minister laxmareddy
-
నకిలీ వైద్యులపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును తప్పుపడుతూ గురువారం శాసనమండలిలో అధికారపక్ష సభ్యులే మంత్రి లక్ష్మారెడ్డిపై విమర్శలు చేశారు. నకిలీ వైద్యులకు సంబంధించిన ప్రశ్న సందర్భంగా ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లు అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. అలాంటి వారిపై పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఓ ఆస్పత్రిలో చేరిన మహిళకు పరీక్షలేవీ చేయకుండానే 15 రోజుల వ్యవధిలో మూడు సర్జరీలు చేసి ఆమె మృతికి కారణమైన వైద్యులు, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి, మంత్రి పేషీకి ఫిర్యాదు చేసినా ఇంత వరకు స్పందించలేదని మరో సభ్యుడు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. అలాగే సరైన వైద్యం అందించక పోవడంతో అదే ఆస్పత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే మృతి చెందిన ఘటనపైనా ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. దీనిపై లక్ష్మారెడ్డి స్పందిస్తూ మహిళ మృతి కేసులో చట్ట ప్రకారం ఆస్పత్రిపె చర్యలు తీసుకుంటామని, మాజీ ఎమ్మెల్యే మృతి అంశంపై విచారణ జరుగుతోందన్నారు. ఇంకా పలువురు సభ్యులు విమర్శలు కురిపించడంతో మంత్రి లక్ష్మారెడ్డి కొంత అసహనానికి గురవగా ఆర్థిక మంత్రి ఈటల కల్పించుకొని మాట్లాడుతూ రాత్రికి రాత్రే అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. ఏవైనా సమస్యలుంటే మంత్రుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలంటూ అందరినీ సమాధాన పరిచారు. 1.83 లక్షల కేసీఆర్ కిట్ల పంపిణీ రాష్ట్రంలో స్వల్పకాలంలోనే 1.83 లక్షల కేసీఆర్ కిట్లను పంపిణీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. గురువారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభమయ్యాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 55 శాతం ప్రసవాలు పెరిగాయని, మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. -
వైద్య శాఖలో 13,496 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: వైద్యశాఖ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 13,496 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వైద్యా రోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వీటిలో 5,766 నర్సుల పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీపై బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. నర్సుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ‘దక్షత’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తండ్రికి ఆపరేషన్ జరుగుతున్నా సభకొచ్చా: శ్రీనివాస్‌గౌడ్ తన తండ్రికి ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరుగుతోందని, అయినా గీత కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు సభకు వచ్చానని, తనకు అదనపు సమయం కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ స్పీకర్ మధుసూదనాచారికి విన్నవించారు. రాష్ట్రంలో గీత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉందని.. తాటి, ఈత చెట్లపై దళారీల పెత్తనం పెరుగుతోందన్నారు. బార్లు, రెస్టారెంట్ల లైసెన్సుల్లో గీత కార్మిక యువతకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి పద్మారావు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.69 కోట్లకు పైగా ఈత చెట్లు నాటామని, వాటిని సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కల్లును ఔషధంగానే చూస్తున్నామని, దాని వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయనే భావన ఉందన్నారు. ప్రమాదవశాత్తూ మరణించే గీత కార్మికులకు రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. -
'వైద్య శాఖలో 13,496 పోస్టుల భర్తీ'
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీపై గురువారం ఉదయం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని మంత్రి చెప్పారు. వైద్య విభాగంలో 13,496 పోస్టులు భర్తీ చేయబోతున్నామని మంత్రి తెలియజేశారు. నర్సుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు దక్షత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలన్నీ త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
ప్రభుత్వ వైద్యుల సమ్మె నోటీసు
⇒ ఏప్రిల్ 10 నుంచి విడతల వారీ సమ్మె ⇒ జూన్ 2 నుంచి అన్ని వైద్య సేవల బహిష్కరణ ⇒ వేతనాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన తదితర డిమాండ్లు సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ వైద్యులు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ 28 డిమాండ్లను 18 రోజుల్లోగా పరిష్కరించకుంటే వచ్చే నెల 10 నుంచి విడతల వారీ సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.రమేష్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్, సెక్రటరీ జనరల్ డాక్టర్ బి.రమేష్, కోశాధికారి డాక్టర్ పి.లాలూప్రసాద్ తదితరులు గురువారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేశారు. మరో ప్రతిని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి పంపించారు. డిమాండ్లు పరిష్కరించకుంటే... వచ్చే నెల 10 నుంచి 30 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, మే ఒకటి నుంచి 15 వరకు రోజుకో గంట నిరసన కార్యక్రమం చేపడతామని అందులో పేర్కొన్నారు. అదే నెల 16 నుంచి జూన్ ఒకటి వరకు ఓపీ సేవలను, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి అన్ని రకాల వైద్య సేవలను బహిష్కరిస్తారు. సమస్యలు పరిష్కరించకుంటే... రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు జిల్లా ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ సహా అన్ని బోధన, బోధనేతర ఆసుపత్రులన్నింటిలోనూ సమ్మె ఉంటుందని సంఘం కోశాధికారి డాక్టర్ లాలూప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల మందికి పైగా వైద్యులు సమ్మెలో పాల్గొంటారన్నారు. ప్రభుత్వ వైద్యుల ప్రధాన డిమాండ్లివే... – డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనర్ పోస్టులను సీనియారిటీ ప్రకారం వైద్యులతో భర్తీ చేయాలి. – గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు, జిల్లా తదితర ఆసుపత్రులకు డైరెక్టర్లను నియమించాలన్న ఆలోచనను విరమించుకోవాలి. – వర్సిటీ అధ్యాపకుల మాదిరిగా యూజీసీ స్కేళ్లు, అలవెన్సులు ఇవ్వాలి. – అన్ని రకాల పదోన్నతులు, బదిలీలను కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే నిర్వహించాలి. – మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ, రిమ్స్ వంటి పాక్షిక స్వయంప్రతిపత్తి వాటిని సాధారణ మెడికల్ కాలేజీలుగా మార్పు చేయాలి. – తెలంగాణకు కేటాయించిన 171 మంది ఆంధ్రా డాక్టర్లను వెనక్కు పంపించాలి – తప్పుడు ధ్రువీకరణపత్రాలు ఇచ్చిన డాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి – ఆరోగ్య సంచాలకుల పరిధిలోని వారందిరికీ పేస్కేల్ పెంచాలి. 24 రకాల అలవెన్సులు అందజేయాలి. – పదో పీఆర్సీని అమలచేయాలి. పెండింగ్ ఎరియర్స్ ఇవ్వాలి. – వైద్య ఆరోగ్యశాఖపై కిందిస్థాయిలో తహసిల్దార్, ఎంపీడీవో, సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి వారి పర్యవేక్షణను రద్దు చేయాలి. ఈఎస్ఐ సిబ్బందిని విభజించి అందులోని వైద్యులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. -
ఆయకట్టుకు సాగునీరు అందించాలి
కోడేరు : సెప్టెంబర్ మొదటి వారంకల్లా ఆయకట్టుకు సాగునీరు అందించాలని కేఎల్ఐ ప్రాజెక్టు ఈఈ రాంచంద్రయ్యకు మంత్రి జూపల్లి కష్ణారావు సూచించారు. ఆదివారం కోడేరు మండలంలోని జొన్నలబొగుడ రెండో ఎత్తిపోతలను సందర్శించారు. ఇందులోభాగంగా పస్పుల, బావాయిపల్లి, కొండ్రావుపల్లి శివారులోని పెద్దకాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీటికి ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయాలని, కంపచెట్లను తొలగించాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో రైతులకు సాగునీరు అందించే విషయంలో అందరూ సహకరించాలన్నారు. దీనిపై రాజకీయం చేస్తున్న కొందరు నాయకులు తమ పద్ధతిని మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కోడేరు, పెద్దకొత్తపల్లి ఎంపీపీలు రాంమోహన్‌రావు, వెంకటేశ్వర్రావు, జెడ్పీటీసీ సభ్యుడు బస్తీరాంనాయక్, పస్పుల డాక్టర్ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
హరితహారంలో భాగస్వాములు కావాలి
మిడ్జిల్ : గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం మండలంలోని మాధారం ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. చెట్లు ఉంటేనే మనం క్షేమంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దీప, వైస్ ఎంపీపీ సుదర్శన్, సర్పంచ్ నారాయణరెడ్డి, ఎంపీటీసీ యాదయ్య, నాయకులు గిరినాయక్, గోపాల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, భాస్కర్, శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, గోపాల్, కాడయ్య తదితరులు పాల్గొన్నారు. -
హాస్పిటల్స్ కు కలర్ కోడ్
- అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఒకే రకమైన రంగులు - కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా సర్కార్ దవాఖానలు - బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, అధికారులతో సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. అందుకు తగ్గ నిధులను బడ్జెట్లో కేటాయించామని తెలిపారు. బుధవారం ఆయన వివిధ విభాగాల అధిపతులు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇక ముందు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఒకే రంగులో కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. బడ్జెట్లో గణనీయంగా కేటాయింపులు ఇచ్చామని... వాటితో బోధనాసుపత్రులను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రుల్లో పరిశుభ్రత పాటించాలని మంత్రి ఆదేశించారు. రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షల కోసం సరిపడా నిధులు ఇచ్చామన్నారు. అన్ని రకాల పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయడానికి కావాల్సిన పరికరాలు, పనిముట్ల జాబితాను ఆసుపత్రుల వారీగా సిద్ధం చేసి త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. సర్జికల్స్, డిస్పోజబుల్స్ తదితర వాటి జాబితాను కూడా సిద్ధం చేయాలన్నారు. ఆసుపత్రులకు చేపట్టాల్సిన మరమ్మతులు, కొత్త నిర్మాణాలు, రోగులకు వారి సహాయకులకు కావాల్సిన సదుపాయాలను గుర్తించి వెంటనే వాటిని పూర్తి చేయాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచే సీఎం లక్ష్యాల మేరకు పనులు మొదలు కావాలని కోరారు. నాణ్యమైన వైద్యాన్ని రోగులకు అందించాలన్నారు. పాత మంచాలను, పరుపులను వెంటనే మార్చాలని... వాటి స్థానంలో కొత్త వాటిని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ జయలత తదితరులు పాల్గొన్నారు. -
వైద్య ఆరోగ్య ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు
- సమస్యలు పరిష్కరించాలని మంత్రి లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేత సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ ఉద్యోగ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని జేఏసీ ఛైర్మన్ బి.వెంకటేశ్వర్‌రెడ్డి, కన్వీనర్ ఎన్.నారాయణరెడ్డి, ముఖ్య సలహాదారు జూపల్లి రాజేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జేఏసీ ఏర్పడిన విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చామని.. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశామని ముఖ్య సలహాదారు జూపల్లి రాజేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య ఉద్యోగులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ఈ జేఏసీతోనే సంప్రదించాలని మంత్రిని కోరారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ట్రెజరీల ద్వారా వేతనాలు అందజేయాలని కోరారు. -
ఉద్యోగులకు ఉచిత వైద్యం
- నిమ్స్‌లో తక్షణమే అమల్లోకి: మంత్రి లక్ష్మారెడ్డి - నెలలోగా బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లోనూ అమలు - ప్రత్యేకంగా ఔట్‌పేషెంట్ సేవలు అందిస్తామని వెల్లడి - కార్పొరేట్ వైద్య ప్యాకేజీల పెంపుపై నేడు ప్రత్యేక సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని నిమ్స్ సహా అన్ని ప్రభుత్వ, బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య పరీక్షలు, సేవలు ఉచితంగా అందనున్నాయి. అంతేకాదు జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఔట్‌పేషెంట్ సేవలను అందించనున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఇది తక్షణమే అమల్లోకి వస్తుండగా.. మిగతా చోట్ల నెల రోజుల్లోగా దశలవారీగా అమలు చేయనున్నారు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల అధిపతులతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఉద్యోగుల కోసం ప్రతీరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ప్రత్యేక ఔట్‌పేషెంట్ సేవలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. నిమ్స్‌లో సాధారణ రోగులు వచ్చే ఉదయం 8 నుంచి ఒంటి గంట మధ్యే ఉద్యోగులకు కూడా సేవలు అందిస్తామని, మున్ముందు పరిస్థితులను బట్టి ప్రత్యేకంగా సాయంత్రం వేళల్లో ఓపీ సేవలను అందించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించగలిగే స్థాయిలో నిమ్స్‌లో మౌలిక, ల్యాబొరేటరీ సదుపాయాలు లేనందున వైద్య పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వైద్య పరీక్షల పరికరాల కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఇప్పుడు నిమ్స్ సహా పేరున్న ఆసుపత్రులు ‘వైద్య పరీక్షకు ఖరీదు’ పద్దతిని అమలుచేస్తున్నాయి. ఈ పద్దతిలో సంస్థ వద్ద పరికరాన్ని కొనుగోలు చేయరు. సంస్థే ఉచితంగా పరికరాన్ని సమకూర్చుతుంది. కేవలం రసాయనాలనే కొంటారు. నిమ్స్ ఉద్యోగులే పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ పరికరంలో రోజుకు ఎన్ని పరీక్షలు నిర్వహించారనే అంశాన్ని లెక్కగట్టి ఒప్పందం ప్రకారం సొమ్ము చెల్లిస్తారు. పరికరం బాధ్యత ఆ సంస్థే చూసుకుంటుంది. ఇదే విధానాన్ని ఇక ముందు ఉద్యోగుల నగదు రహిత చికిత్సకూ ఉపయోగిస్తారు. ఆ ఖర్చును ప్రభుత్వం నిమ్స్‌కు చెల్లిస్తుంది. కాగా జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుపైనా అధికారులతో భేటీలో చర్చ జరిగింది. అయితే దీని అమలు ఎలా ఉండాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రులను సాయంత్రం వేళ తెరిచి ఉంచడం, 24 గంటలూ వైద్య పరీక్షలు నిర్వహించడం వంటి అంశాల సాధ్యాసాధ్యాలపైనా చర్చించారు. 25 శాతం ప్యాకేజీపై నేడు నిర్ణయం ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యంపై సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. కార్పొరేట్ ఆసుపత్రుల డిమాండ్లను పరిష్కరించడంలో సాధ్యాసాధ్యాలపై శనివారం మంత్రి లక్ష్మారెడ్డి సంబంధిత యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. ఉద్యోగులు, ఫించన్‌దారుల ఆరోగ్య కార్డుల అమలుపై తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీషా) నివేదించిన కోర్కెట్లో ఒక్కటి మినహా అన్నింటినీ తిరస్కరిస్తూ ఆరోగ్యశ్రీ ఆరోగ్య సంరక్షణ ట్రస్టు (ఏహెచ్‌సీటీ) నివేదించింది. దీనిపై మంత్రి టీషా ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. కార్పొరేట్ ఆసుపత్రులు కోరినట్లుగా అన్ని ఔషధ, శస్త్రచికిత్సల ప్యాకేజీలపై 25 శాతం ధరను పెంచడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఓపీలో వైద్యుని సంప్రదింపులకు రుసుము చెల్లించాలని కార్పొరేట్ ఆసుపత్రులు కోరగా... ఇప్పటికే అమల్లో ఉన్న ప్యాకేజీల్లో స్పెషలిస్టు వైద్యునికి రూ.200, సూపర్ స్పెషలిస్టు వైద్యునికి రూ. 300 చొప్పున పొందుపర్చామని ఆరోగ్యశ్రీ ట్రస్టు స్పష్టంచేసింది. ఔషధ చికిత్సలకు ఎంత ఖర్చయితే అంత చెల్లించాలనే కార్పొరేట్ ఆసుపత్రుల కోర్కెను నెరవేర్చడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఔషధాలపై గరిష్ట చిల్లర ధర చెల్లించాలనే కార్పొరేట్ ఆసుపత్రుల కోర్కెనూ ఆరోగ్యశ్రీ ట్రస్టు తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లనే అమలుచేస్తున్నామని చెప్పింది. అన్నింటికీ కలిపి మొత్తం ప్యాకేజీలపై ప్రస్తుత ధర కంటే 25 శాతం అదనంగా చెల్లించడానికి ఏహెచ్‌సీటీ సానుకూలత వ్యక్తంచేసింది. ఏమైనా మంత్రితో జరిగే సమావేశంలో ఈ మేరక నిర్ణయాలు చేసే అవకాశాలున్నాయి. -
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం
మిషన్ ఇంద్రధనుష్ ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి దండేపల్లి: కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఇందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. మాతాశిశు మరణాలను అరికట్టేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం తానిమడుగులో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి సి. లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు వ్యాక్సిన్ వేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో ఆస్పత్రుల స్థాయిని పెంచి.. సరిపడా సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.