హైదరాబాద్: రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టళ్లలోని నెలకొన్న సమస్యలన్నింటినీ 15 రోజుల్లో పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి రావెల మాట్లాడుతూ ... రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్ల తనిఖీల్లో భాగంగా హాస్టళ్లకు వెళ్లినప్పుడు వార్డెన్స్ ఉంటున్నారని... దీంతో ఏ విద్యార్థి సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు రావడం లేదని తెలిపారు.
హాస్టల్ విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయడం కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ నెంబర్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల విద్యార్థులు తమ సమస్యను ఫోన్ చేసి ఏకరువు పెడుతున్నారని రావెల పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.
అలాగే పత్తికొండ ఎస్సీ హాస్టల్లో బాత్రూమ్లు లేవని, తాగునీటి వసతి, వంటగదులు లేవని విద్యార్థి జ్యోత్స్య ఫిర్యాదు చేసిందని రావెల తెలిపారు. అలాగే యూనిఫామ్ రెండు జతలే ఇచ్చారని మరో విద్యార్థి ఫిర్యాదు చేసిందని చెప్పారు. హాస్టల్ అసలు బాగోలేదని రేకుల షెడ్డులో ఉంచడం వల్ల వర్షం వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని బ్రహ్మదేవి హాస్టల్ విద్యార్థి ఫిర్యాదు చేసిందని రావెల వివరించారు.