1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ | Botsa Satyanarayana Karumuri Nageswara rao on free rice Distribution | Sakshi
Sakshi News home page

1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ

Published Tue, Jul 26 2022 3:26 AM | Last Updated on Tue, Jul 26 2022 7:48 AM

Botsa Satyanarayana Karumuri Nageswara rao on free rice Distribution - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు బొత్స, కారుమూరి నాగేశ్వరరావు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేవై) కింద ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్‌ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో ప్రతినెల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా 4.23 కోట్ల మందికి రేషన్‌ ఇస్తుంటే.. ఇందులో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే సరుకులు అందిస్తోందన్నారు.

మిగిలిన లబ్ధిదారులకు సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వమే రేషన్‌ పంపిణీ చేస్తోందన్నారు. కరోనా సమయంలో పీఎంజీకేవై కింద కేంద్రం ఉచిత రేషన్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2022 వరకు రాష్ట్రంలో ఉచిత రేషన్‌ పంపిణీ చేపట్టామన్నారు. ఇక్కడ కేంద్రం ఇచ్చే వాటాపోనూ నాన్‌–ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు మానవతా దృక్పథంతో తమ ప్రభుత్వం సొంతంగా ఉచిత బియ్యాన్ని అందించిందన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కొనసాగిస్తున్న ఉచిత రేషన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో.. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారని బొత్స తెలిపారు.

రేషన్‌ దుకాణాల వద్దే..
తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లలో మినహా విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 1.67 కోట్ల మందితో పాటు మిగిలిన జిల్లాల్లోని 89.20 లక్షల ఎస్సీ, ఎస్టీలకు, 24.60 లక్షల మంది అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డుదారులకు ఉచిత రేషన్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు.

వీరితో పాటు కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో అక్కడ కూడా ఈ విధానాన్ని అమలుచేస్తామన్నారు. తద్వారా రాష్ట్రంలోని 2.68 కోట్ల మందికి పైగా ఉచిత బియ్యం అందుతుందని బొత్స చెప్పారు. వీటిని రేషన్‌ దుకాణాల వద్ద మ.3.30 గంటల నుంచి సాయంత్రం వరకూ పంపిణీ చేస్తామని.. ఈ నెలాఖరు నాటికి వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు కూపన్లు అందజేస్తామన్నారు. ఇక ప్రతినెలా ఇచ్చే బియ్యాన్ని యథావిధిగా వాహనాల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ జరుగుతుందన్నారు. 

పీఎంజీకేవై అమలుకు ప్రత్యేక ప్రణాళిక 
అనంతరం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులు అందరికీ పీఎంజీకేవైను వర్తింపజేయాలని సీఎం జగన్‌ లేఖల ద్వారా ప్రధానమంత్రిని కోరారన్నారు. నీతి ఆయోగ్, మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులు, ఉన్నతాధికారలు అధ్యయనాల తర్వాత పీఎంజీకేవై అమలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కంటే పీడీఎస్‌ లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందని.. ఇటీవల కొత్తగా 7,051 కార్డులను కూడా జారీచేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో పేదలకిచ్చే బియ్యం కోసం రూ.12వేల కోట్లు ఖర్చుచేస్తే తమ ప్రభుత్వం మూడేళ్లలోనూ రూ.14వేల కోట్ల వరకు ఖర్చుచేసిందన్నారు. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఎండీ వీరపాండియన్‌ పాల్గొన్నారు.

రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు..
రాష్ట్రంలో 4.23 కోట్ల మంది నిరుపేదలు రేషన్‌ తీసుకుంటుండగా కేంద్రం ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద 2.68 కోట్ల మందిని మాత్రమే గుర్తించింది. వారికే ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. మిగిలిన 1.55 కోట్ల మంది ప్రజలను నిరుపేదలుగా పరిగణించట్లేదు. ఈ క్రమంలో కొంతమందికే కాకుండా నిరుపేదలందరికీ పీఎంజీకేవై కింద ఉచిత రేషన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నీతి ఆయోగ్‌ సైతం చేసిన సిఫారసులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కేంద్రం స్పందించలేదు.

కరోనా సమయంలో కేంద్రం ఇస్తున్న 2.68 కోట్ల మందితో పాటు మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్‌ ఇచ్చింది. ఆర్థికభారం మోయలేనిస్థాయికి చేరడంతో.. అందరకీ ఉచిత రేషన్‌ ఇవ్వమని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసి, కేంద్రం స్పందన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో.. ఉచిత రేషన్‌ పంపిణీ చేయకపోతే ధాన్యం కొనుగోళ్లు నిలిపేస్తామని, బిల్లులను కూడా ఆపేస్తామని బెదిరించింది.

రైతులు ఇబ్బందులు పడకుండా వారి ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి వారి సిఫారసుల అనుగుణంగా వెనుకబడిన ప్రాంతాలు, సామాజికవర్గాల వారీగా ఉచిత రేషన్‌ పంపిణీకి ఏర్పాట్లుచేసింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో మోయలేని ఆర్థిక భారం పడినా.. నిరుపేదల కడుపు నింపేందుకు కేంద్రంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భారం భరించి రెండేళ్లూ ఉచిత రేషన్‌ అందించింది. ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోవడంతో కేంద్రాన్ని సాయం కోరినా ఫలితం దక్కకపోగా బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement