నల్లగొండ : సన్నబియ్యం సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. 2015 జనవరి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ప్రభుత్వ వసతి గృహాలకు పంపిణీ చేసే సన్నబియ్యానికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు ఈపాస్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ రేషన్ బియ్యం సరఫరాకు సంబంధించి ఈపాస్ విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో ప్రతినెలా వందల క్వింటాళ్ల బియ్యం మిగులుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ ఇటీవల జిల్లా పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరాలో కూడా ఈపాస్ విధానాన్ని అమలు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు.
సన్నబియ్యం అక్రమాలకు అడ్డుకట్ట
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఒకటినుంచి10వ తరగతి వరకు అమలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతి విద్యార్థికి 1 నుంచి 5వ తరగతి వారికి 100 గ్రాములు, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 150 గ్రాముల భోజనాన్ని పెడుతున్నారు. అదే విధంగా హాస్టల్ విద్యార్థులకు రోజూ 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 500 గ్రాములు, 6 నుంచి 10వ తరగతి వారికి 600 గ్రాముల భోజనాన్ని అందిస్తున్నారు. పాఠశాలలకు విద్యార్థులు హాజరు కాకున్నా వచ్చినట్లుగా లెక్కలు చూపి అక్కడక్కడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడంలేదు. వారు ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న భోజనాన్నో, ఇంటికి వెళ్లి తిని రావడమో చేస్తున్నారు. అలాంటి వారిని కూడా మధ్యాహ్న భోజనం చేసినట్లుగా తప్పుడు లెక్కలు రాస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. హాస్టళ్లలో కూడా అదే పరిస్థితి. విద్యార్థులు ఇళ్లకు వెళ్లినా వాళ్లు హాస్టల్‌లో ఉన్నట్లుగానే లెక్కలు సృష్టించి సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ అధికారులు సన్నబియ్యాన్ని డ్రా చేస్తున్నారు. అలా అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఈపాస్ ద్వారానే అడ్డుకట్ట వేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
ప్రస్తుతం అమలవుతున్న విధానం
ప్రస్తుతం ఎంఈఓలు ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అనుగుణంగా ఎంఈఓలు, తహసీల్దార్లకు లెక్కలు అందిస్తున్నారు. వారు ఇండెంట్ పెడితే దాని ఆధారంగా సంబంధిత రేషన్ షాప్‌నకు సన్నబియ్యం వస్తున్నాయి. అక్కడినుంచి పాఠశాలలకు తీసుకెళ్తున్నారు.
పనిచేయని బయోమెట్రిక్
వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు తీసుకునేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నా అవి వాడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం బయోమెట్రిక్‌ను కచ్చితంగా అమలు చేయడంతోపాటు బియ్యం సరఫరాలో ఈపాస్ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.
స్కూల్, హాస్టల్ అధికారుల వేలిముద్రలతో బియ్యం సరఫరా
పాఠశాలకు సరఫరా అయ్యే బియ్యం సరఫరాకు సంబంధించి రేషన్‌షాపుల నుంచి కాకుండా నేరుగా సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఆ పాఠశాలలకు సంబంధించి బియ్యాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తి వేలిముద్ర తీసుకొని ఇవ్వనున్నారు. అదే విధంగా హాస్టల్‌కు సంబంధించి వేలిముద్ర ఆధారంగా బియ్యాన్ని ఇస్తారు. తద్వారా బియ్యం పక్కదారి పట్టదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో నేరుగా పాఠశాల, హాస్టల్ వారు ఎన్ని బియ్యం తీసుకున్నారని తేలిపోతుంది. అక్కడ విద్యార్థులకు వండిపెడతారు. అక్కడ ప్రతి నెలా మిగిలిన బియ్యం బయటికి తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ పాస్ విధానం అమలు చేయడం ద్వారా సన్నబియ్యంలో అక్రమాలకు అడ్డుకట్టపడి సక్రమంగా పిల్లలకు భోజనం అందే అవకాశం ఉంది.
సన్నబియ్యం సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట
Published Fri, May 10 2019 9:23 AM | Last Updated on Fri, May 10 2019 9:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment