ప్రభుత్వ వైద్యుల సమ్మె నోటీసు
⇒ ఏప్రిల్ 10 నుంచి విడతల వారీ సమ్మె
⇒ జూన్ 2 నుంచి అన్ని వైద్య సేవల బహిష్కరణ
⇒ వేతనాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన తదితర డిమాండ్లు
సాక్షి, హైదరాబాద్
ప్రభుత్వ వైద్యులు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ 28 డిమాండ్లను 18 రోజుల్లోగా పరిష్కరించకుంటే వచ్చే నెల 10 నుంచి విడతల వారీ సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.రమేష్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్, సెక్రటరీ జనరల్ డాక్టర్ బి.రమేష్, కోశాధికారి డాక్టర్ పి.లాలూప్రసాద్ తదితరులు గురువారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేశారు. మరో ప్రతిని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి పంపించారు.
డిమాండ్లు పరిష్కరించకుంటే... వచ్చే నెల 10 నుంచి 30 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, మే ఒకటి నుంచి 15 వరకు రోజుకో గంట నిరసన కార్యక్రమం చేపడతామని అందులో పేర్కొన్నారు. అదే నెల 16 నుంచి జూన్ ఒకటి వరకు ఓపీ సేవలను, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి అన్ని రకాల వైద్య సేవలను బహిష్కరిస్తారు. సమస్యలు పరిష్కరించకుంటే... రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు జిల్లా ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ సహా అన్ని బోధన, బోధనేతర ఆసుపత్రులన్నింటిలోనూ సమ్మె ఉంటుందని సంఘం కోశాధికారి డాక్టర్ లాలూప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల మందికి పైగా వైద్యులు సమ్మెలో పాల్గొంటారన్నారు.
ప్రభుత్వ వైద్యుల ప్రధాన డిమాండ్లివే...
– డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనర్ పోస్టులను సీనియారిటీ ప్రకారం వైద్యులతో భర్తీ చేయాలి.
– గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు, జిల్లా తదితర ఆసుపత్రులకు డైరెక్టర్లను నియమించాలన్న ఆలోచనను విరమించుకోవాలి.
– వర్సిటీ అధ్యాపకుల మాదిరిగా యూజీసీ స్కేళ్లు, అలవెన్సులు ఇవ్వాలి.
– అన్ని రకాల పదోన్నతులు, బదిలీలను కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే నిర్వహించాలి.
– మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ, రిమ్స్ వంటి పాక్షిక స్వయంప్రతిపత్తి వాటిని సాధారణ మెడికల్ కాలేజీలుగా మార్పు చేయాలి.
– తెలంగాణకు కేటాయించిన 171 మంది ఆంధ్రా డాక్టర్లను వెనక్కు పంపించాలి
– తప్పుడు ధ్రువీకరణపత్రాలు ఇచ్చిన డాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి
– ఆరోగ్య సంచాలకుల పరిధిలోని వారందిరికీ పేస్కేల్ పెంచాలి. 24 రకాల అలవెన్సులు అందజేయాలి.
– పదో పీఆర్సీని అమలచేయాలి. పెండింగ్ ఎరియర్స్ ఇవ్వాలి.
– వైద్య ఆరోగ్యశాఖపై కిందిస్థాయిలో తహసిల్దార్, ఎంపీడీవో, సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్ వంటి వారి పర్యవేక్షణను రద్దు చేయాలి.
ఈఎస్‌ఐ సిబ్బందిని విభజించి అందులోని వైద్యులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి.