పాలకొండ, న్యూస్‌లైన్: పాలకొండ మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా స్థాయి పెంచడంతో ఉపాధిహామీ పథకాన్ని రద్దుచేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో పంచాయతీ పరిధిలోని వేతనదారులకు పని కరువైంది. రోజుకు సరాసరిన రూ.100 నుంచి రూ.150 వేతనాన్ని పొంది కుటుంబాన్ని నెట్టుకొచ్చే వేతనదారులు ప్రస్తుతం పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. జిల్లా సర్వోన్నత అధికారి, ఉపాధి హామీ ఉన్నత స్థాయి యంత్రాంగం కాస్త చొరవ చూపితే నిబంధనలను సడలించి పనులు కల్పించే అవకాశమున్నా ఆచరణ శూన్యమే అవుతోంది. ఫలితం... పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 1200 మంది వేతనదారులు వలస బాట పట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. పాలకొండ మేజర్ పంచాయతీలో మొత్తం 2,476 జాబ్‌కార్డులు ఉండగా, అందులో 1200 జాబ్‌కార్డులు మహిళలవే. వీటిలో 46 శ్రమశక్తి సంఘాలకు సంబంధించిన మహిళలు మాత్రం క్రమం తప్పకుండా ఉపాధి పనులు చేపడుతున్నారు. మట్టి పనులు, కాలువ పనులు, చెరువు పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరు చేసే పనిని బట్టి క్యూబిక్ మీటర్ల వంతున లెక్కకట్టి వేతనాన్ని అందిస్తుండగా, వీరికి సరాసరిన రోజుకు రూ.150 గిట్టుబాటు అయ్యేది.
పాలకొండకు సంబంధించి పురుషులు కూలి పనులకు వెళ్లి సరాసరి రోజుకు రూ.300 నుంచి రూ.400 సంపాదించుకునే వెసులబాటు ఉండడంతో ఇంటిలో మగవారంతా సాధారణ పనులకు, మహిళలు ఉపాధి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. గతేడాది మార్చిలో పాలకొండను నగర పంచాయతీగా స్థాయి పెంచడంతో ఒక్కసారిగా పనులు రద్దయ్యాయి. దీంతో వేతనదారుల్లో ఆందోళన మొదలైంది. పనులు కల్పించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ చర్యల్లేవు...
వాస్తవానికి ఉపాధి పనులు రద్దు చేస్తే సంబంధిత పట్టణంలోని పరిశ్రమల్లో ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అరుుతే, ఇప్పటికీ ఓ పెద్ద పల్లెలా ఉండే పాలకొండలో ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కూడా లేదు. స్థాయి పెంచినంత మాత్రాన తమ బతుకులు మారిపోతాయా అంటూ వివిధ ప్రాంతాలకు చెందిన ఆబోదుల రమ, శ్యామల, ఆనాపు ఆదిలక్ష్మి, కల్లూరు గౌరమ్మ, బుక్క సీత, నిమ్మక రమణమ్మ తదితరులు ‘న్యూస్‌లైన్’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఉపాధి’కి గండి
Published Sat, Feb 1 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement