తిరుమల: భక్తులకు మెరుగైన సేవలందించేందుకు టీటీడీ ఫేస్ రికగ్నిషన్ అనే నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులకు సులభతరంగా సేవలందించడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చింది. సర్వదర్శనం భక్తులకు, లడ్డూ కౌంటర్లు, గదులు కేటాయింపు, నగదు రీఫండ్ కౌంటర్ల వద్ద బుధవారం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది.
పనితీరు ఇలా..
ఇప్పటివరకు సర్వ దర్శనం భక్తులకు టోకెన్ జారీ చేసే సమయంలో వారి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసి, వారి ఫొటో తీసుకుని టోకెన్ జారీ చేస్తున్నారు. వారు దర్శనానికి వెళ్లే సమయంలో ఆధార్ కార్డును పరిశీలించి దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఇకపై ఫేస్ రికగ్నిషన్ విధానంతో వారికి టోకెన్ జారీ చేసే సమయంలోనే ఫొటో తీసుకుంటారు. వారు దర్శనానికి వెళ్ళే సమయంలో ఫేస్ రికగ్నిషన్ అయిన వెంటనే దర్శనానికి అనుమతిస్తారు. దీంతో ఒకరి టోకెన్‌పై మరొకరు దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే..ఫేస్ రికగ్నేషన్‌లో వారి ఫొటో మ్యాచ్ కాదు. దీంతో అక్రమాలకు చెక్ పెట్టవచ్చని టీటీడీ భావిస్తోంది.
లడ్డూ టోకెన్లకు సంబంధించి కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ప్రవేశించే సమయంలో ఫేస్ రికగ్నిషన్ విధానంలో టోకెన్ జారీ చేస్తారు. అదే పద్ధతిలో దర్శనానంతరం లడ్డూ కౌంటర్ వద్ద కూడా ఫేస్ రికగ్నిషన్ అయిన తర్వాతనే లడ్డూలను అందజేస్తారు. దీంతో అక్రమ పద్ధతిలో లడ్డూలు పొందే దళారీ వ్యవస్థకు చెక్ పెట్టవచ్చునని టీటీడీ భావిస్తోంది. ఇదే విధానాన్ని గదుల కేటాయింపు, వాటిని ఖాళీ చేసిన సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లింపునకు వినియోగించనున్నారు.
సేవలు సులభతరం
ఈ విధానం అమలైతే గదులను దళారులు రొటేషన్ చేసే పద్ధతికి అడ్డుకట్ట వేయవచ్చునని చెబుతున్నారు. గదులు ఖాళీ చేసిన 48 గంటల్లోనే భక్తుల డిపాజిట్లు వారి ఖాతాలో జమవుతుందని అంటున్నారు. ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని విజిలెన్స్ విభాగానికి అనుసంధానం చేస్తే నేర చరిత్ర కలిగిన వారిని సులభతరంగా గుర్తించవచ్చునని, దీంతో నేరాలు జరగకుండా నిరోధించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment