కునారిల్లుతున్న హాస్టళ్లు | Hostels problems | Sakshi
Sakshi News home page

కునారిల్లుతున్న హాస్టళ్లు

Published Sat, Jan 30 2016 3:45 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

కునారిల్లుతున్న హాస్టళ్లు - Sakshi

కునారిల్లుతున్న హాస్టళ్లు

♦ నాసిరకం సన్నబియ్యం.. మౌలిక వసతులు కరువు
♦ రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లపై సర్వేలో వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి దళారుల చీడ అంటుకుంది. ‘సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉంటోంది. మిల్లర్లు, పంపిణీదారులు ఫైన్ క్వాలిటీకి బదులు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది..’ అని ఇటీవల హాస్టళ్లలో సర్వే నిర్వహించిన కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ ఎత్తి చూపింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉంటోందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని... మండలం యూనిట్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను విలీనం చేసి  సమీకృత (ఇంటిగ్రేటేడ్) హాస్టళ్లను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. విద్యా సంవత్సరం ముగిసే సమయం దగ్గరపడుతున్నా చాలా హాస్టళ్లలో విద్యార్థులకు యూనిఫారాలు పంపిణీ చేయలేదని స్పష్టం చేసింది. ఇటీవలి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళిక విభాగం కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ (సీఎస్‌డీ) ఆధ్వర్యంలో సర్వే చేయించింది. రాష్ట్రంలోని మొత్తం 1,394 హాస్టళ్లు, సగం రెసిడెన్షియల్ స్కూళ్లలో హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం, కొత్తగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మౌలిక సదుపాయాల పరిస్థితిని సీఎస్‌డీ అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా గుర్తించిన లోటుపాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను ఇటీవలే ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు సమర్పించింది. ఆ నివేదికలో ప్రణాళికా విభాగం ప్రస్తావించిన పలు కీలకమైన అంశాలు..

► హాస్టళ్ల నిర్వహణ సాఫీగా జరిగేందుకు మండలాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను విలీనం చేసి ఇంటిగ్రేటేడ్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని 41 శాతం హాస్టళ్లలో 70 మందికి మించి విద్యార్థులు లేరు.
► 2011లో నిర్ణయించిన డైట్ చార్జీలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఏడాదికోసారి డైట్ చార్జీలను సవరించాలి. రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ చార్జీలు కొంత మెరుగ్గా ఉన్నా... పెరిగిన ధరల దృష్ట్యా మరికొంత పెంచాల్సిన అవసరముంది.
► ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టల్ భవనాలు అధ్వానంగా ఉన్నాయి. వాటి నిర్వహణను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.
► విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించేందుకు కొన్ని హాస్టళ్లలో అమర్చిన ఆర్‌వో ప్లాంట్లు పనిచేయడం లేదు. హాస్టళ్ల నిర్వహణకు ఇచ్చే నిధులు తక్కువగా ఉండడంతో వాటికి మరమ్మతులు చేయటం లేదు.
► అత్యధిక హాస్టళ్లలో టాయిలెట్లు, పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వానంగా ఉంది. గ్రామపంచాయతీ లేదా ఇతర సిబ్బందితో వీటి నిర్వహణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి.
► హాస్టల్ వార్డెన్లు, ఉన్నత పాఠశాలల్లోని హెడ్‌మాస్టర్లకు మధ్య సమన్వయాన్ని మెరుగుపరించేందుకు చర్యలు చేపట్టాలి. దాంతో హాస్టల్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి.
► బీసీ హాస్టళ్లలో పదో తరగతి వారికి బోధించే ట్యూటర్లకు ఇచ్చే వేతనాన్ని ఎస్సీ హాస్టళ్లలో ఇస్తున్న స్థాయికి పెంచాలి. ఎనిమిదో తరగతి ► హాస్టళ్లన్నిటా దాదాపు 20 శాతం విద్యార్థులు గైర్హాజరవుతున్నారు. ఎస్సీ హాస్టళ్లలో అమల్లో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని అన్ని హాస్టళ్లకు విస్తరించాలి. హాజరు విధానం సంక్లిష్టంగా ఉండకుండా సరళం చేయాలి.
► చాలా హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారికి రెండు మూడు హాస్టళ్ల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో నిర్వహణపై ప్రభావం కనబడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement