"1, 2, 3.. పదిలోపు ర్యాంకులు మా విద్యార్థులవే.. పరీక్షలు ఏవైనా మెరుగైన ర్యాంకులు మా విద్యా సంస్థలదే.. అని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఊదరగొడితే.. 'మా అబ్బాయికి మొదటి ర్యాంకు వచ్చింది.. మా అమ్మాయికి రెండో ర్యాంకు వచ్చింది..' అంటూ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకొంటారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యలో విద్యార్థులు ఎంతటి ఒత్తిడి అనుభవిస్తున్నారు.. ఎలా చదువుకుంటున్నారు.. అని మాత్రం ఎవరూ పట్టించుకోరు.. ఈ క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకొంటూ విద్యాసంస్థలు చేతులు దులుపుకొంటే.. తల్లిదండ్రులు కడుపు కోతతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.. మొత్తంగా తల్లిదండ్రుల అత్యాశ.. విద్యాసంస్థల ధనదాహం.. ప్రభుత్వ పట్టింపులేని తనం వల్ల విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.." - మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్
ర్యాంకుల కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు. సమయం.. సందర్భం లేకుండా ఎప్పుడూ ప్రిపరేషన్ అంటూ పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. రోజువారి సాధారణ తరగతులే కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని కొందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. మరికొందరు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మహబూబ్‌నగర్‌లోని మైనార్టీ గురుకులంలో ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు తీవ్రమైన ఒత్తిడే కారణం అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్‌లో చోటుచేసుకున్న పై సంఘటనలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యా సంస్థలకు విస్తరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
- గత వారం రోజుల క్రితం క్రిష్టియన్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాలు, ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహిస్తూ.. పరీక్షలు పెడుతున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పాఠశాల విద్యార్థులే స్వయంగా డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఎంఈఓతో విచారణ జరిపించారు. స్పెషల్ క్లాస్‌లు, పరీక్షల నిర్వహణ నిజమే అని తేలడంతో పాఠశాలను హెచ్చరించారు.
పాఠశాల స్థాయి నుంచే..
ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఐఐటీ, నీట్‌లో సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి నుంచే మెటీరియల్స్ పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి అదనంగా రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ తరగతులు పూర్తయిన వెంటనే స్పెషల్ క్లాస్‌ల పేరిట ఐఐటీ, నీట్ కోసం శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు వార్షిక పరీక్షల సిలబస్‌పై దృష్టి సారించాలా.. లేక ఐఐటీ, నీట్ వంటి వాటిపై దృష్టిపెట్టాలా అన్న అంశాలతో గందరగోళానానికి గురవుతున్నారు.
ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్!
Comments
Please login to add a commentAdd a comment