సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రజలను పస్తులు ఉంచుతూ.. విమర్శలకు తావునిస్తోంది. ఆధార్ డేటా ఆధారంగా రేషన్ కోసం ప్రవేశపెట్టిన బయో మెట్రిక్ విధానం విఫలం కావటంతో .. ఐరిష్ స్కాన్, ఓటీపీల ద్వారా రేషన్ సరుకులు అందిస్తామని ప్రకటించించింది. అయితే రెండువారాలు గడుస్తున్నా ఇంత వరకు ఆ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శలకు దిగింది.
బయో మెట్రిక్ విధానం... అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1న ఓ కొత్త నిర్ణయం ప్రకటించింది. ఆధార్ కార్డులోని డేటాతో వేలి ముద్రలు సరిపోతేనే రేషన్ అందిస్తామని స్పష్టం చేసింది. రేషన్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించి.. అర్హులైనవారికి లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని సర్కార్ ప్రకటించింది. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అవేం పట్టించుకోని ప్రభుత్వం ఢిల్లీలోని 2,255 రేషన్‌షాపులకు ఈ-పీవోఎస్(e-PoS.. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను అందించింది.
అయితే ఆధార్‌డేటాతో కొందరు లబ్ధిదారుల వేలిముద్ర మ్యాచ్ కాలేదు. దీంతో రేషన్ ఇచ్చేందుకు డీలర్లు నిరాకరించగా.. లబ్ధిదారులంతా ఆందోళన వ్యక్తం చేశారు. విషయం అధికారుల దృష్టికి రావటంతో తక్షణ చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా కంటిపాపల్ని స్కాన్ చేసి కొత్తగా పాస్‌వర్డ్‌లు ఇస్తామని, తద్వారా రేషన్ పొందొచ్చని ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 15న తేదీ నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. తీరా కార్యాలయానికి వెళ్లిన లబ్ధిదారులు మళ్లీ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అధికారులెవరూ అక్కడ లేరని, ఉన్నవారు కూడా స్పందించటం లేదని, తాము పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి వివరణ... విమర్శలపై ఢిల్లీ ఆహార శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ స్పందించారు. వైఫై కనెక్టివిటీ మూలంగానే సమస్య ఉత్పన్నమైందని.. పునరుద్ధరించి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొత్తం 15 లక్షల మంది రేషన్ లబ్ధిదారుల్లో 98 శాతం మంది రేషన్ తీసేసుకున్నారని.. 2 శాతం(26, 650 మంది) మాత్రం అందుకోలేకపోయారని ఆయన చెబుతున్నారు.
ఖండించిన రేషన్ డీలర్లు... అయితే రేషన్ డీలర్లు మాత్రం మంత్రి వాదనను కొట్టిపడేస్తున్నారు. రేషన్ డీలర్ల సంఘం సెక్రెటరీ సౌరభ్ గుప్తా స్పందిస్తూ... ‘‘ నా సొంత వైఫైతో కనెక్ట్ చేసినా మెషీన్లు పని చేయటం లేదు. బేల్(BEL) నుంచి వచ్చిన ఇంజనీర్లు యాంటీనాలు ఇచ్చారు. కానీ, అవి కూడా ఇప్పుడు పని చేయటం లేదు’’ అని తెలిపారు. అంతేకాదు 98 శాతం మందికి రేషన్ అందుతుందా? అన్న ప్రశ్నకు గుప్తా నుంచి సరైన సమాధానం అందలేదు.
ఈ గొడవలేమీ లేకుండా మాన్యువల్‌గా రేషన్ సరుకులు ఇవ్వాలని షాపులకు ఆదేశాలు అందినప్పటికీ.. అవి కూడా సక్రమంగా అమలు కావటం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.
బీజేపీ విమర్శలు.. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు. ఓ పద్ధతి ప్రకారం నడుస్తున్న వ్యవస్థను కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రయోగాలతో చెడగొట్టి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోందని తివారీ విమర్శించారు. (ఎన్డీటీవీ సర్వే కథనం ప్రకారం...)
Comments
Please login to add a commentAdd a comment