టీ వైద్యులకు అన్యాయం జరగనివ్వం
ప్రభుత్వ వైద్యులకు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి హామీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల విభజనలో తెలంగాణ వైద్యులకు అన్యాయం జరగనివ్వబోమని మంత్రులు కె.తారకరామారావు, లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఇటీవల వైద్యులు ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంపై ప్రభుత్వ వైద్యులు మంగళవారం స్టీరింగ్ కమిటీగా ఏర్పడి మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డిలను కలిశారు.
భార్యాభర్తల (స్పౌస్) అంశం ఉంటే తప్ప ఏ రాష్ట్రం వారిని ఆ రాష్ట్రానికి కేటాయించాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారని స్టీరింగ్ కమిటీ నేత డాక్టర్ లాలూ ప్రసాద్, గెజిటెడ్ వైద్య ఉద్యోగుల నేత జూపల్లి రాజేందర్ తెలిపారు. తమ భేటీ సందర్భంగా కేటీఆర్ సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారన్నారు. సీఎం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను మంత్రులతోపాటు తామూ కలిశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు అన్యాయం జరగకూడదని, ఆంధ్రప్రదేశ్ సీఎస్‌తో సమావేశమై ప్రభుత్వ వైద్యుల విభజన ప్రక్రియను పరిష్కరించాలని కేటీఆర్ సీఎస్ రాజీవ్‌శర్మను కోరినట్లు వారు తెలిపారు.
కాగా, కమలనాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం తయారుచేసిన వైద్యుల విభజన జాబితాలో తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని స్టీరింగ్ కమిటీ నేతలు సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ జాబితాను రద్దు చేయాలన్నారు. సీఎస్‌ను, మంత్రులను కలసిన వారిలో డాక్టర్లు పల్లం ప్రవీణ్, బి.రమేష్, రమేష్‌రెడ్డి, ఉమాశంకర్, వినోద్ తదితరులున్నారు.