
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర సబ్సిడీ సరుకులను ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రమంతటా పేదల గడప వద్దకే వెళ్లి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పంచాయతీ ఎన్నికల కోడ్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అడ్డు చెప్పారు. గ్రామాల్లో ఈ పథకం కింద మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీ ఎన్నికల దృష్ట్యా నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం లేఖ రాశారు. కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేసుకోవచ్చని లేఖలో స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం, ఇందులో భాగంగానే ఈ నెల 21న మొబైల్ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించడం తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 9,260 వాహనాలు ముందుకు కదలడంతో ఇక రేషన్ షాపుల వద్ద గంటల తరబడి వేచి చూసే పని ఉండబోదని, ఇంటి వద్దే బియ్యం, ఇతర సబ్సిడీ సరుకులు అందుతాయని, తద్వారా ఫిబ్రవరి నుంచి తమ కష్టాలు తీరతాయని భావించిన పేదలకు ఎన్నికల కమిషనర్ ఆదేశం శరాఘాతమైంది. వాస్తవానికి ఈ పథకం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైనుంచే అమలవుతోంది. అందువల్ల ఈ పథకాన్ని ఇప్పటికే కొనసాగుతున్నదిగా భావించి పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరినా ఎస్‌ఈసీ పట్టించుకోకపోవడం గమనార్హం. కేవలం పట్టణాల్లో మాత్రమే ఈ పథకాన్ని కొనసాగించుకోవచ్చని ఎస్‌ఈసీ పేర్కొన్నారు.
ఏజీ అభిప్రాయం కోరాలని నిర్ణయం..
ఈ పథకం అమలు కోసం ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు నాణ్యమైన బియ్యంతోపాటు మొబైల్ వాహనాలు వెళ్లాయి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎస్‌ఈసీ నిలిపివేయడం సమంజసం కాదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇదే విషయమై అడ్వొకేట్ జనరల్‌తో చర్చించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. అంతిమంగా అడ్వొకేట్ జనరల్ సూచన మేరకు పథకం అమలుపై ముందుకెళ్లాలా.. వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment