తొలుత కమిషనరేట్‌లో విలీనం
తర్వాత రెండుగా విభజన
నివేదిక సిద్ధం చేస్తున్న అధికారులు
పాఠశాల విద్య, రాజీవ్ విద్యా మిషన్ విలీనం.. ఆగస్టు నాటికి అడ్వాన్స్‌డ్ పరీక్షల ప్రక్రియ పూర్తి
రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాకే మరికొన్నింటిపై తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్టు మరో ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని పదో షెడ్యూల్‌లో ఉన్నా.. అధికారులు మాత్రం బోర్డు విభజన ప్రక్రియ పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట ఇంటర్మీడియెట్ విద్య కమిషనరేట్‌ను ఇంటర్ బోర్డులో కలిపేస్తారు. తరువాత రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా సేవలందించటానికి వీలుగా విభజిస్తారు. ప్రస్తుత బోర్డు నేతృత్వంలో ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తరువాత ఇంటర్ విద్య, ఇంటర్ బోర్డు ఒకే విభాగంగా, ఒకే అధికారి పరిధిలో పనిచేసేలా విలీనం చేస్తూ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ నాటికి వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు బోర్డులు ఏర్పాటవుతారుు.
ప్రస్తుతం ప్రాథమిక విద్య, సెకండరీ విద్య కు వేర్వేరుగా విభాగాలు, ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఇవి రెండూ ఒకే విభాగంగా, ఒకే ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో పని చేస్తాయి.
పాఠశాల విద్యా డెరైక్టరేట్ (డీఎస్‌ఈ), రాజీవ్ విద్యా మిషన్‌లు(ఆర్‌వీఎం) ఒకే విభాగంగా ఉంటాయి.
పదో షెడ్యూల్‌లోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలను విభజించే అవకాశం ఉంది. ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని కూడా విభజిస్తారు.
ఆయా సంస్థల్లోని ఉద్యోగుల విభజన ప్రక్రియ చివరకు దశకు చేరుకుంది. ఎవరెవరూ ఏయే ప్రాంతాలకు చెందినవారు.. ఆయా సంస్థలను విభజించాల్సి వస్తే.. ఏయే రాష్ట్రాలకు ఏయే కేడర్లలో ఉద్యోగులు అవసరమనే పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేశారు.
పదో షెడ్యూలులోని సంస్థల విభజనపై ఉన్నత స్థాయిలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పది పరీక్షల పరేషాన్..
ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడడం, జూన్ రెండు లోపు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ పూర్తవుతుంది. కానీ, పదో తరగతి ఫలితాలు ఈ నెల చివరి వారంలో వెల్లడించే అవకాశం ఉంది. దీంతో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు ప్రభుత్వాలు ఓ అవగాహనకు వచ్చి.. ఈసారికి కలిపి పరీక్ష నిర్వహించాలనుకుంటే రెండింటికి కలిపి ఒకటిగానే నిర్వహిస్తారు. వేర్వేరుగా నిర్వహించాలనుకుంటే ఎక్కడివక్కడే జరుగుతాయి. ఇంటర్, టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మూల్యాంకనం మాత్రం ఎక్కడివి అక్కడే చేస్తారు.
డీఎస్సీల ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు అక్కడే
ప్రస్తుతం ఉపాధ్యాయులు జిల్లాల ఎంపిక కమిటీల ద్వారా నియమితులైన వారే కాబట్టి ఏ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ఆ జిల్లాల్లోనే ఉండనున్నారు. విభజన ప్రక్రియ కారణంగా ఉపాధ్యాయుల సేవల విషయంలో ఎలాంటి సమస్య లేదు. మొత్తం 3.16 లక్షల మంది టీచర్లలో తెలంగాణలో 1.40 లక్షల వరకుండగా, మిగతావారు సీమాంధ్ర జిల్లాల్లో ఉన్నారు. అయితే వేర్వేరు జిల్లాల్లో డిప్యూటేషన్లు, హైదరాబాద్ వంటి జిల్లాల్లో ఓపెన్ కోటాకు మించి నియమితులైన వారి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.