ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ వేలిముద్రల ఉదంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తోంది. తెలంగాణలో సిమ్‌కార్డుల అమ్మకాల కోసం నకిలీ వేలిముద్రలు తయారు చేసిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ నుంచి కాపీల డౌన్‌లోడ్‌ను నిలిపివేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ సర్వర్‌ను నిలిపివేసింది.
పెద్దపల్లి జిల్లాలో బయటపడిన నకిలీ వేలిముద్రల కుంభకోణంలో నిందితుడు సంతోష్‌కుమార్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ నుంచి డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేశాడన్న సంగతి తెలిసిందే. వాటి ఆధారంగా నిందితుడు నకిలీ వేలిముద్రలు తయారు చేయడంతో ఆధార్ బయోమెట్రిక్ భద్రత సవాలుగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే దాదాపు 7.4 లక్షల సర్టిఫైడ్ రిజిస్ట్రేషన్ కాపీలు జారీ కాగా.. విజయవాడ, గుంటూరు జిల్లాల్లోనే 2.5 లక్షల డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ అయ్యాయని అధికారులు తెలిపారు. వీటిలో కొన్నింటిని నకిలీ ఆధార్, సిమ్ కార్డులు పొందడానికి వినియోగించినట్టు ఏపీ, కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో వెలుగుచూసిన నకిలీ వేలిముద్రల స్కాం తరహాలో ఏపీలో కూడా ఏమైనా అవకతవకలు జరిగాయా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment