ముఖాలను గుర్తించే తొలి ఏటీఎం
బీజింగ్: ప్రపంచంలో మనమెక్కడైనా మన బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ టెల్లర్ మషన్ (ఏటీఎం)ల ద్వారా మనకు అవసరమైన సొమ్మును తీసుకోవాలంటే కార్డులను ఉపయోగించడంతోపాటు పిన్ నెంబర్‌ను ఫీడ్ చేయడం ప్రస్తుతం సంప్రదాయంగా వస్తున్న విధానం. మన కార్డును ఇతరుల ఉపయోగించి సరైన పిన్ నెంబర్ ఎవరు ఫీడ్ చేసినా వారు మన ఖాతా నుంచి సొమ్ము తీసుకునే అవకాశం ఈ విధానం కల్పిస్తుంది. దీనివల్ల మన సొమ్మును ఇతరులు చోరీచేసే అవకాశమూ ఉంది. ఇక అలాంటి అవకాశానికి ఆస్కారం లేకుండా చైనాకు చెందిన ఇంజనీర్లు ప్రపంచంలోనే తొలిసారిగా ఖాతాదారుల ముఖాన్ని గుర్తించే ఏటీఎం టెక్నాలజీని సృష్టించారు. సింగువా యూనివర్శిటీ, హాంగ్‌జౌలోని జెక్వాన్ టెక్నాలజీ ఈ ఆధునిక ఏటీఎం టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీని పనితీరును చైనాలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రదర్శించినట్టు ‘పీపుల్స్ డెయిలీ ఆన్‌లైన్’ వెల్లడించింది.
ఈ ఏటీఎంలో కార్డును పెట్టగానే అందులోని బిల్ట్ ఇన్ కెమేరా పని చేయడం ప్రారంభమవుతుంది. ఖాతాదారుని ముఖాన్ని అది స్కాన్ చేస్తుంది. బ్యాంకు ఖాతాలో నిక్షిప్తమైన మీ ఐడీ ఫొటోతో సరిపోల్చుకుంటుంది. స్కానింగ్ ఫొటో బ్యాంకులోని ఖాతాదారుడి ఫొటోతో సరిపోలినప్పుడు మాత్రమే లావా దేవీలను అనుమతిస్తుందని జెక్వాన్ టెక్నాలజీ చైర్మన్ గూ జికున్ మీడియాకు వివరించారు. ఈ రకమైన ఏటీఎం ప్రపంచంలో ఇదే మొదటిదని, త్వరలోనే ఈ ఏటీఎంలను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నామని ఆయన చెప్పారు. ఈ ఏటీఎంలలో మరో విశేషముందని, చైనా కరెన్సీతో ప్రపంచంలోని 256 దేశాల విదీశీ కరెన్సీగా మార్చుకునే సౌలభ్యం కూడా ఆందని ఆయన వివరించారు.