సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి ష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సాధారణంగా ఈ–పాస్ మిషన్‌లో వేలి ముద్రలు వేస్తేనే సరుకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, లెప్రసీ (కుష్టు వ్యాధి) బాధితులు, తాపీ పని చేసే కార్మికులు, రజకులు (ఇస్త్రీ చేయడం) తదితర వృత్తులు చేసే వారికి వేలిముద్రలు అరిగిపోయి యంత్రాల్లో పడటం లేదు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఇచ్చే సరుకులు తీసుకోవడానికి వారు ప్రతి నెలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ‘నామినీ’ (బంధువుల) ద్వారా బయోమెట్రిక్ తీసుకొని సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఐరిష్ యంత్రాల్లో సమస్య
వేలి ముద్రలు సరిగా పడని వారికోసం ఐరిష్ మిషన్లు అందుబాటులో ఉంచినా, పలు కారణాలతో అవి సరిగా పనిచేయడంలేదు. పేదలెవరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నామినీ ద్వారా సమీప బంధువుల బయోమెట్రిక్ తీసుకొని లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తోంది. బంధువులు అందుబాటులో లేని పక్షంలో వీఆర్వో లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్ తీసుకొని సరుకులు పంపిణీ చేస్తున్నారు.
ఇంటి వద్దే సబ్సిడీ సరుకుల పంపిణీ
వేలిముద్రలు, ఐరిష్ యంత్రాల సమస్య వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్దే సబ్సిడీ సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిం ది. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురానుంది. వేలి ముద్రలు సరిగా పడకపోవడం తదితర కారణాలతో నామినీ వేలిముద్రల సాయంతో ఈనెలలో 35,282 మంది లబ్ధిదారులు ఉచిత సరుకులు తీసుకున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేలిముద్రల సమస్యను పరిష్కరించి నామినీ విధానంలో రేషన్ సరుకులు అందిస్తుండడంపై పేద లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment