యంత్రాలకే ‘ఉపాధి’ | employement to vehicles | Sakshi
Sakshi News home page

యంత్రాలకే ‘ఉపాధి’

Published Sat, Feb 1 2014 3:29 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM

employement to vehicles

 కాంట్రాక్టర్‌కే రాబడి
 వేతనదారులకు మొండిచేయి
 పక్కదారి పడుతున్న ఉపాధి హామీ నిధులు
 రోడ్డు నిర్మాణంలో యథేచ్ఛగా అక్రమాలు
 పర్యవేక్షించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధుల మౌనం
 
 గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని రోజుల్లో పేద రైతులు, కూలీలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం భారీ యంత్రాల కింద పడి నలిగిపోతోంది. వేతనదారుల నోట్లో మట్టి కొట్టి కాంట్రాక్టర్లు జేబులు నింపుకొంటున్నారు. కాంట్రాక్టర్లకే ఇవ్వకూడని ఈ పనులను వారికి ధారాదత్తం చేసేస్తుంటే.. వారు సైతం యంత్రాలకు పని చెప్పి వేతనదారుల పొట్ట కొడుతున్నారు. నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాల్సిన సర్పంచు, అధికారులు మౌనం వహిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. దీనికి వజ్రపుకొత్తూరు మండలంలో జరుగుతున్న ఒక రోడ్డు నిర్మాణమే నిదర్శనం.
 
 పూండి, న్యూస్‌లైన్:
 దేవునల్తాడ-కొమరల్తాడ రోడ్డు నిర్మాణం సాక్షిగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులకే ఉపాధి పథకంగా మారింది. రూ.18 లక్షల నిధులతో 1.50 కిలోమీటర్ల నిడివిన జరుగుతున్న ఈ నిర్మాణంలో పనుల అప్పగింత నుంచి నిర్వాహణ వరకు అన్నింటా యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. వేతనదారులతో కాకుండా యంత్రాలతో.. అదీ ఇసుక దిబ్బలపైనే గ్రావెల్ పోసి అత్యంత నాసిరకంగా రోడ్డు నిర్మిస్తున్నారు. మరోవైపు కొమరల్తాడ ఉపాధి వేతనదారులకు గత ఏడాదిగా పనుల్లేవు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు పనుల్లో వారి ఉపాధి కల్పించాల్సి ఉండగా యంత్రాలకు పని కల్పించారు. మరి మస్టర్లు ఎవరి పేరిట వేస్తారు?.. బిల్లులు ఎలా చేస్తారన్నది?? ప్రశ్నలు తలెత్తుతున్నా.. ఇందులోనూ అక్రమాలే చోటుచేసుకుంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 ఉపాధి పనులు ఎలా చేపట్టాలి
 ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను జాబ్‌కార్డులున్న వేతనదారులతోనే చేయిం చాలి. ఈ పథకం కింద చేపట్టే ఏ పనికైనా వర్క్ ఆర్డర్ సంబంధిత గ్రామ సర్పంచ్, కార్యదర్శుల పేరుతో వస్తుంది. నిధులు కూడా వారి ఖాతాకే జమ అవుతాయి. ఆ మేరకు వారు తమ పరిధిలోని వేతనదారులతో ఆ పనులు చేయించాలి. మస్టర్లు వేసి వేతనాల రూపంలో నిధులు ఖర్చు చేయాలి. ఈ పనులను పంచాయతీరాజ్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్రాక్టర్లు, యంత్రాల ప్రమేయం ఉండరాదు. కానీ ఇక్కడ రోడ్డు నిర్మాణం విషయంలో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. పనులను గంప గుత్తగా కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేశారు. వేతనదారుల జాడ లేదు. వారి స్థానంలో భారీ యంత్రాలు పని చేస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారుల జాడా కనిపించలేదు. ఇంకేముంది.. అంతా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా సాగుతోంది.
 
 అయితే మాకేంటి?
 ఈ పనులను పరిశీలించేందుకు వెళ్లిన ‘న్యూస్‌లైన్’తో సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా మాట్లాడారు. వివరణ కోరగా ‘ఉపాధి పనులే.. అయినా ఇలాగే చేస్తాం.. యంత్రాలే ఉపయోగిస్తాం.. విలేకరులైతే మాకేంటి?’ అని సమాధానమిచ్చారు. జరుగుతున్న పనులు కూడా ఆ తీరులోనే ఉన్నాయి. నాణ్యత ప్రమాణాలు అస లు పాటించడం లేదు. గ్రావెల్, మెటల్, మళ్లీ గ్రావెల్.. ఇలా మూడు లేయర్లు వేయల్సి ఉండగా.. ఒక్క గ్రావెల్ లేయర్‌తోనే సరిపెట్టేస్తున్నారు. గ్రావెల్ కూడా నాణ్యత లేనిదే. నంది గాం మండలం వల్లభరాయుడు పేట పొలాల నుంచి మట్టితో కలగలిసిన గ్రావెల్‌ను జేసీబీ యంత్రాలతో తవ్వి రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్నారు. ఈ మార్గంలో ఉన్న ఇసుక మేటలను తొలగించి రోడ్డు నిర్మించాల్సి ఉండ గా, ఇసుక తొలగించకుండా దాని మీదే గ్రావెల్ వేస్తున్నారు.  గతంలో నిర్మించిన పూండి-మడేవానిపేట, రెయ్యిపాడు-తేరపల్లి రహదారులు నాణ్యతలోపంతో ఇప్పటికే గోతులమయమై బాటసారులు  నడవలేని స్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు వేస్తున్న రోడ్డు పరిస్థితీ అలాగే తయారవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 పనులు నిలిపివేస్తాం
 యంత్రాలతో ఉపాధి హామీ పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని పంచాయతీరాజ్ ఏఈ జి.రవిబాబు ‘న్యూస్‌లైన్’కు వివరణ ఇచ్చారు. పనులను తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నారు. ఇప్పటివరకు జరిగిన పనులకు బిల్లులు చేయలేదు, వాటిని నిలిపి వేసి కూలీలతో చేయిస్తామని చెప్పారు.
 
 
 ఇలా వేయాలి
  మొదట 8 అంగుళాల
 మందంలో గ్రావెల్ పరవాలి
   దాని మీద 3 అంగుళాల మేరకు బ్లాక్ మెటల్ వేయాలి
 ఆపైన మళ్లీ 2 అంగుళాల మందంలో గ్రావెల్ వేయాలి
   అప్పుడు నీటితో తడుపుతూ రోల్ చేయాలి
 
 ఇలా చేస్తున్నారు
   ఆ మార్గం నిండా ఉన్న     ఇసుక మేటలపైనే గ్రావెల్ పోసేస్తున్నారు
  అది కూడా 6 అంగుళాలకు మించడం లేదు
   ఆ ఒక్క పొరతోనే సరిపెట్టేస్తున్నారు
   నీటితో తడపకుండానే డోజర్‌తో     రోల్ చేస్తున్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement