Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Will Donald Trump Really Kind With Tariffs What Prez Says1
సుంకాల మోత వేళ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

వాషిం‍గ్టన్‌: ప్రతీకార సుంకాల విధింపు వేళ(reciprocal tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీలక ప్రకటన చేసే సమయంలో వాణిజ్య భాగస్వాముల పట్ల తాను మరింత దయతో వ్యవహరిస్తానని ప్రకటించారాయన. అయితే కచ్చితంగా ఎలాంటి పరస్పర సుంకాలు విధించబడతాయనేది మాత్రం మంగళవారం రాత్రికల్లా లేదంటే బుధవారం పొద్దునే ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.జనవరిలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్‌ తన అధికారాన్ని ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు(Tariffs) తప్పదని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్‌ ప్రకటించారు. అయితే ట్రంప్‌ ప్రకటించిన ఆ ప్రతీకార టారిఫ్‌ల డెడ్‌లైన్‌ ఏప్రిల్‌ 2 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొన్నాయి. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై చర్చ నడుస్తోంది. అయితే..తాజాగా.. ‘‘మీరు రెండు రోజుల్లో చూడబోతున్నారు.. మేం చాలా దయతో ఉంటాం’’ అని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. కొన్ని దేశాలకు ఊరట దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు టారిఫ్‌లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని భారత్‌ ఇంతకాలం భావిస్తూ వచ్చింది. కానీ, సుంకాల ప్రకటన అనుకున్న తేదీకే ఉంటుందని ట్రంప్‌ చెప్పడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. అయితే.. భారత్‌ను ఆయన ప్రత్యేక మిత్రపక్షంగా భావిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు ప్రత్యేక ఊరట ఏమైనా దక్కుతుందేమో చూడాలి. అయితే.. ఇదీ చదవండి: భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..పరస్పర సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని వైట్‌హౌజ్‌ ప్రతినిధి కరోలిన్‌ లీవిట్‌ అంటున్నారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాలను ప్రస్తావిస్తూ.. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు నిలిపివేయాల్సిన అవసరం ఉందని లీవిట్‌ అభిప్రాయపడ్డారు.సుంకాల మోత ఎందుకంటే.. అమెరికన్‌ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్‌ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్‌ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన. అందుకే ప్రతీకార సుంకాల విధింపు తప్పదని అంటున్నారు.ట్రంప్‌ ప్రకటన కంటే ముందే..మరోవైపు ట్రంప్‌ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చైనా, కెనడా, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి ప్రతిఘటన తప్పదని అంటున్నారు. మరోవైపు.. ట్రంప్‌ సుంకాల ప్రకటన చేయకముందే ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. టారిఫ్‌ వార్‌ను ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఒక అడుగు ముందుకు వేశాయి. దక్షిణ కొరియా-జపాన్‌-చైనా దేశాలు ప్రాంతీయ వాణిజ్యం ప్రొత్సాహం దిశగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆదివారం చర్చలు జరిపాయి.

Prithviraj Sukumaran Mother Mallika Comments On Mammootty2
మా బాధ చూసి మమ్ముట్టి మెసేజ్‌.. కన్నీళ్లొచ్చాయి: పృథ్వీరాజ్ తల్లి

'ఎల్‌ 2: ఎంపురాన్‌' (L2 Empuraan) వివాదంపై మరోసారి పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక స్పందించారు. లూసిఫర్‌ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ గొడవలో కేవలం పృథ్వీరాజ్ సుకుమారన్‌ను మాత్రమే బలిపశువును చేస్తున్నారని ఆమె కామెంట్‌ చేశారు. తన కుమారుడికి చిత్ర పరిశ్రమలో చాలా మంది శత్రువులు ఉన్నారని మల్లిక తెలిపారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తుండటంతో అతని ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు ఎల్2: ఎంపురాన్ సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని మల్లికా ఆరోపించింది.ఇలాంటి సమయంలో తమకు అండగా నిలిచిన ఏకైక స్టార్‌ హీరో మమ్ముట్టి మాత్రమే అని పృథ్వీరాజ్ తల్లి మల్లిక తాజాగా కామెంట్స్‌ చేశారు. ఆయన పంపిన సందేశం చూసి చాలా భావోద్వేగానికి గురయ్యానని ఆమె ఇలా చెప్పారు. "రంజాన్‌ పండుగ ఉన్నప్పటికీ, మమ్ముట్టి నాకు మెసేజ్ చేశారు. పృథ్వీరాజ్ గురించి ఫేస్‌బుక్‌లో నేను చేసిన పోస్ట్ చూసి చింతించవద్దని మమ్ముట్టి చెప్పారు. మాకు అండగా నిలబడుతానని మాట ఇచ్చారు. నా కుమారుడికి జరుగుతున్న అన్యాయం వల్ల నేను చాలా బాధలో ఉన్నానని ఆయనకు తెలుసు. మమ్ముట్టి ఒక మనస్సాక్షి ఉన్న కళాకారుడు.నా పిల్లల గురించి ఎక్కడైనా ప్రతికూలంగా ఏదైనా కనిపిస్తే.., అది నన్ను బాధపెడుతుందని అతను అర్థం చేసుకుంటారు. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోను. నా పిల్లలకు కూడా మమ్ముట్టి చేసిన సాయాన్ని మర్చిపోవద్దని చెప్పాను. ఇంత జరుగుతున్నా చిత్ర పరిశ్రమ నుంచి మా కుటుంబం కోసం ఎవరూ మాట్లాడలేదు. కానీ, పరిశ్రమ నుండి సందేశం పంపిన ఏకైక వ్యక్తి మమ్ముట్టి మాత్రమే.. ఆయన పంపిన మెసేజ్‌ చూసినప్పుడు నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.'అని మనోరమ న్యూస్‌తో మల్లిక అన్నారు.'ఎల్‌ 2: ఎంపురాన్‌' చిత్రం ఇప్పటికే ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగానే వసూలు చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో సెట్ చేయబడిన సన్నివేశాల చిత్రీకరణపై వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం వల్ల ఈ చిత్రం నుంచి సుమారు 3 నిమిషాల నిడివిని తొలగించారు.

IPL 2025 KKR VS MI: KKR Fans Slams Venkatesh Iyer For His Regular Failures3
IPL 2025: రూ. 23.75 కోట్లు దండగ.. ఇంత దానికి కెప్టెన్సీ కూడా కావాలట..!

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (మార్చి 31) కేకేఆర్‌, ముంబై ఇండియన్స్‌ తలపడ్డాయి. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది తొలి విజయం. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అరంగేట్రం పేసర్‌ అశ్వనీ కుమార్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 3 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వనీ విజృంభణకు తోడు దీపక్‌ చాహర్‌ (2-0-19-2), బౌల్ట్‌ (4-0-23-1), హార్దిక్‌ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్‌ పుతుర్‌ (2-0-21-1), సాంట్నర్‌ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ముంబై కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. కేకేఆర్‌ బ్యాటర్లు అశ్వనీ కుమార్‌ సహా మిగతా ముంబై బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడ్డారు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్‌ (12 బంతుల్లో 22) బ్యాట్‌ ఝులిపించడంతో కేకేఆర్‌ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్‌ పాండే (19), రింకూ సింగ్‌ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో (రాజస్థాన్‌) సత్తా చాటిన డికాక్‌ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. సునీల్‌ నరైన్‌ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్‌ అయ్యర్‌ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్‌ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్‌ రికెల్టన్‌ (41 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్‌ (9 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్‌ జాక్స్‌ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్‌ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.కాగా, ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన కేకేఆర్‌ బ్యాటర్లపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రూ. 23.75 కోట్ల భారీ మొత్తం పెట్టి కొన్న వైస్‌ కెప్టెన్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను కేకేఆర్‌ అభిమానులే టార్గెట్‌ చేస్తున్నారు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని వమ్ము చేశాడని కామెంట్లు చేస్తున్నారు. భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేయడంతో వైస్‌ కెప్టెన్సీ అప్పగిస్తే ఇదేనా నువ్వు చేసేదంటూ మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో9 బంతులు ఎదుర్కొన్న అయ్యర్‌ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనూ అయ్యర్‌ విఫలమయ్యాడు. ఆర్సీబీపై కేవలం​ 6 పరుగులు (7 బంతుల్లో) మాత్రమే చేశాడు. ఆల్‌రౌండర్‌గా పని కొనస్తాడనుకుంటే అస్సలు బౌలింగే చేయడం లేదు. పైగా ఈ సీజన్‌కు ముందు కెప్టెన్సీ కూడా కావాలని మారాని చేశాడు. చెత్త ప్రదర్శనలతో అయ్యర్‌ ప్రస్తుతం కేకేఆర్‌ అభిమానులకు టార్గెట్‌గా మారాడు. నీ కంటే కొత్తగా వచ్చిన కుర్రాళ్లు అనికేత్‌ వర్మ (సన్‌రైజర్స్‌), విప్రాజ్‌ నిగమ్‌ (ఢిల్లీ) చాలా మేలని కామెంట్లు చేస్తున్నారు. నీపై పెట్టిన పెట్టుబడి దండగ అని అంటున్నారు. ఇంత దానికి కెప్టెన్సీ కూడా కావాలా అని ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా రింకూ సింగ్‌, ఆండ్రీ రసెల్‌ను కూడా ఏకి పారేస్తున్నారు. వీరిపై పెట్టిన పెట్టుబడి కూడా బూడిదలో పోసిన పన్నీరే అని అంటున్నారు. ఈ సీజన్‌కు ముందు రింకూను 13 కోట్లకు, రసెల్‌ను 12 కోట్లకు కేకేఆర్‌ రీటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. అయ్యర్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే నాలుగో కాస్ట్లీ ప్లేయర్‌ అన్న విషయం కూడా తెలిసిందే. మొత్తంగా తొలి 3 మ్యాచ్‌ల్లో రెండింట పరాజయాలు ఎదుర్కోవడంతో కేకేఆర్‌ అభిమానులు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ అని చెప్పుకునేందుకు కూడా సిగ్గు పడుతున్నారు.

TDP high command decision shocks senior leaders: Andhra pradesh4
పొమ్మనకుండా పొగ.. సీనియర్లకు లోకేశ్‌ సెగ

టీడీపీలో సీనియర్‌ నేతలు ఒక్కొక్కరికీ వరుసగా తలుపులు మూసుకుపోతు­న్నాయి. మంత్రి లోకేశ్‌ అభీష్టం మేరకు.. తనకు బాగా సన్నిహితులైనవారిని కూడా సీఎం చంద్రబాబు దూరం పెట్టేస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం సీనియర్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, కంభంపాటి రామ్మోహనరావు వంటి వారిని ఇప్పటికే దాదాపు రిటైర్‌ చేశారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాగంటి బాబు వంటి పలువురు నేతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలుగా ఉన్నా కొందరి పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకు పారీ్టలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధిమిగిలిన సీనియర్లకూ అదే గతి..చంద్రబాబు సమకాలీకుడైన అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారనే సాకుతో ఆయనకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. కేంద్ర మంత్రిగా, రాష్ట్రంలో పలుసార్లు మంత్రిగా పనిచేసిన అశోక్‌ అనుభవం, రాజకీయ నైపుణ్యాలను పట్టించుకోలేదు. దీంతో ఆయన ఇప్పుడు పారీ్టకి దూరంగా ఉంటున్నారు. అదితి కుమార్తె ఎమ్మెల్యేగా విజయనగరానికి పరిమితమయ్యారు.⇒ కంభంపాటి రామ్మోహనరావు ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. ఢిల్లీలో చంద్రబాబు తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు అవసరం లేకపోవడంతో కంభంపాటి ప్రాధాన్యత తగ్గిపోయింది. మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆయన ప్రయత్నించినా పరిగణనలోకి తీసుకోలేదు.⇒ గోరంట్ల బుచ్చయ్యచౌదరి చిరకాల స్వప్నం మంత్రికావడం. కానీ, క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. సొంత నియోజకవర్గంలో ఆయన చెప్పినవారికి పోస్టింగ్‌లూ ఇవ్వడం లేదు. ⇒ మాజీ హోం మంత్రి చినరాజప్పదీ ఇదే పరిస్థితి. ఉమ్మడి పశ్చి­మలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాగంటి బాబుకు అసలు సీటే ఇవ్వలేదు. ఇలా టీడీపీలో చాలామంది సీనియర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ⇒ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్లకు లోకేశ్‌ జమానాలో తమకు అవకాశాలు వస్తా­యా? అనే అనుమానాలు బలంగా మెదులుతున్నాయి. గత ఏడా­ది ఎన్నికల్లో బలమైన హామీలు పొందిన పిఠాపురం వర్మ వంటివారికీ నిరాశా నిస్పృహలు తప్పడం లేదు.యనమల.. సాగనంపారిలా..టీడీపీలో అత్యంత సీనియర్‌ నేత యన­మల రామకృష్ణుడు. స్పీకర్, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే, ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అవినీతి వ్యవహారాలపై లీకులిచి్చ.. తద్వారా యనమల రాజకీయ భవిష్యతుకు చంద్రబాబు తెరదించారనే తీవ్ర చర్చ పార్టీ ముఖ్యుల్లో జరుగుతోంది. 2 నెలల కిందట రాజ్యసభకు వెళ్లే చాన్స్‌ను, 2 వారాల కిందట ఎమ్మెల్సీగా కొనసాగించడా­నికి వచి్చన అవకాశాన్ని నిరాకరించి రామ­కృష్ణుడికి దారులను శాశ్వతంగా మూసేయడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారనేది పరిశీలకుల విశ్లేషణ.తన కూతురు దివ్య, అల్లుడు వెంకట గోపీనాథ్‌ అవినీతిని సాకుగా చూపి.. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్‌ వ్యూహాత్మకంగా పావులు కదిపారని యనమల తన అంతరంగీకుల వద్ద వాపోతున్నారని సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు ముందు దివ్య, గోపీనాథ్‌ అవినీతిపై ఎల్రక్టానిక్, సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. దివ్య తొలిసారి ఎమ్మెల్యే అయినా అవినీతి, అక్రమాలలో స్మార్ట్‌గా దూసుకుపోతూ తన పేరు బయటకు పొక్కకుండా అనుభవజు్ఞరాలి­గా సెట్‌ చేసుకుంటున్నారంటూ పరోక్షంగా రామ­కృష్ణుడిని తాకేలా తూర్పారపట్టారు. స్వ­ప­క్షీయులకు చెందిన మద్యం షాపులు, బెల్టు షాపులు, అనుమతుల్లేని బార్‌లు, పేకాట క్లబ్బుల నిర్వాహకుల ద్వారా నెలకు రూ.కోటి, మ­ట్టి, గ్రావెల్‌ దందా ద్వారా రూ.రెండు కోట్లు వె­నకేసుకుంటున్నారని, తుని సమీపంలో వి­మా­నాశ్రయం ప్రతిపాదనలో భాగంగా 700 ఎకరాలలో సుమారు 300 ఎకరాలకు సంబంధించి ల్యాండ్‌ కన్వర్షన్‌కు గాను ఇప్పటికే రూ.12 కోట్లు వెనకేసుకున్నారనేది పబ్లిక్‌ టాక్‌. రామకృష్ణుడు, దివ్య ఎక్కడా సీన్‌లో కనిపించకుండా వారి దగ్గరి బంధువు యనమల రాజేష్‌ ద్వారా అన్నీ నడిపిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. హైదరాబాద్‌లో ఐఆర్‌ఎస్‌ అధికారైన దివ్య భర్త వెంకట గోపీనాథ్‌ ప్రతి శని, ఆదివారాలు తునిలో ఉంటూ అవినీతికి మార్గ నిర్దేశం చేస్తున్నారని చెబుతున్నారు. 2014–19 మధ్య డిప్యుటేషన్‌పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పని చేసినప్పుడు నిధులు దారిమళ్లించడంతో పా­టు అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. య­నమలను పక్కన పెట్టేయడంలో బాబు, లోకేశ్‌ తప్పులేదని సమర్థించుకునేందుకు ఇప్పటికీ టీడీపీ అనుకూలురు, వారి సోషల్‌ మీడి­యా­లో పై అంశాలతో కూడిన వీడియోలు హల్‌­చల్‌ చేయిస్తుండటం గమనార్హం. యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా, మరో కుమా­ర్తె భర్త పుట్టా మహే‹Ùయాదవ్‌ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తుచేస్తూ.. పార్టీ ఏమైనా యనమల కుటుంబ ప్యాకేజీనా అనే కామెంట్లను టీడీపీ వారిచేతే గుప్పిస్తున్నారు. ఇక పార్టీ ఉన్నత స్థాయి ప్రణాళికల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే అనుమానాలు యనమల వర్గీయుల్లో బలంగా ఉన్నాయి.

Chandrababu Coalition govt Biggest Scam In Lulu mall Land Allocation5
చంద్ర­బాబు‘లూలూ’ గోల్‌ ‘మాల్‌’!

సాక్షి, అమరావతి: ‘లూలూ’గ్రూపుపై చంద్ర­బాబు సర్కారు వల్లమాలిన ప్రేమ చూపింది. లూలూ గ్రూపు చైర్మన్‌ యూసుఫ్‌ అలీ జనవరి 17న సీఎం చంద్రబాబుకు రాసిన ఓ లేఖ ఆధారంగా విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీజుపై ఆ సంస్థకు ధారాదత్తం చేసింది. విశాఖలోని హార్బర్‌ పార్క్‌లో 13.43 ఎకరాల భూమిలో అభివృద్ధి ప్రాజెక్టుకు టెండర్‌.. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన (ఆర్‌ఎఫ్‌పీ) నోటిఫికేషన్‌ జారీ చేయకుండానే వ్యవహారాన్ని పూర్తి చేసింది. హార్బర్‌ పార్క్‌లో ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ.150 కోట్లకుపైగా పలుకుతోందని విశాఖ వాసులు చెబుతున్నారు. అంటే.. ఏకంగా రూ.2 వేల కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని ‘లూలూ’కు రాసిచ్చేసినట్లు స్పష్టమవుతోంది. బీచ్‌ పక్కనే ఉన్న హార్బర్‌ పార్క్‌లో 13.43 ఎకరాల ఖరీదైన భూమి వీఎంఆర్‌డీఏ(విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అధీనంలో ఉంది. అత్యంత విలువైన ఈ భూమిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టాలంటే టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి పారదర్శకంగా ప్రైవేటు సంస్థను ఎంపిక చేయాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు 33 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వడానికి వీల్లైదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ.. “లూలూ’కు 99 ఏళ్లకు నామమాత్రపు అద్దెపై అప్పగిస్తూ.. ఆ సంస్థ ఛైర్మన్‌ విధించిన షరతులన్నింటికీ తలూపుతూ ఖరీదైన భూమిని ప్రభుత్వం కట్టబెట్టేసింది. ఈ వ్యవహారంలో రూ.వేల కోట్లు చేతులు మారడం వల్లే నిబంధనలు తుంగలో తొక్కి “లూలూ’పై వల్లమాలిన ప్రేమ చూపించినట్లు స్పష్టమవుతోంది.18 ఏళ్ల అనుబంధం.. ఆగమేఘాలపై పచ్చజెండాటీడీపీ కూటమి అధికారంలోకి రాగానే లూలూ ప్రాజెక్టుకు చంద్రబాబు తిరిగి పచ్చ జండా ఊపారు. గతేడాది సెప్టెంబరు 28న సీఎం చంద్రబాబుతో సమావేశమైన లూలూ గ్రూపు ఛైర్మన్‌ యూసుఫ్‌ అలీ విశాఖలో షాపింగ్‌ మాల్, ఎనిమిది స్క్రీన్‌లతో ఐమ్యాక్స్‌ మల్టీప్లెక్స్‌ నిర్మాణంపై చర్చించారు. దీనిపై అదే రోజు “ఎక్స్‌’ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేయగా.. తనకు చంద్రబాబుతో 18 ఏళ్లుగా అనుబంధం ఉందంటూ లూలూ గ్రూప్‌ ఛైర్మన్‌ ప్రతిస్పందిస్తూ రీట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో విశాఖ హార్బర్‌ పార్క్‌లో 13.43 ఎకరాల భూమిని అప్పగిస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతామంటూ ఈ ఏడాది జనవరి 17న సీఎం చంద్రబాబుకు లూలూ గ్రూపు ఛైర్మన్‌ లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 13న ఎస్‌ఐపీబీ(స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు) సమావేశంలో ఆమోదముద్ర వేశారు.ఇలా కలిశారు.., అలా జీవో ఇచ్చేశారు భారీ రాయితీలు.. అత్తెసరు అద్దెతమకు భూమిని 99 ఏళ్ల లీజుకు ఇవ్వాలని.. మల్టీప్లెక్స్‌ ప్రారంభమయ్యే వరకూ లేదా మూడేళ్ల వరకూ.. ఈ రెండింటిలో ఏది ముందైతే అంతవరకూ అద్దె మినహాయింపు ఇవ్వాలని లాలూ గ్రూపు ఛైర్మన్‌ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. పదేళ్లకు ఒకసారి పది శాతం అద్దె పెంచాలని, సాధ్యమైనన్ని అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. వాటన్నింటికీ ప్రభుత్వం తలూపడంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఎకరానికి నామమాత్రంగా రూ.50 లక్షలు అద్దెగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. స్టాంపు డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ రాయితీలు తదితర ప్రోత్సాహకాల కింద లూలూ గ్రూప్‌నకు రూ.170 కోట్లకుపైగా ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు చర్చ సాగుతోంది. లాలూ గ్రూప్‌ కోరికల చిట్టాకు తలూపి అంత లబ్ధి చేకూరుస్తున్నా ఆ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి అద్దె రూపంలో అత్తెసరు ఆదాయం మాత్రమే రానుండటం గమనార్హం. దీన్నిబట్టి ఇందులో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. 2018 ఫిబ్రవరి 16న నాటి టీడీపీ సర్కార్‌ లూలూ సంస్థకు పీపీపీ పద్ధతిలో షాపింగ్‌ మాల్, ఎనిమిది స్క్రీన్లతో ఐమ్యాక్స్‌ మల్టీప్లెక్స్‌ నిర్మాణానికి భూమిని నామమాత్రపు లీజుపై కేటాయించి భారీ రాయితీలు కల్పిస్తూ ఏకపక్షంగా కట్టబెట్టింది. దీని వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు అప్పట్లో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది.ఆదాయాన్ని ఆర్జించే వీలున్నా..వాస్తవానికి లూలూ మాల్‌కు అప్పగిస్తున్న భూమిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణాలను చేపట్టి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం, అద్దెలకు ఇవ్వడం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. అయితే దీన్ని కాదని.. ఓ ప్రైవేట్‌ సంస్థకు కారుచౌకగా ఏకంగా 99 ఏళ్లకు లీజుకు అత్యంత ఖరీదైన స్థలాన్ని కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక గూడుపు ఠాణీ వ్యవహారాలే కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడకు సమీపంలోనే రహేజా నిర్మిస్తున్న ఇన్‌ ఆర్బిట్‌ మాల్‌ కూడా ఉంది. నిజంగానే షాపింగ్‌ మాల్‌ కట్టాలనుకుంటే ప్రభుత్వమే నిర్మించవచ్చు. బ్యాంకు రుణం కూడా పొందే వీలుంది. అలాకాకుండా ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్‌ సంస్థలకు పప్పు బెల్లాల మాదిరిగా ధారాదత్తం చేయడం, రూ.వందల కోట్ల రాయితీలు కల్పించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ భూమిని ఒకవేళ ప్రైవేట్‌ పరం చేయాలనుకుంటే టెండర్లు నిర్వహించి బహిరంగ ప్రకటన జారీ చేయాలి. రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని ఖజానాకు జమ చేసి పారదర్శకంగా వ్యవహరించాలి. దీనికి విరుద్ధంగా 99 ఏళ్ల పాటు లీజు.. పలు రాయితీలు కల్పించడం వెనుక గోల్ఙ్‌మాల్‌’ వ్యవహారాలు దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది.⇒ ఎకరానికి చెల్లించే అద్దె: రూ.50 లక్షలు ⇒ లీజు గడువు: 99 ఏళ్లు⇒ రాయితీల రూపంలో లూలూ పొందే లబ్ధి: రూ.170 కోట్లు(స్టాంపు డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ రాయితీలు తదితరాలు)

key financial changes from april 1st6
నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు

నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదాయపన్ను దగ్గర్నుంచి క్రెడిట్‌ కార్డు రివార్డులు, టీడీఎస్‌ వరకు జరిగే ఈ మార్పుల ప్రభావం.. వ్యక్తిగత బడ్జెట్, ఆర్థిక ప్రణాళికలపై కచ్చితంగా ఉంటుంది. వీటిపై ఓసారి దృష్టి సారిద్దాం.2025–26 బడ్జెట్‌లో కొత్త ఆదాయపన్ను విధానంలో కలి్పంచిన పన్ను ప్రయోజనాలు 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. నూతన విధానంలో రూ.12 లక్షలకు మించకుండా ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు. వేతన జీవులు అయితే స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75వేలతో కలుపుకుని రూ.12.75 లక్షలకు మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం కల్పించారు.వేతన జీవులు, పెన్షనర్లకు ఇంతకుముందు వరకు నూతన పన్ను విధానంలో రూ.50 వేలుగానే ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ ప్రయోజనం రూ.75 వేలకు పెరిగింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు (సీనియర్‌ సిటిజన్స్‌) బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలు మించితే టీడీఎస్‌ అమలు చేసేవారు. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెంచారు. దీంతో వృద్ధులకు పెద్ద ఉపశమనం దక్కింది. 60 ఏళ్లలోపు ఉన్న డిపాజిట్లకు వడ్డీ ఆదాయం రూ.40వేలు మించితే టీడీఎస్‌ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.50వేలకు పెరిగింది. ఇన్సూరెన్స్‌ బ్రోకర్లకు వచ్చే కమీషన్‌ ఆదాయం ఏడాదిలో రూ.15,000 మించితే టీడీఎస్‌ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.20,000కు పెరిగింది. యాక్టివ్‌గా లేని (కార్యకలాపాల్లేని) ఖాతాలకు అనుసంధానమైన యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. భద్రత దృష్ట్యా వీటిని డీయాక్టివేట్‌ చేయనున్నారు. తమ ఖాతాలను యాక్టివ్‌గా మార్చుకుని తిరిగి యూపీఐ ఐడీ క్రియేట్‌ చేసుకోవచ్చు. సెబీ ఆదేశాల ప్రకారం మ్యూచువల్‌ ఫండ్స్‌ కొత్త పథకాల (ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన నిధులను, ఇష్యూ ముగిసిన తర్వాత 30 పనిదినాల్లో ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి.ఇదీ చదవండి: యాపిల్‌పై రూ.1,350 కోట్లు జరిమానాస్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌) పేరుతో సెబీ ప్రకటించిన కొత్త తరహా పెట్టుబడుల విభాగం ఆచరణలోకి రానుంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలతో ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌లు, కన్సాలిడేటెడ్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్లను నేరుగా డిజీలాకర్‌లోకి వెళ్లేలా చేసుకోవచ్చు. తద్వారా ఇన్వెస్టర్లు, వారి నామినీలు ఈక్విటీ పెట్టుబడుల వివరాలను కోరుకున్నప్పుడు సులభంగా పొందేందుకు వీలుంటుంది. ఎస్‌బీఐ తన క్రెడిట్‌ కార్డుల్లో కొన్ని రకాలపై రివార్డు పాయింట్ల పరంగా చేసిన మార్పులు అమల్లోకి వచ్చేశాయి. దీంతో సింప్లీ క్లిక్‌ ఎస్‌బీఐ కార్డు దారులు స్విగ్గీ షాపింగ్‌పై ప్రస్తుతం పొందుతున్న పది రెట్ల రివార్డు పాయింట్లు కాస్తా ఐదు రెట్లకు తగ్గిపోయాయి. అమెరికా డిమాండ్ల మేరకు ఆ దేశం నుంచి దిగుమతయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై భారత్‌ టారిఫ్‌లు తగ్గించాలనుకుంటోంది. దీని ఫలితంగా అమెరికా నుంచి వచ్చే యాపిల్స్, బాదం, ఆటో ఉత్పత్తుల ధరలు దిగిరావొచ్చు.

Nuvvalarevu Set to Stage Mass Marriages7
వధువే వరుడై... వరుడే వధువై...

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టడం సహజం. కానీ ఇక్కడ వధువే వరుడి మెడలో మూడు ముళ్లేస్తుంది. వధూవరులది ఒకే ఊరు. ఇరువురి మెడలో కరెన్సీ నోట్ల దండలు.. పెళ్లిపీటలపై కళ్లద్దాలు ధరిస్తూ దర్శనం. పెళ్లీడుకొచ్చిన అమ్మాయి, అబ్బాయిల మాటకు గౌరవమిచ్చే పెద్దలు. ఒకే ముహూర్తాన వందల సంఖ్యలో సామూహిక వివాహాలు.. దశాబ్దాలుగా ఎన్నికలెరుగని ఆ గ్రామం ఇంతకీ ఎక్కడుందంటే..? శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం. సుమారు 12వేల జనాభా ఈ ఊరి సొంతం. స్వాతంత్య్రానికి పూర్వం నావల రేవుగా పిలిచేవారు. కాలక్రమేణా నువ్వలరేవుగా మారింది. రెవిన్యూ రికార్డుల్లో మాత్రం లక్ష్మీదేవిపేటగా కనిపించే ఆ గ్రామంలో అందరూ మత్స్యకారులే... చేపలవేట వీరి ప్రధాన జీవనాధారం. పెద్దవాళ్లు సముద్రంలో వేట సాగిస్తారు.చాటింపు వేసి.. వివరాలు సేకరించిఅంతగా ఉన్నత చదువులు లేకపోవడంతో ఈ ఊరి యువత ఉపాధి నిమిత్తం హైదరాబాద్, ముంబై, అండమాన్ ప్రాంతాలకు వలస వెళతారు. వీళ్లలో పెళ్లీడుకొచ్చిన యువకులను రెండేళ్లకోసారి గుర్తించి వారి జాబితాను సిద్ధం చేస్తారు. ఆ ఏడాదికి పెళ్లికి సిద్ధమయ్యేవారు ఎవరున్నారన్న సమాచారాన్ని ముందుగా చాటింపు వేయించి వారి వివరాలను సేకరిస్తారు. అలా ఎంపికైన వారందరికీ ఒకే ముహూర్తాన సామూహిక వివాహాలను జరిపిస్తారు.వధూవరులది ఒకే ఊరు గతంలో మూడేళ్లకోసారి ఈ పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు యువత సంఖ్య పెరగడంతో రెండేళ్లకోసారి ఈ తంతు జరిపిస్తున్నారు. వరుడికి కావాల్సిన వధువు కోసం ఎక్కడో అన్వేషించరు. ఉన్న ఊరిలోనే వరసకు వచ్చిన అమ్మాయితో నిశ్చయిస్తారు. సామూహిక వివాహ ప్రక్రియలో కులపెద్దలదే కీలక భూమిక. పెళ్లిళ్లన్నీ వారి పర్యవేక్షణలోనే జరుగుతాయి. ముహూర్తాలు నిశ్చయించిన వేళ పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులను మరోసారి పెద్దలు పిలుస్తారు. వారి మనసులో ఎవరైనా ఉన్నారా... అని అడిగి తెలుసుకుంటారు. అలా ఇష్టపడినవారికి ఇచ్చి పెళ్లిచేయడంతో ఆ జంటల్లో ఆనందం రెట్టింపవుతుంది. నువ్వలరేవులో బైనపల్లి, బెహరా, మువ్వల అనే ఇంటి పేర్లున్న కుటుంబాలే అధికంగా ఉంటాయి. పెళ్లిళ్లన్నీ ఈ కుటుంబాల మధ్యే జరుగుతాయి.మూడు రోజుల పెళ్లి పండగసామూహిక వివాహ వేడుకను మూడురోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు పందిరిరాట వేస్తారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంంతో కేరింతలు కొడతారు. రెండోరోజు ప్రధాన ఘట్టం. అదే మాంగల్యధారణ. అయితే ఇక్కడ తాళికట్టేది వరుడు మాత్రమే కాదు. పెళ్లికూతురు సైతం వరుడి మెడలో తాళి కట్టడం విశేషం. మూడోరోజు వధువు పుట్టింటి నుంచి వరుడి ఇంటికి సారె వస్తుంది. ఈ సందర్భంగా పెళ్లి పందిరిలో ఆ సారెను అందరికీ చూపిస్తారు. గ్రామంలోని బంధావతి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక పెళ్లి వేడుక ముగుస్తుంది. జిల్లాలో సాధారణంగా వరుడి ఇంటివద్ద పెళ్లి జరిపిస్తారు. కానీ నువ్వలరేవులో మాత్రం వధువు ఇల్లే పెళ్లి వేదిక కావడం విశేషం.ఊరంత కుటుంబం వధూవరులిద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఊరంతా ఒకరికొకరికి ఏదో బంధుత్వం ఉండటం ఇక్కడి వారి సొంతం. పెళ్లి విందుకు బంధువులందరినీ ఆహ్వానించరు. ఏ ఇంటి పెళ్లి విందుకు ఎవరు వెళ్లాలన్నది గ్రామ పెద్దలే నిర్ణయిస్తారు. అలా ఆహార పదార్థాలను వృథా చేయకుండా, అనవసర ఖర్చులను నియంత్రిస్తూ జాగ్రత్తపడతారు.వరకట్నానికి దూరం నువ్వలరేవులో వరకట్నం అనే మాట వినిపించదు. పెళ్లికయ్యే ఖర్చును వధూవరులిద్దరి కుటుంబాలు సమానంగా భరిస్తాయి. ఆడపిల్లను పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపడమే మహాభాగ్యంగా మగపెళ్లివారు భావిస్తారు. పెళ్లిపీటలపై ఆసీనులైన వధూవరులిద్దరూ నల్లకళ్లజోడు ధరిస్తారు. ఇద్దరి మెడలో కరెన్సీ నోట్ల దండలు వేస్తారు. ఈ సామూహిక వేడుకను తిలకించేందుకు పరిసరప్రాంతాల ప్రజలు తరలి వస్తారు. దీంతో మూడురోజుల పాటు నువ్వల రేవులో తిరునాళ్ల సందడి కనిపిస్తుంది. నువ్వలరేవులో సామూహిక వివాహాలే కాదు, శ్రీరామనవమి ఉత్సవాలను సైతం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ముందు వరుడు.. ఆ తర్వాత వధువు పెళ్లిలో ముందుగా వరుడు వధువు మెడలో తాళికడతాడు. అనంతరం వధువు వరుని మెడలో తాళి కడుతుంది. దీన్నే స్థానికులు దురషం అని వ్యవహరిస్తారు. ఈ సాంప్రదాయం నువ్వలరేవు ప్రత్యేకం. ఇలా ఒకరికి ఒకరు తాళికట్టడంతో ఒకరికొకరు ఆజన్మాంతం రక్షగా ఉంటారన్నది ఇక్కడి వారి విశ్వాసం. అలాగే ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువనే భావన తమలో ఉండదని, అమ్మాౖయెనా, అబ్బాౖయెనా సమానంగానే భావిస్తామని గ్రామపెద్దలు చెబుతారు.– గుంట శ్రీనివాసరావు, సాక్షి, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం

NASA astronauts Sunita Williams Butch Wilmore Full interview Check Details Here8
Sunita Williams: మళ్లీ స్టార్‌ లైనర్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్తారా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు ఆరోగ్యంగానే ఉన్నారు. దాదాపు 9 నెలల అనంతరం మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమ్మీదకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇన్నాళ్లపాటు పరిశీలనలో ఉన్న వీళ్లు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఐఎస్‌ఎస్‌ అనుభవాలతో పాటు.. వాళ్లు అక్కడ ఉన్న సమయంలో భూమ్మీద జరిగిన చర్చలు, ఆందోళనలు, విమర్శలు తదితర అంశాలపైనా స్పందించారు. అవకాశం వస్తే మళ్లీ బోయింగ్‌ స్టార్‌ లైనర్‌( Boeing Starliner) స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్తారా? అని ఫాక్స్‌ న్యూస్‌ జరిపిన ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు. అది చాలా సామర్థ్యం గల వాహకనౌక అని భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌(Sunita Williams) అన్నారు. అయితే స్టార్‌ లైనర్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరో వ్యోమగామి విల్మోర్‌ మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టార్‌లైనర్‌లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కస్తామని పేర్కొన్నారు.నిర్లక్ష్యం వల్లే ఇరుక్కుపోయారనే విమర్శలకూ ఇద్దరూ స్పందించారు. తామెప్పుడు అలా భావించలేదని అన్నారు. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టే ఉద్దేశమూ తమకు లేదని అన్నారు. అనుకున్న ప్రకారం తాము భూమ్మీదకు రాలేకపోయామని.. ఒకరకంగా ఇరుక్కుపోయామనే భావించాల్సి ఉంటుందని, మరోరకంగా అక్కడ ఉండాల్సి వచ్చిందని.. అయినప్పటికీ తాము తీసుకున్న కఠోర శిక్షణ ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యం ఇచ్చిందని ఇద్దరూ అన్నారు. తమ మిషన్‌ విజయవంతం కావడంలో నాసా కృషిని, తాను సాధారణ స్థితికి రావడానికి సాయం చేసిన శిక్షకులకు సునీత ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఇలాన్‌ మస్క్‌(Elon Musk)లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో తీసుకున్న శిక్షణ వల్లే.. ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లడం, అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా గడపడం, తిరిగి భూమిపైకి రావడంలో, అలాగే పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధకావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. భూమిపైకి వచ్చాక ఇప్పటికే తాను మూడు మైళ్లు పరుగెత్తానని సునీత అన్నారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్న సమయంలో తమ టాస్క్‌ల్లో భాగంగా ఎన్నో సైన్స్‌ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని విల్మోర్‌ పేర్కొన్నారు.ఇక ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసని సునీతా విలియమ్స్‌ అన్నారు. అయితే తాము ఒక పెద్ద టీమ్‌ ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు తెలిపారు. విల్మోర్‌ మాట్లాడుతూ.. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని అన్నారు. ఇక స్టార్‌లైనర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్‌ టీమ్స్‌ నిబద్ధతను ఆయన కొనియాడారు. తమకు నాసాపై ఎంతో నమ్మకముందన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు.Astronauts Butch Wilmore & Sunita Williams express their views, carefully, with deliberate wording. Positive rather than negative or unhelpful.#ButchWilmore #SunitaWilliams #Trump https://t.co/qTYEdAbUMN— I can see Ireland from here. Gerry (@gtp_58) March 31, 2025సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌తో పాటు ఇదే ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న మరో వ్యోమగామి, క్రూ-9 కమాండర్‌ నిక్‌ హేగ్‌ మాట్లాడుతూ.. మిషన్‌ చుట్టూ రాజకీయం నడిచిందన్న వాదనను తోసిపుచ్చారు. గతేడాది జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం.. వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్‌లైనర్‌ కొన్నిరోజులకు భూమిపైకి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాల అనంతరం.. ఈ ఏడాది మార్చిలో స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌లో వారు ఐఎస్‌ఎస్‌ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు సైతం వాహకనౌకలో వచ్చారు. దీంతో హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు వీళ్లను తరలించి పరిశీలనలో ఉంచారు. అనంతరం.. 12 రోజుల అనంతరం తొలిసారి ఇప్పుడు బయటి ప్రపంచం ముందుకు వచ్చారు.

Rasi Phalalu: Daily Horoscope On 01-04-2025 In Telugu9
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.తదియ ఉ.9.54 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: భరణి ప.3.24 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.2.37 నుండి 4.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.13 వరకు, తదుపరి రా.10.52 నుండి 11.39 వరకు,అమృతఘడియలు: ఉ.10.55 నుండి 12.24 వరకు.సూర్యోదయం : 6.00సూర్యాస్తమయం : 6.09రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.వృషభం.... కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా. శ్రమాధికం. ఆరోగ్యభంగం. మిత్రుల నుండి సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.మిథునం.... కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.కర్కాటకం... ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.సింహం.... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దూరప్రయాణాలు. ఉద్యోగులకు గందరగోళం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన.కన్య... రుణఒత్తిడులు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.తుల..... ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.వృశ్చికం.... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.ధనుస్సు... ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. వృథా ఖర్చులు. ఆలయాలు సందర్శిస్తారు.మకరం... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఒత్తిడులు. బ«ంధువులతో మాటపట్టింపులు.కుంభం... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు. సన్నిహితులు సహాయపడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు.మీనం.. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యం.

YS Jagan condemns death of YSRCP worker in Sri Sathya Sai district10
అన్యాయాలను ప్రశ్నిస్తే.. పొట్టన పెట్టుకున్నారు: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. దాడులను వ్యతిరేకించినందుకు శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కురబ లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు.వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన­వారిని కచ్చితంగా చట్టంముందు నిలబెడతాం. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు.వ్యక్తుల భద్రతకు భరోసా కొరవడిన పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రామగిరి మండల ఉప ఎన్నికలో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వారి బాధ్యతా రాహిత్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. రామగిరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించినా, పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ వైఎస్సార్‌సీపీ నేతల పైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement