నా అబద్ధాలు... అలా ఆగిపోయాయి! | I stopped short of things to do ...! | Sakshi
Sakshi News home page

నా అబద్ధాలు... అలా ఆగిపోయాయి!

Published Wed, Sep 3 2014 10:48 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

నా అబద్ధాలు... అలా  ఆగిపోయాయి! - Sakshi

నా అబద్ధాలు... అలా ఆగిపోయాయి!

కనువిప్పు
 
నాలో మొదటి నుంచి చిలిపితనం ఎక్కువ. అందులో భాగంగా అబద్ధాలు ఆడుతూ అందరినీ ఆట పట్టించేవాడిని. అప్పుడప్పుడూ నా అబద్ధాలు హద్దు మీరేవి. ఒకసారి ఏమైందంటే, చాలాకాలం తరువాత నా పదోతరగతి క్లాస్‌మేట్ శ్రీనివాస్ కలిశాడు. ఆ మాట... ఈ మాట మాట్లాడుతూ- ‘‘నాగరాజుగాడు ఎలా ఉన్నాడు?’’ అని అడిగాడు.
 నాగరాజు మాతో కలిసి పదోతరగతి చదువుకున్నాడు. వాడిది మా ఊరే.
 ‘‘నాగరాజు ఎలా ఉన్నాడు?’’ అని అడగగానే నేను రెచ్చి పోయాను. అప్పటికప్పుడు నాలో ఎన్నో అబద్ధాలు పుట్టుకొచ్చాయి.
 ‘‘అరే...నీకు విషయం తెలియదా? పాపం...నాగరాజు!’’ అన్నాను.
 ‘‘ఏమైంది వాడికి?’’ ఆసక్తిగా అడిగాడు.
 ‘‘ఒక యాక్సిడెంట్‌లో వాడి రెండు కాళ్లు పోయాయి. పాపం ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఏంచేస్తాం? అలా రాసి పెట్టి ఉంది’’ అన్నాను బాధగా.
 ‘‘అయ్యో! అలా జరిగిందా’’ అని చాలా బాధపడిపోయాడు శ్రీను. ‘‘వీలు చూసుకొని నాగరాజు దగ్గరికి వెళ్లి చూసొస్తాను’’ అన్నాడు.
 ‘‘వీడిని బకరా  చేశాను’’ అని నాలో నేను తెగ సంతోషపడిపోయాను. ఇది జరిగిన కొంత కాలానికి అనుకోకుండా మా ఫ్రెండ్ అన్నయ్య పెళ్లిలో నాగరాజు, శ్రీనులు కలుసుకున్నారు. ‘‘వాడిప్పటికీ మారలేదన్నమాట’’ అని నన్ను తెగతిట్టుకున్నారు. ఒకవేళ ఆ ఫంక్షన్‌లో నేను ఉండి ఉంటే కొట్టేవారేమో!
 
ఇది జరిగిన చాలా కాలానికి ఒక సంఘటన జరిగింది. అప్పుడు నేను ఓ కోచింగ్‌సెంటర్‌లో ఎమ్‌సెట్‌కు ప్రిపేరవుతున్నాను.
 ఒకరోజు మా కోచింగ్ సెంటర్‌కు ఫోన్ వచ్చింది-‘‘మీ నాన్నగారికి సీరియస్‌గా ఉందట. వెంటనే బయలుదేరు’’ అని చెప్పారు ప్రిన్సిపాల్. ఇక నేను ఏమీ ఆలోచించలేదు. భోరుమని ఏడుస్తూ ఉరుకులు పరుగుల మీద బస్ ఎక్కాను. కొన్నిరోజులుగా నాన్న జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనను తలచుకుంటే ఏడుపు ఆగడం లేదు.
 
మా ఊరిలోకి అడుగు పెట్టగానే, దూరంగా మా నాన్న కనిపిస్తున్నారు. వాళ్ల స్నేహితులతో ఏదో చెబుతూ తెగ నవ్వుతున్నారు. నేను షాక్ అయ్యా. ఎవరో కావాలనే అబద్ధం చెప్పారనే విషయం అర్థమైంది. ఎందుకో మరి... వాళ్ల మీద కోపం రాలేదు. చీటికి మాటికి అబద్ధాలాడే నా స్వభావంపై మాత్రం విరక్తి పుట్టింది. ఒక చిన్న అబద్ధానికి గంట పాటు నేను ఎలా విలవిలలాడోనో ఆ దేవుడికే తెలుసు. అందుకే అప్పటి నుంచి ఎప్పుడూ అబద్ధం ఆడలేదు.     
 
 - ఎస్.ఎల్, నిజామాబాద్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement