కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం
- మిషన్ ఇంద్రధనుష్ ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
దండేపల్లి: కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఇందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. మాతాశిశు మరణాలను అరికట్టేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం తానిమడుగులో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి సి. లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు వ్యాక్సిన్ వేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో ఆస్పత్రుల స్థాయిని పెంచి.. సరిపడా సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.