free medicare
-
ఉచిత వైద్య సేవలకు విఘాతం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోని ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెతో ఉచిత వైద్య సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. సోమవారం ఆయా నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలన్నీ నిలిచిపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యాన్ని పొందవచ్చని భావించి ఆశతో ఆస్పత్రులకు చేరుకున్న రోగులకు.. రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద ఆరోగ్య మిత్రలు కన్పించకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందిస్తున్న ఆస్పత్రుల్లో కీలకమైన నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి సహా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, యశోద, కిమ్స్, సన్‌షైన్, కేర్, అపోలో ఆస్పత్రుల్లో సేవలు స్తంభించాయి. ట్రస్ట్ ముట్టడికి యత్నం.. ఆరోగ్యశ్రీ పథకంలో ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, సిబ్బందిని ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని, మహిళలకు ప్రసూతి సెలవులతో పాటు గౌరవ వేతనం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీ ఆరోగ్య మిత్ర, నెట్వర్క్ ఆస్పత్రి మిత్ర, టీమ్ లీడర్స్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్, డేటా ఎంట్రి ఆపరేటర్లంతా శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్న సిబ్బంది మూడో రోజైన సోమవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని సుమారు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య సేవలకు విఘాతం:ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో 350కిపైగా ఆస్పత్రు లు ఉండగా.. వీటిలో సుమారు 1,500 మంది పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున ఐదు నుంచి ఆరు వేల మంది ఔట్‌పేషెంట్ విభాగాల్లో సేవలు పొందుతుండగా, 300 నుంచి 500 మంది ఇన్పేషెంట్లుగా చేరుతుంటారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ట్రస్టుకు పంపాల్సిన ఆరోగ్య మిత్రలు ఆస్పత్రుల్లో లేకపోవ డంతో ఉచిత సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయంగా నియమించిన వారికి అవగాహన లేకపోవడంతో సాంకేతిక లోపాల వల్ల సర్జరీలకు అనుమతులు లభించడంలేదు. -
ఉద్యోగులకు ఉచిత వైద్యం
- నిమ్స్‌లో తక్షణమే అమల్లోకి: మంత్రి లక్ష్మారెడ్డి - నెలలోగా బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లోనూ అమలు - ప్రత్యేకంగా ఔట్‌పేషెంట్ సేవలు అందిస్తామని వెల్లడి - కార్పొరేట్ వైద్య ప్యాకేజీల పెంపుపై నేడు ప్రత్యేక సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని నిమ్స్ సహా అన్ని ప్రభుత్వ, బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య పరీక్షలు, సేవలు ఉచితంగా అందనున్నాయి. అంతేకాదు జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఔట్‌పేషెంట్ సేవలను అందించనున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఇది తక్షణమే అమల్లోకి వస్తుండగా.. మిగతా చోట్ల నెల రోజుల్లోగా దశలవారీగా అమలు చేయనున్నారు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల అధిపతులతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఉద్యోగుల కోసం ప్రతీరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ప్రత్యేక ఔట్‌పేషెంట్ సేవలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. నిమ్స్‌లో సాధారణ రోగులు వచ్చే ఉదయం 8 నుంచి ఒంటి గంట మధ్యే ఉద్యోగులకు కూడా సేవలు అందిస్తామని, మున్ముందు పరిస్థితులను బట్టి ప్రత్యేకంగా సాయంత్రం వేళల్లో ఓపీ సేవలను అందించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించగలిగే స్థాయిలో నిమ్స్‌లో మౌలిక, ల్యాబొరేటరీ సదుపాయాలు లేనందున వైద్య పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వైద్య పరీక్షల పరికరాల కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఇప్పుడు నిమ్స్ సహా పేరున్న ఆసుపత్రులు ‘వైద్య పరీక్షకు ఖరీదు’ పద్దతిని అమలుచేస్తున్నాయి. ఈ పద్దతిలో సంస్థ వద్ద పరికరాన్ని కొనుగోలు చేయరు. సంస్థే ఉచితంగా పరికరాన్ని సమకూర్చుతుంది. కేవలం రసాయనాలనే కొంటారు. నిమ్స్ ఉద్యోగులే పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ పరికరంలో రోజుకు ఎన్ని పరీక్షలు నిర్వహించారనే అంశాన్ని లెక్కగట్టి ఒప్పందం ప్రకారం సొమ్ము చెల్లిస్తారు. పరికరం బాధ్యత ఆ సంస్థే చూసుకుంటుంది. ఇదే విధానాన్ని ఇక ముందు ఉద్యోగుల నగదు రహిత చికిత్సకూ ఉపయోగిస్తారు. ఆ ఖర్చును ప్రభుత్వం నిమ్స్‌కు చెల్లిస్తుంది. కాగా జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుపైనా అధికారులతో భేటీలో చర్చ జరిగింది. అయితే దీని అమలు ఎలా ఉండాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రులను సాయంత్రం వేళ తెరిచి ఉంచడం, 24 గంటలూ వైద్య పరీక్షలు నిర్వహించడం వంటి అంశాల సాధ్యాసాధ్యాలపైనా చర్చించారు. 25 శాతం ప్యాకేజీపై నేడు నిర్ణయం ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యంపై సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. కార్పొరేట్ ఆసుపత్రుల డిమాండ్లను పరిష్కరించడంలో సాధ్యాసాధ్యాలపై శనివారం మంత్రి లక్ష్మారెడ్డి సంబంధిత యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. ఉద్యోగులు, ఫించన్‌దారుల ఆరోగ్య కార్డుల అమలుపై తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీషా) నివేదించిన కోర్కెట్లో ఒక్కటి మినహా అన్నింటినీ తిరస్కరిస్తూ ఆరోగ్యశ్రీ ఆరోగ్య సంరక్షణ ట్రస్టు (ఏహెచ్‌సీటీ) నివేదించింది. దీనిపై మంత్రి టీషా ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. కార్పొరేట్ ఆసుపత్రులు కోరినట్లుగా అన్ని ఔషధ, శస్త్రచికిత్సల ప్యాకేజీలపై 25 శాతం ధరను పెంచడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఓపీలో వైద్యుని సంప్రదింపులకు రుసుము చెల్లించాలని కార్పొరేట్ ఆసుపత్రులు కోరగా... ఇప్పటికే అమల్లో ఉన్న ప్యాకేజీల్లో స్పెషలిస్టు వైద్యునికి రూ.200, సూపర్ స్పెషలిస్టు వైద్యునికి రూ. 300 చొప్పున పొందుపర్చామని ఆరోగ్యశ్రీ ట్రస్టు స్పష్టంచేసింది. ఔషధ చికిత్సలకు ఎంత ఖర్చయితే అంత చెల్లించాలనే కార్పొరేట్ ఆసుపత్రుల కోర్కెను నెరవేర్చడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఔషధాలపై గరిష్ట చిల్లర ధర చెల్లించాలనే కార్పొరేట్ ఆసుపత్రుల కోర్కెనూ ఆరోగ్యశ్రీ ట్రస్టు తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లనే అమలుచేస్తున్నామని చెప్పింది. అన్నింటికీ కలిపి మొత్తం ప్యాకేజీలపై ప్రస్తుత ధర కంటే 25 శాతం అదనంగా చెల్లించడానికి ఏహెచ్‌సీటీ సానుకూలత వ్యక్తంచేసింది. ఏమైనా మంత్రితో జరిగే సమావేశంలో ఈ మేరక నిర్ణయాలు చేసే అవకాశాలున్నాయి.