ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు వేలిముద్రల లింక్
విద్యా సంవత్సరం చివరిలో వింత ఆలోచన
ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో విద్యార్థుల అవస్థలు
కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్న కళాశాలల యాజమాన్యాలు
ఖమ్మం, న్యూస్‌లైన్:
స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇప్పటికే ఆధార్‌కార్డు అనుసంధానంతో అవస్థలు పడుతున్న విద్యార్థులకు ఇప్పుడు బయోమెట్రిక్ భయం పట్టుకుంది. మరో మూడు నెలల్లో విద్యాసంవత్సరం పూర్తి కావస్తుండగా ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన వింత ఆలోచనతో అటు కళాశాల యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు విద్యార్థుల వేలిముద్రలు సేకరించే పని పెట్టుకుంటే విలువైన సమయం వృథా అవుతుందని, అనుసంధానం అయ్యేది ఎప్పుడు.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యేది ఎప్పుడు.. అని యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయి. వచ్చే
విద్యాసంవత్సరం వరకైనా దీనిని వాయిదా వేయాలని కోరుతూ పలు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతున్నాయి.
పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్నత విద్యనభ్యసించే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర చదువుల వారికి స్కాలర్‌షిప్‌లను ఎలాంటి నిబంధనలు లేకుండా అందించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వీటికి కోత పెట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ రెన్యువల్ కోసం ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ పలుచోట్ల ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, నమోదు చేసుకున్నా కార్డులు చేతికి అందకపోవడంతో ఇంకా 14 వేల మందికి పైగా విద్యార్థులు రెన్యువల్ చేసుకోలేదు. ఇప్పుడు కొత్త స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు పాత వాటి రెన్యువల్‌కు బయోమెట్రిక్ విధానం తప్పనిసరి అని, దీని ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ సైట్‌కు విద్యార్థుల డేటా వస్తే తప్ప నిధులు మంజూరు కావని ప్రభుత్వం మెలిక పెట్టింది. వెంటనే బయోమెట్రిక్ మిషన్‌లు కొనుగోలు చేసి విద్యార్థుల వేలిముద్రలు సేకరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పాటు కళాశాలల యాజమాన్యాలకు బయోమెట్రిక్ విధానంపై శిక్షణ కూడా ఇచ్చారు.
విద్యా సంవత్సరం చివరిలో వింత పోకడ...
మరో మూడు నెలల్లో విద్యాసంవత్సరం ముగియనుంది. ఈ సమయంలో ప్రభుత్వ వింత ఆలోచనతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. బయోమెట్రిక్ విధానం అమలుకు ముందుగా కళాశాల యాజమాన్యాలు ఆయా యంత్రాలను కొనుగోలు చేయాలి. విద్యార్థి వేలిముద్ర, కళాశాల ప్రిన్సిపాల్ వేలిముద్రను స్కాన్‌చేసి ఆధార్ కార్డు, ఈ పాస్ దరఖాస్తుతోపాటు విద్యార్థి పూర్తి డేటాను ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. ఇది జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సైట్‌కు అనుసంధానం అయితేనే నిధులు విడుదలవుతాయి. జిల్లాలో రెన్యువల్ విద్యార్థులు 65,196 మంది, 56 వేలకు పైగా కొత్త విద్యార్థుల వేలిముద్రలు అనుసంధానం చేయాలంటే ఈ తంతు ముగిసేటప్పటికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. దీనికి తోడు పరీక్షల ముందు తమ విలువైన సమయం వృథా అవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
బయోమెట్రిక్ విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడితే విద్యార్థి స్కాలర్‌షిప్ దరఖాస్తు సమర్పించేటప్పుడే ఆధార్, బయోమెట్రిక్ తంతు కూడా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేయడం ఇబ్బందికరమని, దీనిని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని కోరుతూ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
బయోమెట్రిక్ భయం
Published Thu, Dec 26 2013 2:41 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement