బయోమెట్రిక్‌కు బైబై.. | Ration With Iris | Sakshi
Sakshi News home page

ఐరిస్‌తో రేషన్‌ 

Published Mon, Aug 20 2018 9:53 AM | Last Updated on Mon, Aug 20 2018 9:53 AM

Ration With Iris - Sakshi

బయోమెట్రిక్‌ విధానంతో ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్‌

నావంద్గికి చెందిన మాల సుభద్రమ్మకు ప్రభుత్వం అంత్యోదయ కార్డు మంజూరు చేసింది. ఈమెకు ప్రతినెలా 35 కిలోల బియ్యం వస్తాయి. సుభద్రమ్మ ఇద్దరు కొడుకులకు వారి కుటుంబ సభ్యులతో వేర్వేరు రేషన్‌ కార్డులు ఉండటంతో.. తన కార్డులో ఆమె పేరు మాత్రమే ఉంది.

బియ్యం తీసుకునేందుకు షాపు వద్దకు వెళ్లి.. బయోమెట్రిక్‌ మిషన్‌లో వేలుపెడితే ఎప్పుడూ ముద్రలు వచ్చేవి కావు. దీంతో ఎనిమిది నెలలుగా స్థానిక వీఆర్‌ఏ వచ్చి వేలిముద్ర వేసి బియ్యం ఇప్పిస్తున్నారు. ఇలా ప్రతినెలా నావంద్గిలో ఐదుగురు లబ్ధిదారులు వీఆర్‌ఏ కోసం ఎదురు చూస్తుంటారు.

బషీరాబాద్‌ రంగారెడ్డి : ప్రజాపంపిణీ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను జోడించి లబ్ధిదారులకు సులభంగా నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేద ప్రజలు కడుపునిండా తినాలనే సంకల్పంతో సర్కారు అందజేస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకంలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు మరో పకడ్బందీ చర్యను అమలు చేయనుంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ద్వారా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నా.. వృద్ధులు, రోజు పనులు చేసే కూలీలు, రక్తహీనత ఉన్నవారి వేలిముద్రలు బయోమెట్రిక్‌లో నమోదు కావడం లేదు. దీంతో వారు సరుకులు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం బియ్యం పంపిణీని మరింత పారదర్శకంగా అమలు చేయడంతో పాటు, లబ్ధిదారులందరికీ ప్రయోజనం చేకూరేలా ఐరిస్‌ విధానాన్ని తీసుకువస్తోంది.  

డీలర్ల వినతుల నేపథ్యంలో 

రేషన్‌ లబ్ధిదారుల అవస్థలు తీరనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రేషన్‌ సరుకుల పంపిణీలో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన సర్కారు ఐరిస్‌ విధానాన్ని అమలు చేయనుంది. దీనిద్వారా ఇప్పటివరకూ వేలిముద్రలు నమోదు కాకపోవడంతో సరుకులకు దూరమైన వారి కష్టాలు తొలగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఈ పద్ధతిని అమలు చేసేందుకు సివిల్‌ సప్లయ్‌ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 588 రేషన్‌ షాపుల పరిధిలో 2,31,271 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో పేరున్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వం నెలనెలా 6 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం అందజేస్తోంది.

ఇందుకోసం ప్రతి నెలా జిల్లాకు 5,316 టన్నుల రేషన్‌ బియ్యం సరఫరాచేస్తుంది. ఇప్పటివరకు డీలర్లు బయోమెట్రిక్‌ ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఏ గ్రామంలోనైనా సరుకులు తీసుకునేలా  పోర్టబులిటీ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే పలుమార్లు ఈ పాస్‌ బయోమెట్రిక్‌ మిషన్లు మొరాయించడం, నెట్‌వర్క్‌ పనిచేయకపోవడం వంటి కారణాలతో గడువులోపు పంపిణీ పూర్తికావడంలేదని డీలర్ల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. ముఖ్యంగా వేలిముద్రలు రాని వృద్ధులు, రోజువారీ కూలీ పనులు చేసుకునే వారికి, రక్తహీనత ఉన్నవారికి బయోమెట్రిక్‌లో రావడంలేదు.

దీంతో అలాంటి వారికి గతంలో గ్రామ వీఆర్‌ఏల వేలిముద్రలను వేసి సరుకులు అందజేసేవారు. ఈ క్రమంలో పలు చోట్ల వీఆర్‌ఏలు, డీలర్లు కలిసి అక్రమాలకు పాల్పడిన సంఘటనలు వెలుగుచూడటంతో ఆస్థానంలో నుంచి వీఆర్‌ఏలను తొలగించి గిర్దవరి, డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయిం చారు. ఇప్పటివరకు వేలిముద్రలు రాని వారికోసం వీఆర్‌ఓలు షాపుల వారీగా వెళ్లి ఫింగర్‌ ప్రింట్‌ వేస్తే తప్ప లబ్ధిదారులకు బియ్యం రాలేదు.

ఇది ఓ ప్రహసనంలా మారడంతో ప్రభుత్వం ఐరిస్‌ విధానం అమలుకు సిద్ధమైంది. ఇందులో మొదట లబ్ధిదారుల కనుపాపలను ఐరిస్‌ యంత్రంలో నిక్షిప్తం చేస్తారు. ఆధార్‌ అనుసంధానంలా ఆన్‌లైన్‌లో కనుపాపలు సరిపోలితే వారికి రేషన్‌ సరుకులు అందజేస్తారు. ఇలా కుటుంబంలో ఎవరైనా రేషన్‌ షాపునకు వెళ్లి సరుకులు తీసుకోవచ్చు. ఇప్పటికే జిల్లాకు ఐరిస్‌ యంత్రాలు చేరుకున్నట్లు రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు.    

గడువు పెంచే అవకాశం..

ప్రస్తుతం బియ్యం పంపిణీ పదిహేను రోజుల పాటుసాగుతోంది. అయితే బఫర్‌ గోదాంల నుంచి డీలర్లకు నెలాఖరు వరకు బియ్యం రావడం లేదు. రవాణా, అధికారుల అలసత్వం వంటి కారణాలతో 5 నుంచి పది రోజుల జాప్యం జరుగుతోంది. ఈ కారణంగానే జిల్లాలో ఆగస్టు కోటాలో ఏకంగా 1,060 టన్నుల బియ్యం మిగులు కావడంతో ప్రభుత్వం మరో రెండు రోజుల పాటు ఆన్‌లైన్‌ గడువు పెంచింది. ఇలాంటి సమస్యల వలన గడువును 20వతేదీ వరకు పెంచేలా నిర్ణయం తీసుకోబోతుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

ఆదేశాలు వచ్చాయి 

బయోమెట్రిక్‌ స్థానంలో.. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఐరిస్‌ విధానం  అమలు చేయాలని ప్రభుత్వ నుంచి ఆదేశాలు వచ్చాయి. అక్టోబరు మాసం నుంచి కొత్త పద్ధతి ద్వారానే లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తాం. జిల్లాలోని 588 రేషన్‌ దుకాణాల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించాం. ఈ పద్ధతి ద్వారా వేలిముద్రలు స్కాన్‌ కాని వారి కష్టాలు దూరమవుతాయి.  

– పద్మజ, జిల్లా పౌర సరఫరాల అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement