‘గ్యారంటీలు’ అమలు చేస్తున్నాం | Govt spending Rs 6. 5 lakh crore annually on agriculture, farmers welfare | Sakshi
Sakshi News home page

‘గ్యారంటీలు’ అమలు చేస్తున్నాం

Published Sun, Jul 2 2023 5:17 AM | Last Updated on Sun, Jul 2 2023 8:07 AM

Govt spending Rs 6. 5 lakh crore annually on agriculture, farmers welfare - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ రంగంతోపాటు రైతన్నలపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.6.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హామీల గురించి కేవలం మాటలు చెప్పడం లేదని, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసి చూపిస్తున్నామని అన్నారు. శనివారం ఢిల్లీలో 17వ భారత సహకార సదస్సులో మోదీ మాట్లాడారు. సహకార సంఘాలు రాజకీయాలను పక్కనపెట్టి సామాజిక, జాతీయ విధానాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

పారదర్శక, అవినీతి రహిత పాలనకు నమూనాగా మారాలని సూచించారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని చెప్పారు. వంట నూనెలు, తృణధాన్యాలు, శుద్ధి చేసిన ఆహారం, చేపల దాణాను దిగుమతి చేసుకోవడానికి మనం ఏటా రూ.2.5 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని, ఈ భారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వంట నూనెల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో నూనె గింజలు, తృణ ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సహకార సంఘాలు కృషి చేయాలని కోరారు.  

చేసిందే చెబుతున్నాం..
గత తొమ్మిదేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని ప్రధాని మోదీ వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో చౌక ధరలకే రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో భారీ మొత్తంలో పంటలను సేకరిస్తున్నామని చెప్పారు. పీఎం–కిసాన్‌ పథకం కింద నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు బదిలీ చేస్తున్నామని తెలిపారు. గత నాలుగేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు బదిలీ చేశామన్నారు. ప్రజలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఇస్తున్న గ్యారంటీలపై మోదీ వ్యంగ్యా్రస్తాలు విసిరారు.

ప్రతి రైతుకు ఏటా వివిధ రూపాల్లో రూ.50,000  లబ్ధి చేకూరుతోందని, ఇది నరేంద్ర మోదీ ఇస్తున్న గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. చేసిందే చెబుతున్నామని పేర్కొన్నారు. ఎంఎస్‌పీ ద్వారా గత తొమ్మిదేళ్లలో రైతులకు రూ.15 లక్షల కోట్లకుపైగా సొమ్ము అందజేశామని తెలియజేశారు. ఎరువుల రాయితీ కోసం ఏకంగా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంతకంటే పెద్ద గ్యారంటీ ఏముంటుందని ప్రశ్నించారు. మన దేశంలో రైతులకు ఒక్కో ఎరువు బస్తా కేవలం రూ.270కే లభిస్తోందని, అమెరికాలో దీని ధర రూ.3,000 పైగానే ఉందన్నారు. రైతుల జీవితాలను మార్చాలంటే చిన్న ప్రయత్నాలు సరిపోవు, భారీ ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు.

విపక్షాల ఐక్యత నిలిచేది కాదు
షాదోల్‌: ప్రతిపక్షాలు ఐక్యంగా ఒక్క తాటిపైకి వస్తాయనడానికి ఎలాంటి గ్యారంటీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత గొడవలతో పార్టీలన్నీ మునిగిపోయినప్పుడు వారందరూ ఐక్యంగా ఉంటారని భావించలేమన్నారు. కాంగ్రెస్‌ ఇతర కుటుంబ పార్టీలన్నీ ప్రజలకి తప్పుడు హామీలిస్తున్నాయని ఇవన్నీ వారంతా ఐక్యంగా ఉండలేరనడానికి సంకేతాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి కాంగ్రెస్‌ సహా 17 ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడానికి అంగీకారానికొచ్చిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

2047 నాటికి దేశం ఎనీమియా (రక్తహీనత)ను పారద్రోలే లక్ష్యంతో మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో ఒక మిషన్‌ను శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలతో ఈ పార్టీలన్నీ తమ కుటుంబాల సంక్షేమమే చూస్తున్నాయే తప్ప ప్రజల సంక్షేమం కాదని అన్నారు. అవినీతి ఆరోపణల్లో చిక్కుకొని బెయిల్‌పై బయటకు వచ్చిన వారు, కుంభకోణాల్లో దోషులుగా తేలి జైల్లో ఉండి వచ్చినవారే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నారని నిందించారు. రాజకీయ పార్టీలిచ్చే హామీల్లో  ఏమి అమలు చేయగలిగేవో ప్రజలే గుర్తించాలన్నారు. ఇలాంటి తప్పుడు హామీలిచ్చే వారంతా ఇప్పుడు ఒకే గూటికి వస్తామనడం విడ్డూరమేనని ఆయన ఎద్దేవా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement