షేమ అధికారుల అలసత్వాన్ని, నిర్వహణ లోపాలపై తదుపరి చర్యలు తీసుకునే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment