ప్రతీకాత్మక చిత్రం
సిరిసిల్ల : ప్రజాపంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రేషన్ బియ్యం పొందే లబ్ధిదారులకు ఐరిష్ (కంటిపాపల) పరీక్షలను నిర్వహిస్తున్నారు. రేషన్ బియ్యం పొందే వారు ఇప్పటి వరకు బయోమెట్రిక్ (వేలిముద్రలు) విధానంలో సరకులు తీసుకునే వారు. ఇప్పటి నుంచి బయోమెట్రిక్‌తో పాటు ఐరిష్ విధానాన్ని పయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. తొలి విడతగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఐరిష్ విధానం అమలులోకి వచ్చింది. జిల్లాలో కొత్తగా ఆవిర్భవించిన గ్రామపంచాయతీల్లోనూ రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాపంపిణీలో ఐరిష్‌తో మరో సంస్కరణలకు సిరిసిల్ల జిల్లాలో శ్రీకారం చుడుతున్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా సిరిసిల్లలో..
రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, యాదాద్రి, మంచిర్యాల జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఐరిష్ విధానం అమలు చేయనున్నారు. ఈనెల 15వ తేదీనుంచి రేషన్ బియ్యం పంపిణీలో ఈపద్ధతి పాటిస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా బయోమెట్రిక్ విధానం అమలులో ఉండగా.. ఇటీవల ఫోర్టబులిటీ ద్వారా రేషన్ సరుకులను ఏ దుకాణంలోనైనా పొందే వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.
ఈవిధానంలో వేలిముద్రలు పడక ఇబ్బందులు పడే వృద్ధులు, ఇతరులకు మరో వెసులుబాటు కల్పిస్తూ.. ఐరిష్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. జిల్లాలో ఈ పద్ధతిని పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడుతున్నారు. రెండోవిడతలో.. సెప్టెంబరు 1వ తేదీనుంచి సిద్దిపేట, జగిత్యాల, మహబూబ్‌నగర్ జిల్లాలో అమలు చేస్తారు. సెప్టెంబరు 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఐరిష్ విధానం అమలు చేయనున్నట్లు పౌరసరఫరా అధికారులు ప్రకటించారు.
బయోమెట్రిక్‌తో 2619.80 క్వింటాళ్ల మిగులు..
బయోమెట్రిక్ విధానం అమలులోకి రావడంతో జిల్లావ్యాప్తంగా 2,619.80 క్వింటాళ్ల బియ్యం మిగులుతున్నాయి. 344 రేషన్ దుకాణాల ద్వారా నెలనెలా సరఫరా అయ్యే బియ్యం.. బోగస్ లబ్ధిదారుల పేరుతో స్వాహా అయ్యేవి. ప్రతీ లబ్ధిదారు విధిగా వేలిముద్ర వేసి రేషన్ బియ్యం పొందాలనే నిబంధనలు విధించడంతో బియ్యం మిగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈవిధానంతో ప్రజాధనం భారీగా ఆదా కావడంతో ప్రభుత్వం ఐరిష్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే ఉన్న బయోమెట్రిక్ మిషన్లకు కొత్త సాఫ్ట్‌వేర్ జతచేసి ఐరిష్‌ను నమోదు చేస్తారు. దీంతో బయోమెట్రిక్‌కు తోడుగా.. ఐరిష్ నమోదుతో రేషన్ పంపిణీలో అక్రమాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త గ్రామపంచాయతీల్లో రేషన్ దుకాణాలు..
జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 61 గ్రామపంచాయతీల్లో కొత్తగా రేషన్ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 2వ తేదీ నుంచి శివారు గ్రామాలుగా, గిరిజన తండాలుగా ఉన్న పల్లెల్లో కొత్త గ్రామపంచాయతీ పాలన మొదలైంది. దీంతో ఆయా గ్రామాల్లోనూ ఈనెల 15వ తేదీనుంచి రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న దుకాణాలను విభజిస్తూ.. కొత్త గ్రామాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తద్వారా నూతన గ్రామపంచాయతీలకూ రేషన్ సరకులు దరి చేరుతాయి. ఇన్నాళ్లూ దూరభారంతో ఇబ్బందులు పడిన ప్రజలకు ప్రజాపంపిణీ చేరువ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment