
మాట్లాడుతున్న గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
ఆదిలాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జనగర్జన సభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కుటుంబ అభివృద్ధికి మాత్రమే సీఎం కృషి చేశారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు ప్రధాన మోదీ నాయకత్వంలో కేంద్రంలో నీతిమంతమైన పాలన సాగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
రాష్ట్రంలోని గిరిజనులు విద్య, ఉద్యోగ పరంగా మరింత ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని మోదీ గిరిజన వర్సిటీ ప్రకటించారన్నారు. జిల్లాలో బీజేపీకి ఎంతో ప్రజాదరణ ఉందని, ఇక్కడి నుంచి పార్లమెంట్ స్థానాన్ని గెలవడంతో పాటు గతంలో పలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ నుంచి పూరించనున్నట్లు వెల్లడించారు.
ఈ బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment