సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో లక్ష్మారెడ్డి, పీవీ కృష్ణారెడ్డి, పీపీరెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వ వైద్యులు రోగులకు మెరుగైన సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంచారని మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలంటే రోగులు జంకేవారని, ఇప్పడు ఏ చిన్న వ్యాధి వచ్చినా ప్రభుత్వాస్పత్రికే వస్తున్నారని, అందుకు నిదర్శనం నిమ్స్ ఆస్పత్రేనన్నారు. మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) సంస్థ రూ.10 కోట్ల వ్యయంతో నిమ్స్‌లో నిర్మించిన కేన్సర్ భవనాన్ని మంత్రి లక్ష్మారెడ్డితో కలసి గురువారం ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో మెఘా సంస్థ 50 పడకల కేన్సర్ విభాగాన్ని అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. దాతలు ముందుకు వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య రక్షణకు హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజేషన్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
సమాజానికి సేవ చేయాలని..: పీపీ రెడ్డి
సొసైటీ తమకు ఈ హోదాను ఇచ్చిందని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తాము సాధ్యమైనంత సహాయం చేస్తున్నామని మెఘా ఇంజనీరింగ్ చైర్మన్ పీపీ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీడీ భవన నిర్మాణం చేపట్టామని, నిమ్స్‌లో మరో పాత భవనాన్ని ఆధునీకరించనున్నామని ప్రకటించారు. మూడేళ్లపాటు తామే నిర్వహణ బాధ్యతలు తీసుకుంటామన్నారు. అనంతరం మహిళావార్డులను మెఘా ఇంజనీరింగ్ ఎండీ కుమారులు పీవీ ప్రణవ్‌రెడ్డి, మానస్ రెడ్డి ప్రారంభించగా, చిన్నపిల్లల వార్డును డైరెక్టర్ మనోహర్ ప్రారంభించారు. కార్యక్రమంలో నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కేన్సర్ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ సదాశివుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment