ఉపాధి కూలీలపై పిడుగు | aadhar link to employement scheme | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలపై పిడుగు

Published Fri, Mar 7 2014 2:26 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

aadhar link to employement scheme

 సాక్షి, నల్లగొండ
 పొమ్మనలేక పొగబెట్టినట్లు ఉంది సర్కారు తీరు. ‘ఉపాధి’ లో గతంలో బయోమెట్రిక్ విధానం.. తాజాగా ఆధార్ అనుసంధానం తెరమీదకు తీసుకొచ్చింది. పారదర్శకత పేరుతో ఏడాదికో విధానాన్ని ప్రవేశపెడుతుండడంతో కూలీలు బెంబేలెత్తుతున్నారు. ఆధార్ నమోదు కోసం ఇప్పటికే సతమతమవుతున్న కూలీలకు మరో తలనొప్పి రానుంది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల జాబ్‌కార్డులకు ‘ఆధార్’ ముడిపెట్టిన విషయం తెలిసిందే. అయితే అనుసంధానం కాని కూలీల వేతనాల చెల్లింపులు త్వరలో నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉపాధి కూలీల వివరాలకు ఆధార్ నంబర్‌ను కొన్ని నెలలుగా అనుసంధానం చేస్తున్నారు. కాకపోతే చెల్లింపులు బయోమెట్రిక్ విధానం ద్వారానే జరుగుతున్నాయి. ఇది ఇక మరికొన్ని రోజులే కొనసాగనుంది.
 
 ఇదీ పరిస్థితి...
 జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 11.46 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. ఇందులో సరాసరిగా 80వేల మంది కూలీలు రోజువారీగా పనులు చేస్తున్నారు. గతంలో మా న్యువల్ విధానం ద్వారా కూలీలకు చెల్లింపులు జరిగేవి. ఈ పద్ధతి 2001 మార్చి వరకు కొనసాగింది. ఆ సమయంలో కూలీలు పనులకు హాజరు కాకున్నా సిబ్బంది డబ్బులు డ్రా చేశారన్న ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. తద్వారా నిధులు పక్కదారి పట్టాయని సర్కారు గుర్తించింది. ఈ నేపథ్యంలో మాన్యువల్ స్థానంలో బయోమెట్రిక్ పద్ధతిని తీసుకొచ్చారు. కూలీల వేలిముద్రల ఆధారంగా ఇప్పటివరకు వేతనాలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే దీనికీ త్వరలో స్వస్తి పలకనున్నట్లు తెలిసింది.
 
 ‘ఆధార్’తో ముడి...
 కొన్ని నెలల క్రితమే కూలీల జాబ్‌కార్డుకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం మొదలు పెట్టారు. జిల్లాలో 8.46 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఆరు నెలలుగా 5.63 లక్షల కార్డుల వివరాలు ఆధార్ నంబర్ (యూఐడీ)తో అనుసంధానం చేశారు. ఇందులో 4.78లక్షల కార్డులకు సంబంధించిన వివరాాల నమోదు మాత్రమే విజయవంతమైంది. సాంకేతిక కారణాల వల్ల మిగిలినవి అందుకు నోచుకోలేదు. ఇంకా 2.83లక్షల కార్డులు ఆధార్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. అయితే చాలామంది కూలీలు ఇప్పటికే ఆధార్ కోసం వివరాలు అందజేశారు. ఇదంతా జరిగి నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ కార్డులు అందడం లేవు. ఇంకొంతమంది అసలు నమోదే చేయించుకోలేదు. అయితే అతి త్వరలో ఆధార్ అనుసంధానం కాని కూలీలకు చెల్లింపులు నిలిచిపోనున్నాయి. దీంతో దాదాపు మూడు లక్షల మంది కూలీలు వేతనాలకు నోచుకోనట్టే.  అంతేగాక ఆధార్ నమోదు చేసినా... విజయవంతం కానివారి కూలీల పరిస్థితేంటన్నది తేలాల్సి ఉంది.
 
 తొందరెందుకు...?
 ఉపాధి పథక ంలో కూలీలకు వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత కోసం నూతన విధానాలకు అవలంబించాలనుకోవడం సబబే. అయితే ఆ పద్ధతిని విజయవంతం చేయాలంటే పూర్వ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కాని ప్రణాళికేమీ లేకుండా అనుకున్నదే తడువుగా ఁఆధార్*తో ముడిపెట్టడం ఏంటన్న మౌలిక ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతోంది. పూర్తిస్థాయిలో కూలీలందరికీ ఆధార్‌కార్డు అందజేశాక ఈ విధానాన్ని అమలు చేస్తే ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ కూలీలకు అరకొరగా కార్డులు అందజేసి చెల్లింపులు నిలిపివేస్తామనడం అర్థరహితం. ఫలితంగా లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటి కైనా అనుసంధాన నిర్ణయాన్ని వాయిదా వే యడం గాని, లేదా పూర్తిగా తొలగించడంగాని చేస్తేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తంమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement