నిరంతరం సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్న భద్రాద్రి జిల్లాను ప్రభుత్వ వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
డాక్టర్లు కావలెను..
Published Wed, Oct 19 2016 2:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
ఏజెన్సీలో వైద్య సేవలు అంతంతే..
జిల్లాలో 21 పోస్టులు ఖాళీ
విజృంభిస్తున్న విషజ్వరాలు
భద్రాద్రి నుంచి తరలిపోయిన మలేరియా అధికారి పోస్టు
సాక్షి, కొత్తగూడెం : నిరంతరం సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్న భద్రాద్రి జిల్లాను ప్రభుత్వ వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పూర్తి గిరిజన జిల్లాగా ఉన్న భద్రాద్రిలోని పలు ప్రాంతాల్లో డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతున్న పరిస్థితుల్లో నిరంతరం వైద్య సేవలు అందించేందుకు అదనపు బృందాలను నియమించాలి. కానీ ఇక్కడ మంజూరైన పోస్టుల్లోనే అనేకం ఖాళీగా ఉన్న దుస్థితి నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఉప ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆయా ప్రాంతాలకు వైద్యాధికారుల పోస్టులను మంజూరు చేసింది. అయితే జిల్లాలో వైద్యాధికారులుగా నియమితులైన వారిలో 27 మంది ఉన్నత విద్యనభ్యసించడానికి మూడు సంవత్సరాలు ఇన్ సర్వీస్ విద్యార్థులుగా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లడంతో వైద్యసేవలు కుంటుపడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం 28 మంది డాక్టర్లకు ఇన్ సర్వీస్‌లో పీజీ వైద్య విద్య అభ్యసించడానికి అవకాశం రాగా, అందులో 27 మంది భద్రాద్రి జిల్లాలో నియమితులైన వారే కావడం గమనార్హం. ఒకరు మాత్రమే ఖమ్మం జిల్లాలో నియమితులైన వారున్నారు. దీంతో జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నా, సీజనల్ వ్యాధులతో మన్యం మంచం పట్టినా, కనీస వైద్యసేవలు అందించడానికి డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది.
నాలుగు పీహెచ్‌సీల్లో డాక్టర్లే లేరు..
గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలకు అనుగుణంగా ఒక్కో ప్రాంతంలో రెండు వైద్యాధికారుల పోస్టులు మంజూరైనా అందులో ఒక వైద్యాధికారితోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ప్రాంతంలో ఇద్దరు వైద్యాధికారులు ఉంటే.. అసలు వైద్యాధికారులు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డిప్యుటేషన్ ప్రాతిపదికన నియమించారు. ఇన్ని చేసినా.. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న ఈ తరుణంలో జిల్లాలోని పూర్తి గిరిజన ప్రాంతాలైన జానంపేట, కరకగూడెం, ములకలపల్లి మండలం మంగపేట, చండ్రుగొండ మండలం ఎర్రగుంట పీహెచ్‌సీలకు డాక్టర్లు లేని దుస్థితి నెలకొంది. వీటితోపాటు మరికొందరు వైద్యాధికారులు తమ సొంత ప్రాంతమైన ఆంధ్రాకు బదిలీపై వెళ్లాల్సి ఉండటంతో మరికొన్ని పోస్టులు ఖాళీ కానున్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు వైద్యాధికారులను ప్రభుత్వం ఇప్పటికే బదిలీ చేసింది. తెలంగాణలో మలేరియా వ్యాధికి చిరునామాగా ఉన్న భద్రాద్రి జిల్లాలో ఈ సంవత్సరం మలేరియా కేసులు తక్కువగా నమోదయ్యాయనే కారణంతో సంవత్సరాల తరబడి భద్రాచలం కేంద్రంగా ఉన్న జిల్లా మలేరియా అధికారి పోస్టును ఈ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు బదలాయించారు. దీంతో జిల్లాలో మలేరియా నివారణ చర్యలు కుంటుపడే ప్రమాదం ఏర్పడింది.
మలేరియా వ్యాధి ప్రాథమిక దశనుంచి పూర్తిగా తగ్గేంతవరకు దశలవారీగా చికిత్స చేయాల్సి ఉండటం, ప్రత్యేక పర్యవేక్షణ అవసరమైన నేపథ్యంలో జిల్లాలో ఉన్న మలేరియా అధికారి పోస్టును తీసివేయడం వైద్యవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 సీహెచ్‌సీలు, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచల్లో ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో 65 డాక్టర్ల పోస్టులు జిల్లాకు మంజూరుకాగా, ఇందులో 21 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో గిరిజనులకు సత్వరం వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారాయి. వీటితోపాటు పలుచోట్ల ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి.
వైద్యుల కొరత నిజమే..
జిల్లాలో వైద్యాధికారుల కొరత ఉన్నమాట వాస్తవమే. దీన్ని అధిగమించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో వైద్యాధికారులు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నాం. జిల్లాలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యుల కొరత ఉన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. కాంట్రాక్టు డాక్టర్లతో వైద్యుల కొరత ఉన్న ప్రాంతంలో వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం,
-వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
Advertisement
Advertisement