ఉచిత వైద్య సేవలకు విఘాతం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలోని ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మెతో ఉచిత వైద్య సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. సోమవారం ఆయా నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలన్నీ నిలిచిపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యాన్ని పొందవచ్చని భావించి ఆశతో ఆస్పత్రులకు చేరుకున్న రోగులకు.. రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద ఆరోగ్య మిత్రలు కన్పించకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందిస్తున్న ఆస్పత్రుల్లో కీలకమైన నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి సహా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, యశోద, కిమ్స్, సన్‌షైన్, కేర్, అపోలో ఆస్పత్రుల్లో సేవలు స్తంభించాయి.
ట్రస్ట్ ముట్టడికి యత్నం..
ఆరోగ్యశ్రీ పథకంలో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, సిబ్బందిని ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని, మహిళలకు ప్రసూతి సెలవులతో పాటు గౌరవ వేతనం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీ ఆరోగ్య మిత్ర, నెట్‌వర్క్ ఆస్పత్రి మిత్ర, టీమ్ లీడర్స్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్, డేటా ఎంట్రి ఆపరేటర్లంతా శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్న సిబ్బంది మూడో రోజైన సోమవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని సుమారు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వైద్య సేవలకు విఘాతం:ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో 350కిపైగా ఆస్పత్రు లు ఉండగా.. వీటిలో సుమారు 1,500 మంది పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున ఐదు నుంచి ఆరు వేల మంది ఔట్‌పేషెంట్ విభాగాల్లో సేవలు పొందుతుండగా, 300 నుంచి 500 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతుంటారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ట్రస్టుకు పంపాల్సిన ఆరోగ్య మిత్రలు ఆస్పత్రుల్లో లేకపోవ డంతో ఉచిత సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయంగా నియమించిన వారికి అవగాహన లేకపోవడంతో సాంకేతిక లోపాల వల్ల సర్జరీలకు అనుమతులు లభించడంలేదు.