
గాంధీ నగర్ : త్వరలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ పరీక్షల నిర్వహణలో భాగంగా సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు షూస్, సాక్స్‌లు ధరించొద్దని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు ఎక్కడంటే?
గుజరాత్‌లో ఫిబ్రవరి 27 నుంచి పదోతరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు గుజరాత్ సెకండరీ,హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ పలు సూచనలు ఇచ్చింది.
పరీక్షల్లో జరిగే కాపీయింగ్‌ను అరికట్టేందుకే గుజరాత్ ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు షూస్,సాక్సులు ధరించకూడదని సూచించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు మొబైల్, ఎలక్ట్రానిక్ వాచ్ లేదా ఎలాంటి గాడ్జెట్‌లు ధరించకూడదని ఆదేశించింది.
ఇప్పటికే 2018 నుండి బీహార్ బోర్డు ఈ తరహాలో పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే,ప్రతికూల వాతావరణం కారణంగా కొనసాగుతున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు, త్వరలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.
బీహార్ బాటలో ఉత్తరప్రదేశ్ బోర్డు సైతం పరీక్షల సమయంలో కొన్ని కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు మాత్రమే షూస్,సాక్స్‌లు లేకుండా రావాలని తెలిపింది. తాజాగా,గుజరాత్ సైతం పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టే దిశగా చర్యలు తీసుకుంది. కాగా,ఈ సంవత్సరం గుజరాత్‌లో 10వ తరగతి, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 14.30 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.