అనధికారికంగా సెలవుపెట్టి నెలల తరబడి డ్యూటీలకు రాకుండా ఉండే వైద్యులను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి పేషీ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
-ముఖ్యమంత్రి పేషీ నుంచి వైద్య శాఖకు ఆదేశాలు
-బోధనాసుపత్రులకు సర్క్యులర్ జారీ చేసిన డీఎంఈ
హైదరాబాద్ : అనధికారికంగా సెలవుపెట్టి నెలల తరబడి డ్యూటీలకు రాకుండా ఉండే వైద్యులను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి పేషీ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏడాదిపాటు సెలవులో ఉన్న వైద్యులను ఒక్కరిని కూడా ఇకపై ఉద్యోగంలో ఉంచాల్సిన అవసరం లేదని తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే నర్సింగ్‌హోంలలో పనిచేస్తున్నారని, ప్రైవేటు క్లినిక్‌లు నడుపుతున్నారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో విచారణ జరిపించి 600 మందికి వైద్యులకు చార్జ్‌మెమోలు జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వైద్యుల్లో కలకలం మొదలైంది.
ముఖ్యమంత్రి పేషీ నుంచి వచ్చిన ఆదేశాలతో వైద్య విద్యాశాఖలో తొలి కసరత్తు మొదలైంది. మంత్రి పదే పదే వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో సోమవారం వైద్య విద్యాసంచాలకుల కార్యాలయం నుంచి అన్ని బోధనాసుపత్రులకు, వైద్య కళాశాలలకు సర్క్యులర్ జారీ అయింది. ఇప్పటి వరకూ అనధికారిక సెలవులో ఉన్న వైద్యుల జాబితా ఇవ్వాలని, వారిని తక్షణమే తొలగించేందుకు చర్యలు చేపడతామని సర్క్యులర్‌లో పేర్కొన్నట్టు తెలిసింది.
కాగా పునర్విభజనలో కమల్‌నాథన్ కమిటీకి ఆప్షన్లు ఇవ్వని వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాజా లెక్కల ప్రకారం 30 మందికి పైగా గత ఏడాదిగా అనధికారిక సెలవులో ఉన్నారని, వారిని తొలగించే అవకాశాలున్నట్టు సమాచారం. అలాంటి వైద్యులు ఏమైనా వినతులు ఇచ్చినా వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని కూడా సర్కారు ఆదేశించినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో వైద్యవిధానపరిషత్, డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ విభాగాల నుంచి కూడా వైద్యులపై చర్యలకు ఆదేశాలు వెళ్లనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.