సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యులు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిని కలిశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. మెడికల్ పీజీ ప్రవేశాల్లో ఇన్ సర్వీసు కోటాను పునరుద్ధరించాలని ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్ అమలు చేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రసవాల కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావాలని, తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్ పోస్టును విధిగా సీనియర్ వైద్యునికే ఇవ్వాలని విజ్ఞఫ్తి చేశారు. శనివారం వారు సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో సమావేశమై దాదాపు రెండు గంటలపాటు తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశంలో అధికారులతోపాటు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.నరహరి, కోశాధికారి డాక్టర్ రవూఫ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(ప్రజారోగ్య విభాగం) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.సుధాకర్, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర కోశాధికారి దీన్‌దయాళ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నాగార్జున, డాక్టర్ సాయిబాబా, డాక్టర్ వినోద్, డాక్టర్ సాల్మన్, డాక్టర్ రవితేజ, డాక్టర్ దాక్షాయణి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆ రెండు సంఘాల నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అవకాశమున్న మేరకు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారని నరహరి తెలిపారు. వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వైద్యులు కూ డా ప్రజలకు సేవచేయడానికి అంతే చిత్తశుద్ధి తో పనిచేయాలని మంత్రి కోరారన్నారు. నాణ్యమైన వైద్యం సామాన్యులకు అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్యుల డిమాండ్లు ఇవీ...
►2016లో యూజీసీ ఇచ్చిన వేతన స్కేల్‌ను అమలు చేయాలి. నాటి నుంచి సంబంధిత బకాయిలు చెల్లించాలి.
►పీజీ వైద్య విద్యను మరింత పరిపుష్టం చేయడం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందజేయడం కోసం నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఫ్యాకల్టీని మరింత బలోపేతం చేయాలి
►బోధనాసుపత్రుల్లోని వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు కల్పించాలి
►ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించడం
►వైద్యవిధాన పరిషత్ వైద్య ఉద్యోగులకు ట్రెజరీ వేతనాలు అందజేయాలి
►వైద్య విధాన పరిషత్‌లోని వైద్యులందరికీ ఆరోగ్యకార్డులు అందజేయాలి
►2004 తర్వాత చేరిన ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ స్కీం బదులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
►జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల అధ్యాపకులకు బేసిక్ వేతనంలో 40 శాతం అదనంగా ప్రోత్సాహకం ఇవ్వాలి
►సిబ్బంది స్థాయిని పెంచి వైద్యులకు త్వరగా పదోన్నతులు వచ్చేలా చూడాలి
►వివిధ రకాలైన అలవెన్సులు త్వరగా విడుదల చేయాలి
►హైదరాబాదులోని వైద్యులకు సంబంధించి జీవో 140 ని అమలు చేయాలి
►వైద్యాధికారులకు వాహన సౌకర్యము లేదా రవాణా భత్యం కల్పించాలి
►జాతీయ కార్యక్రమాల అమలుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలి
►దూరపు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి బదిలీలు కల్పించాలి
►వైద్యులపై అన్యాయంగా విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలి
►ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలి
►ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలి
Comments
Please login to add a commentAdd a comment