employement scheme
-
జోరందుకున్నఉపాధి పనులు
ఉపాధిహామీ పనుల్లో కూలీల హాజరు శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి. వారం రోజుల్లోనే ఉపాధి పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య పది వేల మందికి పెరిగింది. కూలీలకు సగటున రోజుకు రూ.155 చొప్పున కూలీ గిట్టుబాటు అవుతోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఉపాధిహామీ పనుల్లో కూలీల హాజరు శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ పనులకు రాని కూలీల జాబ్‌కార్డులను తొలగిస్తామని ఈజీఎస్ పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో చాటింపులు వేయిస్తున్నారు. ఈజీఎస్ పనులు ఊపందుకుంటే గ్రామీణ ప్రజలకు స్థానికంగా ఉపాధి లభిస్తుంది. దీనికి తోడు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కూడా జనరేట్ అవుతాయి. మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పెరిగితే ఆ నిధులతో ఇతర అభివృద్ధి పనులు కూడా చేపట్టవచ్చు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పనులపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. లాక్డౌన్ నేపథ్యంలో.. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జోరందుకున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ పనులు పెద్దగా లేవు. వరి కోతలు పూర్తయ్యాయి. పసుపు తవ్వకాలు, ఉడకబెట్టడం వంటి పనులు కూడా లేవు. దీనికి సమీప పట్టణాలకు వెళ్లి ఏదైనా పనులు చేసుకునే వారు ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఈ పనులకు కూడా వెళ్లలేకపోతున్నారు. దీంతో కూలీలు కూడా ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పనులకు వెళుతున్న కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారం రోజుల క్రితంతో ఇప్పుటికి పోల్చితే సుమారు పది వేల మంది ఎక్కువగా కూలీలు ఈ పనులకు హాజరవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత వారంలో అత్యధికంగా రోజుకు 56,393 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరుకాగా, శుక్రవారం ఈ సంఖ్య 65,450కి చేరింది. పైగా ఈ పనులకు వెళుతున్న వారికి రోజువారీ గరిష్ట కూలీ కూడా రూ.234లకు పెరగడంతో కూలీలు ఈ పనులు చేసేందుకు కొంత ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులే ఈ పనులను పర్యవేక్షిస్తున్న విషయం విధితమే. ఉపాధి హామీ ఫీల్డ్అసిస్టెంట్లు గతంలో సమ్మెకు దిగిన విషయం విధితమే. వీరు సమ్మె విరమించుకుని విధుల్లో చేరుతామని వచ్చినప్పటికీ.. ప్రభుత్వం వారిని విధుల్లో చేర్చుకునే విషయంలో నిర్ణయం తీసుకోలేదు. వీరి పనులను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించి పనులకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టిన విషయం విధితమే. జిల్లాలో 2.48 లక్షల జాబ్‌కార్డులుండగా, 5.12 లక్షల మంది కూలీలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2020–21లో ఇప్పటి వరకు ఈ పనులకు వెళ్లిన కూలీలకు వచ్చిన వేతనం సుమారు రూ.3.32 కోట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పనులకు వెళుతున్న కూలీలకు సగటున రోజుకు రూ.155 చొప్పున కూలీ గిట్టుబాటు అవుతోంది. -
మారని నేరగాళ్లు!
ఉప్పల్: కరడుగట్టిన నేరగాళ్లను మార్చడానికి పోలీసులు పడుతున్న తపన వృథానే అవుతోంది. రూ.లక్షలు ఖర్చు పెట్టి స్వయం ఉపాధి కింద వ్యాపారాలు పెట్టించినా నేరగాళ్లు తమ పంథాన్ని వీడటంలేదు. అప్పటికప్పుడు కొన్ని రోజులు మాత్రమే మారినట్లు నటించినా ఆచరణలో అది కనిపించడంలేదు. వందల కేసుల్లో చర్లపల్లి జైలులో శిక్షను అనుభవించిన ఖైదీల పరివర్తన కోసం మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని 2015లో అప్పటి క్రైం డీసీపీ నవీన్, మల్కాజిగిరి ఏసీపీలతో కలిసి ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పక్కనే ఖాళీ ప్రాంతంలో వెంకటరమణకు టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. 2016 ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన కర్నకంటి వీరబ్రహ్మచారికి ఉప్పల్ చౌరస్తాలో టీ కొట్టును ఏర్పాటు చేయించారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజుతో టీ కొట్టు పెట్టించారు. నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శ్రీనివాస్‌రెడ్డి, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రసాద్‌రెడ్డి.. ఇలా ఎంతోమంది కరడుగట్టిన నేరగాళ్లను మార్చడానికి టీ కొట్టు, టిఫిన్ సెంటర్లను ఏర్పాటు చేయించి జన జీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశం కల్పించారు. కొందరు నేరగాళ్లు మారినా మరికొందరు మాత్రం తమ ప్రవృత్తిని పోలీసుల కళ్లుగప్పి కొనసాగిస్తూనే ఉన్నారు. గత రెండున్నరేళ్లుగా వీరు ఏం చేస్తున్నారో.. ఎక్కడ ఉంటున్నారో.. పోలీసులకే తెలియడంలేదు. ఇదే కోవలో ఉప్పల్ చౌరస్తాలోని బస్టాప్‌లో టీ కొట్టును నడిపిస్తున్న బ్రహ్మచారి కొంతకాలం మాత్రమే దానిని నడిపించి మరొకరికి అప్పగించి మళ్లీ నేర ప్రవృత్తిని కొనసాగిస్తూనే వచ్చాడు. మూడు రోజుల క్రితం జహీరాబాద్‌లో బస్సులో ప్రయాణిస్తున్న మహిళను పోలీసులమని బెదిరించి బస్సులో నుంచి దించి ఆమెపై అత్యాచారం చేసిన కేసులో బ్రహ్మచారి ఉండటం గమనార్హం. ఇలా పోలీసులచే పునరావాసం కల్పించిన నేరగాళ్లు తమ పంథాన్ని వీడకపోవడమే కాకుండా మరింత కసితో నేరాల బాట పడుతుండటం శోచనీయం. -
పట్టు పరిశ్రమకు ‘ఉపాధి హామీ’ అనుసంధానం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో ఉత్పత్తి చేసే పట్టుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, పట్టు పరిశ్రమను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగం గానే పట్టు రైతులు నిర్మించే షెడ్‌లకోసం సహకరించేందుకు ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో జరిగిన పట్టు రైతు సమ్మేళనంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ త్వరలో పంచాయతీరాజ్ శాఖ మంత్రితో సమావేశమై ఉపాధిహామీ పథకం అనుసంధానంపై చర్చిస్తామని తెలిపారు. పట్టు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి పట్టు సాగులో యువతను భాగస్వాములను చేసేందుకే సిద్దిపేటలో సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతకుముందు మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో సంప్రదాయ పంటలకు సాంకేతికతను జోడించి దానిని స్ఫూర్తిగా కొనసాగించే ప్రయత్నంలో రైతు సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మేళనంలో వివిధ జిల్లాల పట్టు రైతులు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. -
వ్యవసాయానికి ఉపాధి దక్కేనా..!
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా రోజువారి పనుల్లో పాల్గొంటున్న వారిని వ్యవసాయరంగంలో సైతం సేవలు చేసేలా మార్పులు చేయాలని రైతులు చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే వ్యవసాయరంగానికి చేయూత ఇచ్చినట్లు అవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూలపల్లి: పనులు లేని రోజుల్లో గ్రామాల్లో ఉండే పేద ప్రజలకు, వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించాలని తీసుకొచ్చిన పథకం గ్రామీణ ఉపాధిహామీ పథకం. వ్యవసాయ పనులు లేని సమయాల్లో గ్రామల్లో ఉండే కూలీలు వలసపోకుండా అక్కడే పని కల్పించి ఉపాధి చూపెట్టడమే దీని ప్రధాన ఉద్దేశం. 2005లో చట్టం చేయబడి 2006లో ఉపాధిహామీ పథకం అమలులోకి వచ్చింది. మొదట్లో రోజుకు రూ.80 కూలీ ఇచ్చేవారు. ప్రస్తుతం రోజుకు రూ.205 ఇస్తున్నారు. ఈజీఎస్ పథకం కింద 45 శాతం యంత్రాలు, 55 శాతం కూలీలకు డబ్బులు ఇస్తున్నారు. పరిస్థితి ఇలా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం కింద పని చేసేవారు ఉదయం వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వస్తారు. దీంతో చాలా మంది కూలీలు వ్యవసాయ పనులకు రావడం లేదని వ్యవసాయదారులు అంటున్నారు. పంట సాగు చేసేప్పుడు, కోతలకు వచ్చిన సమయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి సంపూర్ణంగా అనుసంధానం చేస్తేనే చాలా ఉపయోగముంటుందని రైతులు అంటున్నారు. రాష్ట్రంలో 80 శాతం రైతులు సన్న, చిన్నకారు రైతులే. వారు వ్యవసాయ పనులు లేని సమయాల్లో ఉపాధి పనులకు వెళుతుంటారు. వ్యవసాయానికి ఉపాధిహామీని లింక్ చేస్తే ఇరువర్గాలకు లాభం చేకూరుతుందని వీరి వాదన. వ్యవసాయంలో 70 నుంచి 80 పనిదినాలకు మించి పనులు దొరకడం లేదని, 170 నుంచి 180 రోజులు పని ఉంటేనే ప్రధాన పనిదారుడు అంటున్నారని, అది కూడా గ్రామాల్లో లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. జిల్లా పరిస్థితి ఇది.. జిల్లాలో మొత్తం 1,07,324 జాబ్ కార్డులు ఉండగా.. 2,41,058 మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది 61,682 పని దినాలు 98,496 మందికి పని కల్పించారు. రూ.4,442.94 కోట్లు ఖర్చు చేశారు. కేంద్ర నిర్ణయంపైనే.. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఈజీఎస్‌తో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. రాజేంద్రనగర్, కరీంనగర్ రైతు సమన్వయ సమితి సమావేశాల్లో సైతం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాగా వ్యవసాయ రంగానికి అనుసంధానిస్తే కూలీల ఆత్మగౌరవం దెబ్బతింటుందని, దారి తప్పిన ఈ స్కీమ్‌లో లోపాలు సరిచేయకుండా వ్యవసాయరంగానికి లింక్ చేస్తే మరింత అవినీతి జరిగే ప్రమాదముందని మరికొన్ని వర్గాల వాదనలున్నాయి. కాగా ఇప్పటికే 28 రకాల వ్యవసాయ పనులకు ఉపాధిహామీని లింక్ చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో వ్యవసాయరంగానికి అనుసంధానిస్తేనే రైతు ప్రగతి సాధ్యమని రైతులు కోరుతున్నారు. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంది. వ్యవసాయానికి అనుసంధానించాలి ఉపాధిహామీని వ్యవసాయానికి లింక్ చేస్తే రైతుకు ఖర్చు తగ్గడంతోపాటు సకాలంలో పనులు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ రంగాన్ని ఉపాధిహామీకి అనుసంధానం చేసి రైతులు, కూలీలను ఆదుకోవాలి -కొత్త మల్లేశం, రైతు, కుమ్మరికుంట సమాచారం రాలేదు ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానించే సమాచారం ఏమీ ప్రభుత్వం నుంచి రాలేదు. చాలామంది రైతులు ఇదే అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. వస్తే బాగుంటుంది. ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. -ప్రేమ్‌కుమార్, డీఆర్డీవో -
ఉపాధి కూలీలపై పిడుగు
సాక్షి, నల్లగొండ పొమ్మనలేక పొగబెట్టినట్లు ఉంది సర్కారు తీరు. ‘ఉపాధి’ లో గతంలో బయోమెట్రిక్ విధానం.. తాజాగా ఆధార్ అనుసంధానం తెరమీదకు తీసుకొచ్చింది. పారదర్శకత పేరుతో ఏడాదికో విధానాన్ని ప్రవేశపెడుతుండడంతో కూలీలు బెంబేలెత్తుతున్నారు. ఆధార్ నమోదు కోసం ఇప్పటికే సతమతమవుతున్న కూలీలకు మరో తలనొప్పి రానుంది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల జాబ్‌కార్డులకు ‘ఆధార్’ ముడిపెట్టిన విషయం తెలిసిందే. అయితే అనుసంధానం కాని కూలీల వేతనాల చెల్లింపులు త్వరలో నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉపాధి కూలీల వివరాలకు ఆధార్ నంబర్‌ను కొన్ని నెలలుగా అనుసంధానం చేస్తున్నారు. కాకపోతే చెల్లింపులు బయోమెట్రిక్ విధానం ద్వారానే జరుగుతున్నాయి. ఇది ఇక మరికొన్ని రోజులే కొనసాగనుంది. ఇదీ పరిస్థితి... జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 11.46 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. ఇందులో సరాసరిగా 80వేల మంది కూలీలు రోజువారీగా పనులు చేస్తున్నారు. గతంలో మా న్యువల్ విధానం ద్వారా కూలీలకు చెల్లింపులు జరిగేవి. ఈ పద్ధతి 2001 మార్చి వరకు కొనసాగింది. ఆ సమయంలో కూలీలు పనులకు హాజరు కాకున్నా సిబ్బంది డబ్బులు డ్రా చేశారన్న ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. తద్వారా నిధులు పక్కదారి పట్టాయని సర్కారు గుర్తించింది. ఈ నేపథ్యంలో మాన్యువల్ స్థానంలో బయోమెట్రిక్ పద్ధతిని తీసుకొచ్చారు. కూలీల వేలిముద్రల ఆధారంగా ఇప్పటివరకు వేతనాలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే దీనికీ త్వరలో స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. ‘ఆధార్’తో ముడి... కొన్ని నెలల క్రితమే కూలీల జాబ్‌కార్డుకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం మొదలు పెట్టారు. జిల్లాలో 8.46 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఆరు నెలలుగా 5.63 లక్షల కార్డుల వివరాలు ఆధార్ నంబర్ (యూఐడీ)తో అనుసంధానం చేశారు. ఇందులో 4.78లక్షల కార్డులకు సంబంధించిన వివరాాల నమోదు మాత్రమే విజయవంతమైంది. సాంకేతిక కారణాల వల్ల మిగిలినవి అందుకు నోచుకోలేదు. ఇంకా 2.83లక్షల కార్డులు ఆధార్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. అయితే చాలామంది కూలీలు ఇప్పటికే ఆధార్ కోసం వివరాలు అందజేశారు. ఇదంతా జరిగి నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ కార్డులు అందడం లేవు. ఇంకొంతమంది అసలు నమోదే చేయించుకోలేదు. అయితే అతి త్వరలో ఆధార్ అనుసంధానం కాని కూలీలకు చెల్లింపులు నిలిచిపోనున్నాయి. దీంతో దాదాపు మూడు లక్షల మంది కూలీలు వేతనాలకు నోచుకోనట్టే. అంతేగాక ఆధార్ నమోదు చేసినా... విజయవంతం కానివారి కూలీల పరిస్థితేంటన్నది తేలాల్సి ఉంది. తొందరెందుకు...? ఉపాధి పథక ంలో కూలీలకు వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత కోసం నూతన విధానాలకు అవలంబించాలనుకోవడం సబబే. అయితే ఆ పద్ధతిని విజయవంతం చేయాలంటే పూర్వ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కాని ప్రణాళికేమీ లేకుండా అనుకున్నదే తడువుగా ఁఆధార్*తో ముడిపెట్టడం ఏంటన్న మౌలిక ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతోంది. పూర్తిస్థాయిలో కూలీలందరికీ ఆధార్‌కార్డు అందజేశాక ఈ విధానాన్ని అమలు చేస్తే ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ కూలీలకు అరకొరగా కార్డులు అందజేసి చెల్లింపులు నిలిపివేస్తామనడం అర్థరహితం. ఫలితంగా లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటి కైనా అనుసంధాన నిర్ణయాన్ని వాయిదా వే యడం గాని, లేదా పూర్తిగా తొలగించడంగాని చేస్తేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తంమవుతోంది. -
‘ఉపాధి’కి గండి
పాలకొండ, న్యూస్‌లైన్: పాలకొండ మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా స్థాయి పెంచడంతో ఉపాధిహామీ పథకాన్ని రద్దుచేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో పంచాయతీ పరిధిలోని వేతనదారులకు పని కరువైంది. రోజుకు సరాసరిన రూ.100 నుంచి రూ.150 వేతనాన్ని పొంది కుటుంబాన్ని నెట్టుకొచ్చే వేతనదారులు ప్రస్తుతం పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. జిల్లా సర్వోన్నత అధికారి, ఉపాధి హామీ ఉన్నత స్థాయి యంత్రాంగం కాస్త చొరవ చూపితే నిబంధనలను సడలించి పనులు కల్పించే అవకాశమున్నా ఆచరణ శూన్యమే అవుతోంది. ఫలితం... పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 1200 మంది వేతనదారులు వలస బాట పట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. పాలకొండ మేజర్ పంచాయతీలో మొత్తం 2,476 జాబ్‌కార్డులు ఉండగా, అందులో 1200 జాబ్‌కార్డులు మహిళలవే. వీటిలో 46 శ్రమశక్తి సంఘాలకు సంబంధించిన మహిళలు మాత్రం క్రమం తప్పకుండా ఉపాధి పనులు చేపడుతున్నారు. మట్టి పనులు, కాలువ పనులు, చెరువు పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరు చేసే పనిని బట్టి క్యూబిక్ మీటర్ల వంతున లెక్కకట్టి వేతనాన్ని అందిస్తుండగా, వీరికి సరాసరిన రోజుకు రూ.150 గిట్టుబాటు అయ్యేది. పాలకొండకు సంబంధించి పురుషులు కూలి పనులకు వెళ్లి సరాసరి రోజుకు రూ.300 నుంచి రూ.400 సంపాదించుకునే వెసులబాటు ఉండడంతో ఇంటిలో మగవారంతా సాధారణ పనులకు, మహిళలు ఉపాధి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. గతేడాది మార్చిలో పాలకొండను నగర పంచాయతీగా స్థాయి పెంచడంతో ఒక్కసారిగా పనులు రద్దయ్యాయి. దీంతో వేతనదారుల్లో ఆందోళన మొదలైంది. పనులు కల్పించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యల్లేవు... వాస్తవానికి ఉపాధి పనులు రద్దు చేస్తే సంబంధిత పట్టణంలోని పరిశ్రమల్లో ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అరుుతే, ఇప్పటికీ ఓ పెద్ద పల్లెలా ఉండే పాలకొండలో ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కూడా లేదు. స్థాయి పెంచినంత మాత్రాన తమ బతుకులు మారిపోతాయా అంటూ వివిధ ప్రాంతాలకు చెందిన ఆబోదుల రమ, శ్యామల, ఆనాపు ఆదిలక్ష్మి, కల్లూరు గౌరమ్మ, బుక్క సీత, నిమ్మక రమణమ్మ తదితరులు ‘న్యూస్‌లైన్’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
యంత్రాలకే ‘ఉపాధి’
కాంట్రాక్టర్‌కే రాబడి వేతనదారులకు మొండిచేయి పక్కదారి పడుతున్న ఉపాధి హామీ నిధులు రోడ్డు నిర్మాణంలో యథేచ్ఛగా అక్రమాలు పర్యవేక్షించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధుల మౌనం గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని రోజుల్లో పేద రైతులు, కూలీలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం భారీ యంత్రాల కింద పడి నలిగిపోతోంది. వేతనదారుల నోట్లో మట్టి కొట్టి కాంట్రాక్టర్లు జేబులు నింపుకొంటున్నారు. కాంట్రాక్టర్లకే ఇవ్వకూడని ఈ పనులను వారికి ధారాదత్తం చేసేస్తుంటే.. వారు సైతం యంత్రాలకు పని చెప్పి వేతనదారుల పొట్ట కొడుతున్నారు. నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాల్సిన సర్పంచు, అధికారులు మౌనం వహిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. దీనికి వజ్రపుకొత్తూరు మండలంలో జరుగుతున్న ఒక రోడ్డు నిర్మాణమే నిదర్శనం. పూండి, న్యూస్‌లైన్: దేవునల్తాడ-కొమరల్తాడ రోడ్డు నిర్మాణం సాక్షిగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులకే ఉపాధి పథకంగా మారింది. రూ.18 లక్షల నిధులతో 1.50 కిలోమీటర్ల నిడివిన జరుగుతున్న ఈ నిర్మాణంలో పనుల అప్పగింత నుంచి నిర్వాహణ వరకు అన్నింటా యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. వేతనదారులతో కాకుండా యంత్రాలతో.. అదీ ఇసుక దిబ్బలపైనే గ్రావెల్ పోసి అత్యంత నాసిరకంగా రోడ్డు నిర్మిస్తున్నారు. మరోవైపు కొమరల్తాడ ఉపాధి వేతనదారులకు గత ఏడాదిగా పనుల్లేవు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు పనుల్లో వారి ఉపాధి కల్పించాల్సి ఉండగా యంత్రాలకు పని కల్పించారు. మరి మస్టర్లు ఎవరి పేరిట వేస్తారు?.. బిల్లులు ఎలా చేస్తారన్నది?? ప్రశ్నలు తలెత్తుతున్నా.. ఇందులోనూ అక్రమాలే చోటుచేసుకుంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి పనులు ఎలా చేపట్టాలి ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను జాబ్‌కార్డులున్న వేతనదారులతోనే చేయిం చాలి. ఈ పథకం కింద చేపట్టే ఏ పనికైనా వర్క్ ఆర్డర్ సంబంధిత గ్రామ సర్పంచ్, కార్యదర్శుల పేరుతో వస్తుంది. నిధులు కూడా వారి ఖాతాకే జమ అవుతాయి. ఆ మేరకు వారు తమ పరిధిలోని వేతనదారులతో ఆ పనులు చేయించాలి. మస్టర్లు వేసి వేతనాల రూపంలో నిధులు ఖర్చు చేయాలి. ఈ పనులను పంచాయతీరాజ్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్రాక్టర్లు, యంత్రాల ప్రమేయం ఉండరాదు. కానీ ఇక్కడ రోడ్డు నిర్మాణం విషయంలో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. పనులను గంప గుత్తగా కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేశారు. వేతనదారుల జాడ లేదు. వారి స్థానంలో భారీ యంత్రాలు పని చేస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారుల జాడా కనిపించలేదు. ఇంకేముంది.. అంతా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా సాగుతోంది. అయితే మాకేంటి? ఈ పనులను పరిశీలించేందుకు వెళ్లిన ‘న్యూస్‌లైన్’తో సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా మాట్లాడారు. వివరణ కోరగా ‘ఉపాధి పనులే.. అయినా ఇలాగే చేస్తాం.. యంత్రాలే ఉపయోగిస్తాం.. విలేకరులైతే మాకేంటి?’ అని సమాధానమిచ్చారు. జరుగుతున్న పనులు కూడా ఆ తీరులోనే ఉన్నాయి. నాణ్యత ప్రమాణాలు అస లు పాటించడం లేదు. గ్రావెల్, మెటల్, మళ్లీ గ్రావెల్.. ఇలా మూడు లేయర్లు వేయల్సి ఉండగా.. ఒక్క గ్రావెల్ లేయర్తోనే సరిపెట్టేస్తున్నారు. గ్రావెల్ కూడా నాణ్యత లేనిదే. నంది గాం మండలం వల్లభరాయుడు పేట పొలాల నుంచి మట్టితో కలగలిసిన గ్రావెల్‌ను జేసీబీ యంత్రాలతో తవ్వి రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్నారు. ఈ మార్గంలో ఉన్న ఇసుక మేటలను తొలగించి రోడ్డు నిర్మించాల్సి ఉండ గా, ఇసుక తొలగించకుండా దాని మీదే గ్రావెల్ వేస్తున్నారు. గతంలో నిర్మించిన పూండి-మడేవానిపేట, రెయ్యిపాడు-తేరపల్లి రహదారులు నాణ్యతలోపంతో ఇప్పటికే గోతులమయమై బాటసారులు నడవలేని స్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు వేస్తున్న రోడ్డు పరిస్థితీ అలాగే తయారవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనులు నిలిపివేస్తాం యంత్రాలతో ఉపాధి హామీ పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని పంచాయతీరాజ్ ఏఈ జి.రవిబాబు ‘న్యూస్‌లైన్’కు వివరణ ఇచ్చారు. పనులను తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నారు. ఇప్పటివరకు జరిగిన పనులకు బిల్లులు చేయలేదు, వాటిని నిలిపి వేసి కూలీలతో చేయిస్తామని చెప్పారు. ఇలా వేయాలి మొదట 8 అంగుళాల మందంలో గ్రావెల్ పరవాలి దాని మీద 3 అంగుళాల మేరకు బ్లాక్ మెటల్ వేయాలి ఆపైన మళ్లీ 2 అంగుళాల మందంలో గ్రావెల్ వేయాలి అప్పుడు నీటితో తడుపుతూ రోల్ చేయాలి ఇలా చేస్తున్నారు ఆ మార్గం నిండా ఉన్న ఇసుక మేటలపైనే గ్రావెల్ పోసేస్తున్నారు అది కూడా 6 అంగుళాలకు మించడం లేదు ఆ ఒక్క పొరతోనే సరిపెట్టేస్తున్నారు నీటితో తడపకుండానే డోజర్‌తో రోల్ చేస్తున్నారు -
ఇకపై పల్లెలు పరిశుభ్రం
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు.. పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.. పట్టణాల కంటే పల్లెలే ఎంతో మేలు.. ఇలాంటి వాక్యాలు మనం ఎన్నో సందర్భాల్లో చదివాం. విన్నాం. కానీ వర్షాకాలం వచ్చిందం టే పల్లెల్లోకి వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఎందుకంటే పారిశుధ్య లోపం. ఎక్కడ చూసినా చెత్తాచెదారం. పూడికతో నిండిన డ్రెయినేజీలు, శుభ్రంగా లేని రోడ్లు, మరుగుదొడ్లు లేని ఇళ్లు. ఇలాంటి వాతావరణమే ప్రస్తుతం గ్రామాల్లో కనిపిస్తోంది. దీంతో పట్టణాలకు వలస వెళ్లిన వారు పల్లెలకు రావాలంటేనే జంకుతున్నారు. పారిశుధ్యలోపం, చెత్తతో దోమల విజృంభన, సీజనల్ వ్యాధుల దాడి, మరుగుదొడ్లు లేని ఇళ్లు, అసౌకర్యాలు కనుమరుగు కానున్నాయి. కొద్ది రోజుల్లో పరిశుభ్రానికి ‘ఉపాధి’ బాటలు వేయనుంది. ఇప్పటివరకు మున్సిపాలిటీల్లోనే ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తారని తెలుసు.. ఇకపై గ్రామాల్లోని చెత్తను తొలగించేందుకు ప్రతీ పంచాయతీలో ఉపాధిహామీ పథకం ద్వారా చెత్త డంపింగ్ యార్డుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిం చారు. జిల్లాలోని 866 గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.9100 ప్రభుత్వం అందిస్తుండగా లబ్ధిదారు వాటాగా రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రతీ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు 866 జీపీల్లో చెత్త డంప్‌యార్డుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో స్థల సేకరణ చేసి, పనులు కూడా ప్రారంభించారు. పల్లెల అభివృద్ధికి పాటుపడాలనుకునే సర్పంచులకు ఇది చక్కని అవకాశం. డంపింగ్ యార్డు ఏర్పాటు ఇలా.. ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తారు. ముందుగా ప్రభుత్వ/పంచాయతీకి చెందిన 7 గుంటల భూమిని, గ్రామానికి 500 మీటర్ల నుంచి కిలోమీటరు దూరంలో గుర్తిస్తారు. భూమి ఎత్తయిన ప్రదేశంలో ఉండేలా చూడడం వల్ల వర్షపు నీరు చెత్తలోకి రాకుండా ఉంటుంది. 15 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల గుంతను తవ్వుతారు. చెత్త వేసేందుకు, రిక్షాలు, తోపుడు బండ్లు డంపింగ్ యార్డుకు చేరుకోవడానికి దారి, ర్యాంపు ఏర్పాటు చేస్తారు. గుంతగా తవ్విన మట్టిని చెత్తలోకి నీరు వెళ్లకుండా కట్టలా పోస్తారు. ఈ పనులన్నీ ఉపాధిహామీ కూలీల ద్వారా చేపడతారు. డంపింగ్ యార్డు ఏర్పాటు పనుల వల్ల 180 రోజుల పని దొరుకుతుంది. కూలీ కింద ఒక్కో డంప్ యార్డుకు రూ.1,16,888, మెటీరియల్‌కు రూ.7,152 చెల్లిస్తారు. డంపింగ్ యార్డు పూర్తయిన తర్వాత ఉపాధికూలీలతో గ్రామాల్లోని చెత్తను నెలలో 15 రోజులపాటు సేకరించడం, 4 రోజులపాటు డంపింగ్ యార్డులోకి తరలించడం చేస్తారు. నిర్వహణ తీరు.. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణకు ప్రత్యేకంగా కార్మికులు లేరు. ప్రభుత్వం చేపట్టే పారిశుధ్య వారోత్సవాల్లోనే చెత్తాచెదారం తొలగించడం, గ్రామాల్లోని కాలనీలను శుభ్రపరచడం చేసేవారు. ఏడాదికి నాలుగైదు సార్లు గ్రామంలోని చెత్త తొలగించే కార్యక్రమాలు చేపడుతున్నారు. నిధుల లేమి, కార్మికుల కొరతతో ఇన్నాళ్లు చెత్త సేకరణకు ప్రత్యేకంగా కార్మికులను పంచాయతీల్లో నియమించలేదు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు కార్మికులను ఏర్పాటు చేసినట్లే, ఇక నుంచి గ్రామాల్లో కూడా చెత్త సేకరణ కోసం ఉపాధిహామీ కూలీలను నియమిస్తారు. వీరు వారంలో 3 సార్లు ఇంటింటికి వెళ్లి చెత్త పోగు చేస్తారు. దీన్ని రిక్షా/తోపుడు బళ్ల ద్వారా తరలించి డంపింగ్ యార్డులో పోస్తారు. చెత్త సేకరించినందుకు ఒక్కో కూలీకి రోజుకు రూ.149 చెల్లిస్తారు. ఇలా ఏడాదిలో 180 పనిదినాలకు ఉపాధి లభిస్తుంది. చెత్తను డంప్‌యార్డుకు తరలించేందుకు రూ.7వేలు అదనంగా లభిస్తుంది. పోగు చేసిన చెత్తాచెదారం ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. డంప్ నిండిన తర్వాత దాన్ని ఎరువుగా మార్చి వేలం పాట ద్వారా విక్రయిస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఇవి గ్రామపంచాయతీ అభివృద్ధికి ఉపయోగించవచ్చు. -
‘ఉపాధి’ పనుల్లో 33 లక్షల అవినీతి
పీసీపల్లి, న్యూస్‌లైన్ : పీసీపల్లి మండలంలో మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల్లో 33 లక్షల అవినీతి చోటుచేసుకున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది. అధికార పార్టీ చోటా నాయకులు, ఉపాధి హామీ క్షేత్ర స్థాయి సిబ్బందికి ఈ అవినీతి భాగోతంలో భాగస్వామ్యం ఉందని విమర్శలొస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు ఉపాధి నిధులు ఈ ఏడాది నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ఉపాధి హామీ నిధులను నొక్కేసేందుకు వేదికగా మారాయి. అధికార పార్టీ నేతల అండదండలతో పీసీపల్లి మండలంలోని మేజర్‌పంచాయతీల్లో హడావుడిగా పనులు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ చోటా నాయకులు.. తమ పలుకుబడిని ఉపయోగించి బిల్లులు చేసుకున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది. పీసీపల్లి మండలంలో 2012-13లో ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు 1.87 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో మెటీరియల్‌కు 14.47 లక్షలు, కూలీలకు 1.72 కోట్లు చెల్లించారని, మొత్తం 1,200 పనులు చేపట్టినట్లు సామాజిక తనిఖీ బృందం సభ్యులు మంగళవారం నిర్వహించిన ప్రజావేదికలో వెల్లడించారు. ఈ పనుల్లో మొత్తం 33 లక్షల రూపాయల అవినీతి చోటుచేసుకుందని ఉపాధి హామీ అధికారులు బుధవారం స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడింది ఈ గ్రామాల్లోనే.. గుదేవారిపాలెంలో 4 లక్షల పనులు చేయగా 1.85 లక్ష లు, బట్టుపల్లిలో 2 లక్షల పనులు చేయగా 5 వేలు, వేపగుంపల్లిలో 38 వేల పనులు చేయగా 2 వేలు, వెంగళాయపల్లిలో 14.80 లక్షలకు గాను 4.50 లక్షలు, పీసీపల్లిలో 30 లక్షల పనులకుగాను 1.80 లక్షలు, గుంటుపల్లిలో 15 లక్షల పనులకుగాను 5.80, మారెళ్లలో 4 లక్షల పనులకుగాను 16 వేలు, మురుగమ్మిలో 25 లక్షల పనులకుగాను 13 లక్షలు, లక్ష్మక్కపల్లిలో 12 లక్షల పనులకుగాను 2 లక్షలు, తలకొండపాడులో 3 లక్షల పనులకుగాను 15 వేలు, పెదఇర్లపాడులో 8 లక్షల పనులకుగాను 70 వేలు, పెదఅలవలపాడులో 11 లక్షల పనులకుగాను 97 వేలు, చౌటగోగులపల్లిలో 3 లక్షల పనులకుగాను 10 వేలు, చింతగుంపల్లిలో 14 లక్షల పనులకుగాను 10 వేలు, చినవరిమడుగులో 6 లక్షల పనులకుగాను 3.50 లక్షలు, ముద్దపాడులో వేయి, నేరేడుపల్లిలో 9 లక్షల పనులకుగాను 2 వేలు నొక్కేసినట్లు తనిఖీలో తేలిందని స్టేట్ ఎస్ఆర్పీ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు తుదినిర్ణయం తీసుకుంటారని చెప్పారు.