మొద్దు నిద్ర వదిలింది!
కనువిప్పు
సప్త వ్యసనాలలో ‘అధికంగా నిద్రపోవడం’ అనేది ఉందో లేదో తెలియదుగానీ, నాకు మొదటి నుంచి పరిమితికి మించి నిద్ర పోయే అలవాటు ఉండేది.
‘కంటినిండా నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిది’ అని ఎక్కడైనా చదివినప్పుడల్లా... రెచ్చిపోయి మరింత నిద్రపోయేవాడిని.
ఎప్పుడైనా ఉదయం లేవాల్సి వచ్చినప్పుడు, చాలా ఇబ్బంది పడేవాడిని. ఆ రోజంతా డల్‌గా ఉండేది.
‘‘రోజూ పొద్దుటే లేవడం మొదలు పెడితే అదే అలవాటు అవుతుంది’’ అని ఎవరో సలహా ఇవ్వడంతో నాలుగు రోజుల పాటు ప్రయత్నించానుగానీ నా వల్ల కాలేదు.
మళ్లీ షరా మామూలే.
లేటుగా నిద్ర లేచేవాడిని.
ఇంటర్‌లో ఉన్నప్పుడు సిటీలో రూమ్ అద్దెకు తీసుకొని ఉండేవాడిని. రూమ్‌లో ఒక్కడినే ఉండడం వల్లే నేను ఎంత సేపు పడుకున్నా... ఎవరూ లేపే వారు కాదు. ఇదే నా కొంప ముంచింది.
మరుసటిరోజు కెమిస్ట్రీ పరీక్ష రాయాలి.
దీంతో చాలా సేపు చదువుకొని లేటుగా నిద్రపోయాను. ఎప్పుడో మెలకువ వచ్చింది.
లేచి టైమ్ చూస్తే మధ్యాహ్నం కావొస్తోంది!!
గుండెలో రాయిపడినట్లు అయింది. ఉత్తపుణ్యానికి పరీక్ష రాసే అవకాశం కోల్పోయాను. ఇక ఆరోజు నుంచి గట్టిగా అనుకున్నాను. ఆరునూరైనా ఆరు లోపల నిద్ర లేవాలని. నేను ఈ నిర్ణయం తీసుకొని మూడు సంవత్సరాలు దాటింది. ఎప్పుడూ ఆలస్యంగా నిద్ర లేవలేదు. ఉదయాన్నే లేవడం వల్ల చురుగ్గా కూడా ఉండగలుగుతున్నాను.
- కె.శేఖర్, నిజామాబాద్