వైద్యులేనా! | two members died due to doctors in protests | Sakshi
Sakshi News home page

వైద్యులేనా!

Published Wed, May 28 2014 1:25 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

two members died due to doctors in protests

నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ :  ధర్పల్లి మండలం గౌరారం గ్రామానికి  చెందిన జోత్స్న(3)కు ఫిట్స్ రావడంతో మంగళవారం ఉదయం జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. వైద్యులు నిరసనలో ఉన్న విషయం తెలియక వారు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్యంకోసం తిరిగారు. ఎక్కడా వారికి వైద్యం అందలేదు. చివరికి వారి తల్లిదండ్రులు బాలికను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే బాలిక ప్రాణాలు వదిలింది.

  నగర సమీపంలోని ముబాకర్ నగర్ వద్ద తారక్ న గర్‌కు చెందిన శ్రీనివాస్(38) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆ స్పత్రిలో వైద్య సహాయం అందకపోవడంతో మంగళ వారం రాత్రి 11.30గంటలకు మృతి చెందాడు. ప్రైవే టు ఆస్పత్రులు మూసి ఉన్నందున శ్రీనివాస్ అనారో గ్యంతో సోమవారం నాడు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరా డు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే శ్రీని వాస్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 స్పందించిన జిల్లా కలెక్టర్
 ప్రైవేట్ వైద్యులు సేవలను నిలిపివేయడంపై మంగళవారం జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న స్పందించారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి గోవింద్‌వాగ్‌మోరే, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ భీంసింగ్‌లతో సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఫలంగా ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీలు చేసి వాటిలో సౌకర్యాలు, ఓపీ, ఐపీ సేవల వివరాలు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సేవల నిలుపుదలపై గంటలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న వారు ఆస్పత్రి ైవైద్యులతో కూడిన టాస్క్‌పోర్సును ఏర్పాటు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అందుకు నిరాకరించారు.

 తాము కేవలం వైద్యసేవలు మాత్రమే అందిస్తామని, తనిఖీలు చేయబోమంటూ స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆరోగ్యశాఖాధికారి, సూపరింటెండెంట్ కలెక్టర్‌కు ఉన్న పరిస్థితిని విరించారు. దీంతో కలెక్టర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులను ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి వైద్యసేవలు అందించాలని  సూచించారు.

 నేటి నుంచి రిలే దీక్షలు
 ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులకు నిరసనగా వైద్యుల ఆందోళన కొనసాగుతుందని  అప్నా అధ్యక్షుడు డాక్టర్ శివరాజ్ తెలిపారు. బుధవారం  రిలే దీక్షలు చేపడుతామన్నారు. ఇటీవల నిజామాబాద్, బోధన్‌లోని ఆస్పత్రులపై దాడి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్ర సంఘంతో మాట్లాడి తమ ఆందోళనను రాష్ట్ర  వ్యాప్తం చేస్తామన్నారు.

 కిక్కిరిసిన జిల్లా ఆస్పత్రి
 ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేయడంతో నాలుగు రోజులుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. స్పెషలిస్టు వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో ఓపీ కేసులు 350 నమోదు కాగా, మంగళవారం 560 పైగా నమోదయ్యాయి.
 
 ప్రభుత్వ వైద్యులపై చర్యలు
 ప్రైవేట్ వైద్యుల నిరసనకు మద్దతుగా ప్రభుత్వ వైద్యులు సోమవారం చేపట్టిన ధర్నాపై జిల్లా కలెక్టర్ ఆగ్రహించారు. ప్రభుత్వ వైద్యులు ఈ నిరసనలో ఎందుకు పాల్గొన్నారని, తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని కలెక్టర్ ఆస్పత్రి అధికారులను ప్రశ్నించారు.దీంతో ఎంత మంది వైద్యులు నిరసనలో పాల్గొన్నారో వివరాలను అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. వీరిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మెడికల్ కళాశాల తరపున నియమించబడిన వైద్యులపై డీఎంఈ వివరణ కోరారు. నిరసనలో పాల్గొన్న వైద్యుల వివరాలు అందించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను కోరారు.

 ఆస్పత్రిపై దాడిచేసిన ఆరుగురి అరెస్టు
 నిజామాబాద్ క్రైం : నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తా లో గల బాంబే నర్సింగ్ హోంపై ఈ నెల 22న రాత్రి దాడిచేసిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు నాల్గవ టౌన్ రెండవ ఎస్సై రామనాయుడు తెలిపారు. ఆస్పత్రి వైద్యుడి నిర్లక్ష్యంతోనే వినాయక్‌నగర్ హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన సుమలత అనే యువతి మృతి  చెందినదన్న కోపంతో ఆమె బంధువులు ఆస్పత్రిపై దాడిచేసినట్లు ఎస్సై తెలిపారు. ఆస్పత్రి వైద్యుడు నరేంద్ర ఫిర్యాదు మేరకు నిందితులైన రవీందర్, పండరి, సురేశ్, కిషన్, రాజబాబు, శ్రీనివాస్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement