ఉద్యోగులకు ఉచిత వైద్యం | free medicare for government employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ఉచిత వైద్యం

Published Sat, Jun 27 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

ఉద్యోగులకు ఉచిత వైద్యం

ఉద్యోగులకు ఉచిత వైద్యం

- నిమ్స్‌లో తక్షణమే అమల్లోకి: మంత్రి లక్ష్మారెడ్డి
- నెలలోగా బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లోనూ అమలు
- ప్రత్యేకంగా ఔట్‌పేషెంట్ సేవలు అందిస్తామని వెల్లడి
- కార్పొరేట్ వైద్య ప్యాకేజీల పెంపుపై నేడు ప్రత్యేక సమావేశం
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర రాజధానిలోని నిమ్స్ సహా అన్ని ప్రభుత్వ, బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య పరీక్షలు, సేవలు ఉచితంగా అందనున్నాయి. అంతేకాదు జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఔట్‌పేషెంట్ సేవలను అందించనున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఇది తక్షణమే అమల్లోకి వస్తుండగా.. మిగతా చోట్ల నెల రోజుల్లోగా దశలవారీగా అమలు చేయనున్నారు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల అధిపతులతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఉద్యోగుల కోసం ప్రతీరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ప్రత్యేక ఔట్‌పేషెంట్ సేవలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. నిమ్స్‌లో సాధారణ రోగులు వచ్చే ఉదయం 8 నుంచి ఒంటి గంట మధ్యే ఉద్యోగులకు కూడా సేవలు అందిస్తామని, మున్ముందు పరిస్థితులను బట్టి ప్రత్యేకంగా సాయంత్రం వేళల్లో ఓపీ సేవలను అందించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించగలిగే స్థాయిలో నిమ్స్‌లో మౌలిక, ల్యాబొరేటరీ సదుపాయాలు లేనందున వైద్య పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వైద్య పరీక్షల పరికరాల కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు.

ఇప్పుడు నిమ్స్ సహా పేరున్న ఆసుపత్రులు ‘వైద్య పరీక్షకు ఖరీదు’ పద్దతిని అమలుచేస్తున్నాయి. ఈ పద్దతిలో సంస్థ వద్ద పరికరాన్ని కొనుగోలు చేయరు. సంస్థే ఉచితంగా పరికరాన్ని సమకూర్చుతుంది. కేవలం రసాయనాలనే కొంటారు. నిమ్స్ ఉద్యోగులే పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ పరికరంలో రోజుకు ఎన్ని పరీక్షలు నిర్వహించారనే అంశాన్ని లెక్కగట్టి ఒప్పందం ప్రకారం సొమ్ము చెల్లిస్తారు. పరికరం బాధ్యత ఆ సంస్థే చూసుకుంటుంది. ఇదే విధానాన్ని ఇక ముందు ఉద్యోగుల నగదు రహిత చికిత్సకూ ఉపయోగిస్తారు. ఆ ఖర్చును ప్రభుత్వం నిమ్స్‌కు చెల్లిస్తుంది.

కాగా జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుపైనా అధికారులతో భేటీలో చర్చ జరిగింది. అయితే దీని అమలు ఎలా ఉండాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రులను సాయంత్రం వేళ తెరిచి ఉంచడం, 24 గంటలూ వైద్య పరీక్షలు నిర్వహించడం వంటి అంశాల సాధ్యాసాధ్యాలపైనా చర్చించారు.

25 శాతం ప్యాకేజీపై నేడు నిర్ణయం
ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యంపై సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. కార్పొరేట్ ఆసుపత్రుల డిమాండ్లను పరిష్కరించడంలో సాధ్యాసాధ్యాలపై శనివారం మంత్రి లక్ష్మారెడ్డి సంబంధిత యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. ఉద్యోగులు, ఫించన్‌దారుల ఆరోగ్య కార్డుల అమలుపై తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీషా) నివేదించిన కోర్కెట్లో ఒక్కటి మినహా అన్నింటినీ తిరస్కరిస్తూ ఆరోగ్యశ్రీ ఆరోగ్య సంరక్షణ ట్రస్టు (ఏహెచ్‌సీటీ) నివేదించింది. దీనిపై మంత్రి టీషా ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. కార్పొరేట్ ఆసుపత్రులు కోరినట్లుగా అన్ని ఔషధ, శస్త్రచికిత్సల ప్యాకేజీలపై 25 శాతం ధరను పెంచడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.

ఓపీలో వైద్యుని సంప్రదింపులకు రుసుము చెల్లించాలని కార్పొరేట్ ఆసుపత్రులు కోరగా... ఇప్పటికే అమల్లో ఉన్న ప్యాకేజీల్లో స్పెషలిస్టు వైద్యునికి రూ.200, సూపర్ స్పెషలిస్టు వైద్యునికి రూ. 300 చొప్పున పొందుపర్చామని ఆరోగ్యశ్రీ ట్రస్టు స్పష్టంచేసింది. ఔషధ చికిత్సలకు ఎంత ఖర్చయితే అంత చెల్లించాలనే కార్పొరేట్ ఆసుపత్రుల కోర్కెను నెరవేర్చడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఔషధాలపై గరిష్ట చిల్లర ధర చెల్లించాలనే కార్పొరేట్ ఆసుపత్రుల కోర్కెనూ ఆరోగ్యశ్రీ ట్రస్టు తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లనే అమలుచేస్తున్నామని చెప్పింది. అన్నింటికీ కలిపి మొత్తం ప్యాకేజీలపై ప్రస్తుత ధర కంటే 25 శాతం అదనంగా చెల్లించడానికి ఏహెచ్‌సీటీ సానుకూలత వ్యక్తంచేసింది. ఏమైనా మంత్రితో జరిగే సమావేశంలో ఈ మేరక నిర్ణయాలు చేసే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement