Irish missions
-
వేలి ముద్రలు పడకపోయినా రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి ష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సాధారణంగా ఈ–పాస్ మిషన్‌లో వేలి ముద్రలు వేస్తేనే సరుకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, లెప్రసీ (కుష్టు వ్యాధి) బాధితులు, తాపీ పని చేసే కార్మికులు, రజకులు (ఇస్త్రీ చేయడం) తదితర వృత్తులు చేసే వారికి వేలిముద్రలు అరిగిపోయి యంత్రాల్లో పడటం లేదు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఇచ్చే సరుకులు తీసుకోవడానికి వారు ప్రతి నెలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ‘నామినీ’ (బంధువుల) ద్వారా బయోమెట్రిక్ తీసుకొని సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐరిష్ యంత్రాల్లో సమస్య వేలి ముద్రలు సరిగా పడని వారికోసం ఐరిష్ మిషన్లు అందుబాటులో ఉంచినా, పలు కారణాలతో అవి సరిగా పనిచేయడంలేదు. పేదలెవరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నామినీ ద్వారా సమీప బంధువుల బయోమెట్రిక్ తీసుకొని లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తోంది. బంధువులు అందుబాటులో లేని పక్షంలో వీఆర్వో లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్ తీసుకొని సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇంటి వద్దే సబ్సిడీ సరుకుల పంపిణీ వేలిముద్రలు, ఐరిష్ యంత్రాల సమస్య వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్దే సబ్సిడీ సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిం ది. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురానుంది. వేలి ముద్రలు సరిగా పడకపోవడం తదితర కారణాలతో నామినీ వేలిముద్రల సాయంతో ఈనెలలో 35,282 మంది లబ్ధిదారులు ఉచిత సరుకులు తీసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేలిముద్రల సమస్యను పరిష్కరించి నామినీ విధానంలో రేషన్ సరుకులు అందిస్తుండడంపై పేద లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బయోమెట్రిక్‌కు బైబై..
నావంద్గికి చెందిన మాల సుభద్రమ్మకు ప్రభుత్వం అంత్యోదయ కార్డు మంజూరు చేసింది. ఈమెకు ప్రతినెలా 35 కిలోల బియ్యం వస్తాయి. సుభద్రమ్మ ఇద్దరు కొడుకులకు వారి కుటుంబ సభ్యులతో వేర్వేరు రేషన్ కార్డులు ఉండటంతో.. తన కార్డులో ఆమె పేరు మాత్రమే ఉంది. బియ్యం తీసుకునేందుకు షాపు వద్దకు వెళ్లి.. బయోమెట్రిక్ మిషన్‌లో వేలుపెడితే ఎప్పుడూ ముద్రలు వచ్చేవి కావు. దీంతో ఎనిమిది నెలలుగా స్థానిక వీఆర్ఏ వచ్చి వేలిముద్ర వేసి బియ్యం ఇప్పిస్తున్నారు. ఇలా ప్రతినెలా నావంద్గిలో ఐదుగురు లబ్ధిదారులు వీఆర్ఏ కోసం ఎదురు చూస్తుంటారు. బషీరాబాద్ రంగారెడ్డి : ప్రజాపంపిణీ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను జోడించి లబ్ధిదారులకు సులభంగా నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేద ప్రజలు కడుపునిండా తినాలనే సంకల్పంతో సర్కారు అందజేస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకంలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు మరో పకడ్బందీ చర్యను అమలు చేయనుంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నా.. వృద్ధులు, రోజు పనులు చేసే కూలీలు, రక్తహీనత ఉన్నవారి వేలిముద్రలు బయోమెట్రిక్‌లో నమోదు కావడం లేదు. దీంతో వారు సరుకులు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం బియ్యం పంపిణీని మరింత పారదర్శకంగా అమలు చేయడంతో పాటు, లబ్ధిదారులందరికీ ప్రయోజనం చేకూరేలా ఐరిస్ విధానాన్ని తీసుకువస్తోంది. డీలర్ల వినతుల నేపథ్యంలో రేషన్ లబ్ధిదారుల అవస్థలు తీరనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రేషన్ సరుకుల పంపిణీలో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన సర్కారు ఐరిస్ విధానాన్ని అమలు చేయనుంది. దీనిద్వారా ఇప్పటివరకూ వేలిముద్రలు నమోదు కాకపోవడంతో సరుకులకు దూరమైన వారి కష్టాలు తొలగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ పద్ధతిని అమలు చేసేందుకు సివిల్ సప్లయ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 588 రేషన్ షాపుల పరిధిలో 2,31,271 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో పేరున్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వం నెలనెలా 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేస్తోంది. ఇందుకోసం ప్రతి నెలా జిల్లాకు 5,316 టన్నుల రేషన్ బియ్యం సరఫరాచేస్తుంది. ఇప్పటివరకు డీలర్లు బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఏ గ్రామంలోనైనా సరుకులు తీసుకునేలా పోర్టబులిటీ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే పలుమార్లు ఈ పాస్ బయోమెట్రిక్ మిషన్లు మొరాయించడం, నెట్వర్క్ పనిచేయకపోవడం వంటి కారణాలతో గడువులోపు పంపిణీ పూర్తికావడంలేదని డీలర్ల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. ముఖ్యంగా వేలిముద్రలు రాని వృద్ధులు, రోజువారీ కూలీ పనులు చేసుకునే వారికి, రక్తహీనత ఉన్నవారికి బయోమెట్రిక్‌లో రావడంలేదు. దీంతో అలాంటి వారికి గతంలో గ్రామ వీఆర్ఏల వేలిముద్రలను వేసి సరుకులు అందజేసేవారు. ఈ క్రమంలో పలు చోట్ల వీఆర్ఏలు, డీలర్లు కలిసి అక్రమాలకు పాల్పడిన సంఘటనలు వెలుగుచూడటంతో ఆస్థానంలో నుంచి వీఆర్ఏలను తొలగించి గిర్దవరి, డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయిం చారు. ఇప్పటివరకు వేలిముద్రలు రాని వారికోసం వీఆర్ఓలు షాపుల వారీగా వెళ్లి ఫింగర్ ప్రింట్ వేస్తే తప్ప లబ్ధిదారులకు బియ్యం రాలేదు. ఇది ఓ ప్రహసనంలా మారడంతో ప్రభుత్వం ఐరిస్ విధానం అమలుకు సిద్ధమైంది. ఇందులో మొదట లబ్ధిదారుల కనుపాపలను ఐరిస్ యంత్రంలో నిక్షిప్తం చేస్తారు. ఆధార్ అనుసంధానంలా ఆన్లైన్లో కనుపాపలు సరిపోలితే వారికి రేషన్ సరుకులు అందజేస్తారు. ఇలా కుటుంబంలో ఎవరైనా రేషన్ షాపునకు వెళ్లి సరుకులు తీసుకోవచ్చు. ఇప్పటికే జిల్లాకు ఐరిస్ యంత్రాలు చేరుకున్నట్లు రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు. గడువు పెంచే అవకాశం.. ప్రస్తుతం బియ్యం పంపిణీ పదిహేను రోజుల పాటుసాగుతోంది. అయితే బఫర్ గోదాంల నుంచి డీలర్లకు నెలాఖరు వరకు బియ్యం రావడం లేదు. రవాణా, అధికారుల అలసత్వం వంటి కారణాలతో 5 నుంచి పది రోజుల జాప్యం జరుగుతోంది. ఈ కారణంగానే జిల్లాలో ఆగస్టు కోటాలో ఏకంగా 1,060 టన్నుల బియ్యం మిగులు కావడంతో ప్రభుత్వం మరో రెండు రోజుల పాటు ఆన్లైన్ గడువు పెంచింది. ఇలాంటి సమస్యల వలన గడువును 20వతేదీ వరకు పెంచేలా నిర్ణయం తీసుకోబోతుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆదేశాలు వచ్చాయి బయోమెట్రిక్ స్థానంలో.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఐరిస్ విధానం అమలు చేయాలని ప్రభుత్వ నుంచి ఆదేశాలు వచ్చాయి. అక్టోబరు మాసం నుంచి కొత్త పద్ధతి ద్వారానే లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తాం. జిల్లాలోని 588 రేషన్ దుకాణాల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించాం. ఈ పద్ధతి ద్వారా వేలిముద్రలు స్కాన్ కాని వారి కష్టాలు దూరమవుతాయి. – పద్మజ, జిల్లా పౌర సరఫరాల అధికారి -
ఐరిష్‌తో రేషన్
సిరిసిల్ల : ప్రజాపంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రేషన్ బియ్యం పొందే లబ్ధిదారులకు ఐరిష్ (కంటిపాపల) పరీక్షలను నిర్వహిస్తున్నారు. రేషన్ బియ్యం పొందే వారు ఇప్పటి వరకు బయోమెట్రిక్ (వేలిముద్రలు) విధానంలో సరకులు తీసుకునే వారు. ఇప్పటి నుంచి బయోమెట్రిక్‌తో పాటు ఐరిష్ విధానాన్ని పయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. తొలి విడతగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఐరిష్ విధానం అమలులోకి వచ్చింది. జిల్లాలో కొత్తగా ఆవిర్భవించిన గ్రామపంచాయతీల్లోనూ రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాపంపిణీలో ఐరిష్‌తో మరో సంస్కరణలకు సిరిసిల్ల జిల్లాలో శ్రీకారం చుడుతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా సిరిసిల్లలో.. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, యాదాద్రి, మంచిర్యాల జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఐరిష్ విధానం అమలు చేయనున్నారు. ఈనెల 15వ తేదీనుంచి రేషన్ బియ్యం పంపిణీలో ఈపద్ధతి పాటిస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా బయోమెట్రిక్ విధానం అమలులో ఉండగా.. ఇటీవల ఫోర్టబులిటీ ద్వారా రేషన్ సరుకులను ఏ దుకాణంలోనైనా పొందే వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈవిధానంలో వేలిముద్రలు పడక ఇబ్బందులు పడే వృద్ధులు, ఇతరులకు మరో వెసులుబాటు కల్పిస్తూ.. ఐరిష్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. జిల్లాలో ఈ పద్ధతిని పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడుతున్నారు. రెండోవిడతలో.. సెప్టెంబరు 1వ తేదీనుంచి సిద్దిపేట, జగిత్యాల, మహబూబ్‌నగర్ జిల్లాలో అమలు చేస్తారు. సెప్టెంబరు 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఐరిష్ విధానం అమలు చేయనున్నట్లు పౌరసరఫరా అధికారులు ప్రకటించారు. బయోమెట్రిక్‌తో 2619.80 క్వింటాళ్ల మిగులు.. బయోమెట్రిక్ విధానం అమలులోకి రావడంతో జిల్లావ్యాప్తంగా 2,619.80 క్వింటాళ్ల బియ్యం మిగులుతున్నాయి. 344 రేషన్ దుకాణాల ద్వారా నెలనెలా సరఫరా అయ్యే బియ్యం.. బోగస్ లబ్ధిదారుల పేరుతో స్వాహా అయ్యేవి. ప్రతీ లబ్ధిదారు విధిగా వేలిముద్ర వేసి రేషన్ బియ్యం పొందాలనే నిబంధనలు విధించడంతో బియ్యం మిగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈవిధానంతో ప్రజాధనం భారీగా ఆదా కావడంతో ప్రభుత్వం ఐరిష్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఉన్న బయోమెట్రిక్ మిషన్లకు కొత్త సాఫ్ట్వేర్ జతచేసి ఐరిష్‌ను నమోదు చేస్తారు. దీంతో బయోమెట్రిక్‌కు తోడుగా.. ఐరిష్ నమోదుతో రేషన్ పంపిణీలో అక్రమాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త గ్రామపంచాయతీల్లో రేషన్ దుకాణాలు.. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 61 గ్రామపంచాయతీల్లో కొత్తగా రేషన్ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 2వ తేదీ నుంచి శివారు గ్రామాలుగా, గిరిజన తండాలుగా ఉన్న పల్లెల్లో కొత్త గ్రామపంచాయతీ పాలన మొదలైంది. దీంతో ఆయా గ్రామాల్లోనూ ఈనెల 15వ తేదీనుంచి రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న దుకాణాలను విభజిస్తూ.. కొత్త గ్రామాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తద్వారా నూతన గ్రామపంచాయతీలకూ రేషన్ సరకులు దరి చేరుతాయి. ఇన్నాళ్లూ దూరభారంతో ఇబ్బందులు పడిన ప్రజలకు ప్రజాపంపిణీ చేరువ కానుంది. -
ఇంత చౌకబారుతనమా?
సాంకేతిక సమస్యలను సాకుగా చూపి దోపిడీకి పాల్పడుతున్న డీలర్లు ఆందోళనలో లబ్ధిదారులు జిల్లాలో చౌకదుకాణాల ద్వారా జరుగుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బయోమెట్రిక్, ఐరిష్ మిషన్లు మొరాయిస్తుండడంతో వేలాది కార్డులకు సరుకులు సక్రమంగా అందడంలేదు. కొన్ని చోట్ల సాంకేతిక కారణాలను సాకుగా చూపి డీలర్లు సరుకులు స్వాహా చేస్తున్నా అడిగే దిక్కులేకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు: జిల్లాలో 2,828 చౌక దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 10,73,780 వివిధ రకాల రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా కార్డుదారులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులను పంపిణీ చేయాల్సి ఉంది. గతంలో రేషన్‌కార్డు నంబరు రాసి నిత్యావసరాలు పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడు బయోమెట్రిక్, ఐరిష్ మిషన్ల సహాయంతో వేలిముద్రలు తీసుకుని తద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే విజన్‌టెక్ కంపెనీ సరఫరా చేసిన బయోమెట్రిక్ మిషన్లు సక్రమంగా పనిచేయడంలేదు. ఫలితంగా కార్డుదారుల వేలిముద్రలు నమోదుగాక అగచాట్లు ఎదురవుతున్నాయి. పనిచేయని వాటి స్థానంలో కొత్త మిషన్ల ఏర్పాటు విషయమై అటు కంపెనీ ఇటు అధికారులు పట్టించుకోవడంలేదు. మరోవైపు బయోమెట్రిక్ పనిచేయని పక్షంలో ఐరిష్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీచేయాల్సి ఉంది. కానీ విప్రో కంపెనీ సరఫరా చేసిన ఐరిష్ మిషన్లు సక్రమంగా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పౌరసరఫరాలశాఖ అధికారులే నవంబర్ నెలలో విప్రో కంపెనీకి చెందిన 2,200 ఐరిష్ మిషన్లు పంపిణీ చేశారు. వీటిలో 50 శాతం మిషన్లు వివిధ సాంకేతిక కారణాలతో పనిచేయడంలేదు. పనిచేయని మిషన్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ చెప్పినా ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో వాటిని సరిదిద్దేందుకు కంపెనీ ఇంజినీర్లను ఏర్పాటు చేయాలి. కానీ జిల్లావ్యాప్తంగా ఒక్క ఇంజినీర్ మాత్రమే ఉండడంతో పాడైన మిషన్లను సరిచేయలేక పోతున్నారు. బయోమెట్రిక్, ఐరిష్‌లు పనిచేయక పోవడంతో ప్రతినెలా వేలాది కార్డుదారులకు సరుకులు ఎగనామం పెడుతున్నారు. గతనెలలో 14,057 మందికి రేషన్ అందలేదని అధికారిక గణాంకాలు చెబుతున్నా ఈ సంఖ్య పెద్ద మొత్తంలో ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా కుష్ఠువ్యాధి గ్రస్తులకు సరుకులు నిలిపి వేశారని బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి మొరపెట్టుకున్నారు. అంతకుముందునెలలో దాదాపు 92 వేల మందికి సరుకుల పంపిణీ ఆగిపోయిందని పౌరసరఫరాలశాఖకు చెందిన ఓ అధికారి చెప్పడం గమనార్హం. ఈ లెక్కన ప్రతినెలా వేలాది మందికి సరుకులు అందలేదని తెలుస్తోంది. సాంకేతిక కారణాలను పక్కనబెట్టి కార్డుదారులకు సంబంధిత వీఆర్వోల వేలి ముద్రలు తీసుకొని సరుకులు ఇవ్వాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఇదే అదునుగా చాలామంది డీలర్లు వీఆర్వోలతో కుమ్మక్కై కార్డుదారులకు ఇవ్వకుండానే సరుకులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సాంకేతిక సమస్యలు పరిష్కరించి, పేదలకు నిత్యావసర సరుకులు అందేలా చూడాల్సి ఉంది.