మంత్రి కామినేని వ్యాఖ్యలపై విస్మయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైద్యారోగ్య శాఖ మంత్రి చేసిన ప్రకటనపై ప్రభుత్వ వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాలు, వైద్యుల కొరతపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ... ఆరోగ్యశ్రీ రావడంవల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్లక్ష్యానికి గురయ్యాయనీ, పెద్దాసుపత్రులకు నిధులు తగ్గాయని చెప్పారు. దీనిపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ 65 శాతం నిధులు ఆస్పత్రులకే వచ్చాయని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీకి కేటాయించిన నిధుల్లో 20 శాతం రివాల్వింగ్ ఫండ్ కింద, 45 శాతం ఆస్పత్రి అభివృద్ధి సొసైటీలు (హెచ్‌డీఎస్) కింద వెళ్లాయని చెప్పారు. ఆరోగ్యశాఖమంత్రి సమాధానంపై వైద్య ఆరోగ్య రంగ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించే బడ్జెట్‌కు అతీతమని, ఏ శాఖకు సంబంధించిన బడ్జెట్‌లోనూ కోత పెట్టి ఆరోగ్యశ్రీకి ఇవ్వలేదని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.
పీహెచ్‌సీల నుంచి డీఎంఈ ఆస్పత్రుల వరకూ టీడీపీ హయాంలో పూర్తిగా సర్వనాశనమై ఉన్న దశలో, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌కు అప్పటివరకూ ఇచ్చిన నిధులకంటే 20 శాతం ప్రతి ఏటా పెంచుతూ వచ్చారని గుర్తుచేశారు. ఇది బడ్జెట్‌లో ఒక చరిత్ర అని ఆరోగ్యరంగ నిపుణులే చెబుతున్నారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ పథకం వచ్చాక వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు పెరిగాయి. ఎక్స్‌రే మెషీన్లు, అనెస్థీషియా వర్క్ స్టేషన్లు, ఆపరేషన్ థియేటర్‌కు సంబంధించిన పరికరాలు తదితర వాటిని గత రెండున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ నిధులతో సుమారు రూ.70కోట్లు ఖర్చు చేసి కొన్నారు. మరో రూ.40 కోట్లతో నాలుగు ఎంఆర్‌ఐ మెషీన్లు కొంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్లక్ష్యానికీ సంబంధమే లేదు. పైగా రాజశేఖరరెడ్డి సీఎం కాగానే 200 ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయిని పెంచి పీహెచ్‌సీలుగా మార్చారు. ఏనాడూ ఆయన వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌లో గ్రామీణ వైద్యానికి 40 శాతం నిధులు తగ్గకుండా చూశారు. 2006లో 3,500 మంది సిబ్బందిని నియమించారు. అందులో వైద్యులే 1,100 మంది వరకూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ కారణంగా నాలుగు లక్షల మంది క్యాన్సర్ రోగులు వైద్యం పొందారు. గుండెజబ్బుల వాళ్లు లక్షల్లో ఉన్నారని అధికారవర్గాలు చెప్పాయి. ఇలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని విమర్శించడం తగదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆరోగ్యశ్రీతో ఆస్పత్రుల అభివృద్ధి జరిగింది: వైద్యనిపుణులు
Published Wed, Aug 20 2014 3:00 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement