పుర్రె భాగాన్ని స్కాన్‌చేసి వ్యక్తులను గుర్తించే ఏఐ సాంకేతికత ‘దివ్యదృష్టి’ను తయారు చేసినట్లు రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) తెలిపింది. డీఆర్‌డీఓ ఏర్పాటు చేసిన ‘డేర్ టు డ్రీమ్ ఇన్నోవేషన్ కంటెస్ట్ 2.0’లో ఈ టెక్నాలజీను ఆవిష్కరించిన ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ విజేతగా నిలిచిందని చెప్పింది.
డీఆర్‌డీఓ తెలిపిన వివరాల ప్రకారం..‘దేశవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డేర్ టు డ్రీమ్ ఇన్నోవేషన్ కంటెస్ట్ 2.0ను ఏర్పాటు చేశాం. అందులో భాగంగా కొత్త ఏఐ టూల్‌ను పరిచయం చేసిన ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ గెలుపొందింది. శివాని వర్మ అనే మహిళా వ్యాపారవేత్త ఈ కంపెనీను స్థాపించారు. సంస్థ తయారు చేసిన ‘దివ్యదృష్టి’ అనే ఏఐ టూల్ ద్వారా విభిన్న వ్యక్తులను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. ఇందులో భాగంగా మానవుల పుర్రె భాగాన్ని వివిధ శారీరక పరామితులను ఉపయోగించి స్కాన్ చేస్తారు. పుర్రె పరిమాణం, అందులోని ఇతర పరామితులు వ్యక్తులనుబట్టి మారుతాయి. దాంతో విభిన్న వ్యక్తుల ముఖాలను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. అడ్వాన్స్‌డ్ బయోమెట్రిక్ సాంకేతికతను కూడా ఈ ‘దివ్యదృష్టి’లో ఉపయోగించారు.
కొత్తగా కనుగొన్న ఏఐ టూల్‌ను రక్షణ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్, కార్పొరేట్, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా విభిన్న రంగాల్లో వినియోగించవచ్చని డీఆర్‌డీఓ తెలిపింది. బెంగళూరులోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్(సీఏఐఆర్) మార్గదర్శకత్వంతో ఈ టూల్‌ను కనుగొన్నట్లు ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ తెలిపింది.
ఇదీ చదవండి: మార్కెట్ ట్రెండ్ గమనిస్తున్నారా? ఇప్పుడేం చేయాలంటే..
డిఫెన్స్ ఆర్ అండ్ డీ సెక్రటరీ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ..కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేలా డీఆర్‌డీఓ అనుసరిస్తున్న మార్గాలు అభినందనీయమన్నారు. ‘దివ్యదృష్టి’ అభివృద్ధికి టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ (టీడీఎఫ్) సహాయం చేయడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న ఫేస్ రికాగ్నిషన్ టెక్నాలజీలో కేవలం ముఖ కవలికలు, ముక్కు, కళ్లు, కనుబొమ్మలు.. వంటి భాగాలను స్కాన్ చేసి వ్యక్తులను గుర్తిస్తున్నారు. అయితే దాదాపు ఒకేలా ఉన్న వ్యక్తులను ఈ టెక్నాలజీతో కనిపెట్టడం కొంత కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చిన ‘దివ్యదృష్టి’ ఏకంగా పుర్రె భాగాలను స్కాన్ చేస్తుంది కాబట్టి మరింత కచ్చితత్వంతో కనిపెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment