ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ డాక్టర్లకు మధ్య వివాదం ముదిరింది. ఏకంగా 650 మంది ప్రభుత్వ డాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డీఎంఈలో 240, ఏపీవీవీపీలో 190, డీఎంహెచ్ లో 210 మందికి నోటీసులు పంపారు. విజిలెన్స్ నివేధిక ఆధారంగా సక్రమంగా విధులకు హాజరు కాని వారికే నోటీసులు జారీ చేశామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి.. ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారంటూ డాక్టర్లపై ఆరోపణలు వచ్చాయని వివరణ ఇచ్చారు.
కాగా.. డాక్టర్లు ప్రభుత్వం తీరుపై మండి పడ్డారు. మంగళవారం నాడు వైద్య శాఖ ఉన్నతాధికారితో భేటీ అయ్యారు. వివరణ కోరకుండానే నోటీసులు ఎలా జారీ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. వైద్య వ్యవహారాల్లో కలెక్టర్ల జోక్యం ఎక్కువైందంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. వైద్య శాఖ ఉన్నతాధికారి అనుచిత పదజాలంతో డాక్టర్లను దూషించాడని ఆరోపించారు.