Jogulamba District News
-
15 కిలోల పంచలోహ విగ్రహం అందజేత
రాజోళి: మండల కేంద్రంలో కొలువైన భ్రమరాంబ అడివేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా మాత పార్వతి, మహాగణపతి ఆలయాలను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గుజరాతి ఈశ్వరప్ప,ఆయన కుమారుడు నాగరాజు కుటుంబ సభ్యులు 15 కేజీల వినాయక విగ్రహాన్ని అందజేశారు. వచ్చే నెలలో విగ్రహాల ప్రతిష్ట చేపట్టనున్న నేపథ్యంలో ఈ విగ్రహాన్ని శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందచేశారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రావ్,గోపాల్ రెడ్డి,చంద్రగౌడ్, అర్చకులు వినోద్,బసవరాజు తదిదరులు పాల్గొన్నారు. ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే సద్దలోనిపల్లి కృష్ణస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్ప స్వామి ఆలయాలతో పాటు వివిధ గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మల్దకల్, సద్దలోనిపల్లి ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం అయిజ: మున్సిపాలిటీలో ఏళ్లుగా సమస్యలు తిష్ట వేశాయని, ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదని, సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం పట్టణ బీజేపీ అధ్యక్షుడు భగత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యర్తలు మున్సిపల్ కార్యాలయం ముందు ఒక రోజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. అయిజ గ్రామ పంచాయతీనుంచి నగరపంచాయతీగా, మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా పట్టణం అభివృద్ధి చెందలేదని, మౌళికవసతులు ఏర్పాటు చేయలేదని అన్నారు. ఏటా సుమారు రూ. 2 కోట్లు ఆస్తిపన్ను ప్రజలనుంచి వసూలు చేస్తున్నారని, సమస్యలు మాత్రం పరిష్కరించడంలేదని ఆరోపించారు. అయిజను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయడంతోపాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ కార్యాలయం, కోర్టు, 50 పడకల ఆస్పత్రి ఏర్పాటుచేయాలని, అలాగే మున్సిపాలిటీ కార్యాలయ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఎల్ఈడీ బల్బులు, ముఖ్య కూడళ్ల వద్ద హైమాస్ట్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. వార్డుల సంఖ్యను 30కు పెంచాలని, ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, కర్నూలు–రాయిచూరు రోడ్డుపై ఉత్తనూరు చౌరస్తా నుంచి ఉప్పల చౌరస్తా వరకు డివైడర్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోపాల కృష్ణ, భీమసేనరావు, వెంకటేష్, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,621 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శనివారం 1,631 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6621, కనిష్టం రూ.3099, సరాసరి రూ. 5689 ధరలు పలికాయి. అలాగే, 19 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5539, కనిష్టం రూ. 5109, సరాసరి రూ. 5301 ధర లభించాయి. 182 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.7026, కనిష్టం రూ. 3236, సరాసరి రూ. 6809 ధరలు వచ్చాయి. -
సాగుకు యోగ్యం కాని భూములు గుర్తించాలి
గద్వాల: వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములు గుర్తించి వారిని రైతు భరోసా పథకానికి అనర్హులుగా గుర్తించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం ఐడిఓసీ కాన్సరెన్స్ హాల్లో రైతు భరోసా పథకం అమలుపై సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మండలాల వారిగా వ్యవసాయ భూములు, సాగు చేయలేని భూములు విస్తీర్ణం వాటి గుర్తింపు విధానాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు భరోసా పథకానికి సంబందించి 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభలు పక్కాగా జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సాగు జరగని భూములను క్షేత్రస్ధాయిలో గుర్తించి ఆ భూములను రైతు భరోసా పథకానికి అనర్హులుగా ప్రకటించాలని అధికారులను సూచించారు. చెరువులు, పౌల్ట్రీ ఫారమ్‌లు ఉన్న భూములను గుర్తించి వాటిని తోలగించాలని గ్రామ పటాలు, కాడ్రాస్ట్రియల్ పటాల ఆదారంగా భూములను సమర్థవంతంగా గుర్తించాలన్నారు. ఈ సర్వేలో నలా కన్వర్షన్ భూములకు ఫైల్ నంబర్ ఉండాలని, ఎల్ఆర్ఎస్ ధరఖాస్తులు లేదా లేఔట్లు ఉన్న భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ. ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియనాయక్, తహసీల్ధార్లు తదితరులు ఉన్నారు. సకాలంలో సర్వే పూర్తి చేయాలి అయిజ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక విషయాల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది నిబంధనల మేరకు పనిచేసి, సకాలంలో సర్వే పనులు పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ క్షేత్ర పరిశీలన చేశారు. అర్హులైన లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన గుర్తిస్తున్నారు, ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు, సేకరించిన అంశాలను రిజిస్టర్లలో క్రమపద్ధతిలో నమోదు చేస్తున్నారా అని తహసీల్దార్ జ్యోతిని, ఏఓ జనార్దన్‌ను ప్రశ్నించారు. ఫీల్డ్ వెరిఫికేషన్ వేగంగా పూర్తిచేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ సమగ్ర వివరాలు సేకరించాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులు, సామాజిక ఆర్థిక సర్వే వివరాలతో క్షేత్రస్థాయిలో పరిశీలన వివరాలను సరిచూసుకోవాలని ఆదేశించారు. రైతు భరోసాకు సంబంధించి నాలా కన్వర్షన్, భూసేకరణ, లేఅవుట్, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను సర్వే నెంబర్ల వారిగా పరిశీలించాలని, భూభారతి (ధరణి) పోర్టల్, గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా వాస్తవ వివరాలను నిర్దారణ చేసుకోవాలని అధికారుకు సూచించారు. జిల్లా అధికారులు శ్యాంసుందర్,స్వామి కుమార్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
గద్వాలటౌన్ : వట్టెం జవహర్ నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 27 పరీక్ష కేంద్రాలలో మొత్తం 6,602 మంది విద్యార్థులకు గాను 5,331 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 1,271 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక జిల్లా విషయానికి వస్తే 967 మంది విద్యార్థులకు గాను 800 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. డీఈఓ కార్యాలయ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఆయా మండలాల ఎంఈఓలు ప్రవేశ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. -
నిబంధనలు బేఖాతరు
గద్వాలటౌన్: ‘ఫైర్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి పక్కన ఓ నిర్మాణం చేపట్టారు. వంద గజాల స్థలంలో సెట్‌బ్యాక్ లేకుండా జీ+4 భవనాన్ని నిర్మిస్తున్నారు. నామమాత్రంగా ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకుని, బహుళ అంతస్థుల వాణిజ్య సముదాయాన్ని చేపట్టారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లుగా ఉన్నారు. భవన యజమాని దర్జాగా పనులు పూర్తి కానిచ్చారు’. ఇలా.. అనుమతులు తీసుకున్న దానికి విరుద్ధంగా కొందరు అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎవరికి ఇవ్వాల్సింది వారికిచ్చాం.. ఎవరేమి చేస్తారన్న దీమాతో బిల్డర్లు, కొందరు సొంత ఇంటియజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అలాంటి నిర్మాణాలపై ఇటీవల పెద్ద సఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నా.. అధికారుల నుంచి మీసమెత్తు స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు.గద్వాలలో ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు ఎక్కడెక్కడంటే.. మున్సిపల్ పరిధిలో ప్రధానంగా 2, 3, 6వ వార్డుల పరిధిలో సుమారు 40 భవన నిర్మాణాలు అనుమతులకు భిన్నంగా పై అంతుస్తులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ప్రధాన రహదారుల పక్కన సెట్ బ్యాక్ లేకుండా, నివాస అనుమతి తీసుకుని వాణిజ్య దుకాణాలు నిర్మిస్తున్నారు. కొన్ని నిర్మాణాలకు అనుమతులు సైతం తీసుకోలేదని తెలుస్తుంది. వీటితో పాటు శ్రీనివాసకాలనీ, భీంనగర్, పాత హౌసింగ్‌బోర్డు కాలనీలలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతున్నాయి. 6, 19, 20వ వార్డుల పరిధిలో ఉన్న రిక్రియేషన్, ఇండస్ట్రీయల్ జోన్ పరిధిలో సుమారు 50 వరకు అనుమతులు లేకుండా నిర్మాణాలు ఉన్నాయి. చర్యలు తప్పవు పట్టణంలో టీఎస్ బీపాస్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. ఇప్పటికే పలు భవనాలకు నోటీసులు జారీ చేయడంతో పాటు నిర్మాణ పనులను నిలిపివేశాం. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని భవన నిర్మాణాలను గతంలోనే టాస్క్ఫోర్సు బృందం కూల్చేసింది. అక్రమ నిర్మాణాలపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటున్నాం. – దశరథ్, కమిషనర్, గద్వాల టీఎస్ బీపాస్ నిబంధనలు పాటించని వైనం మున్సిపల్ ఆదాయానికి గండి -
పంటలు ఎండనివ్వం
రాజోళి: త్వరలోనే ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు అందుతుందని, రైతుల పంటలు ఎండిపోనివ్వమని, అవసరమైతే మళ్లీ సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో ఏపీ మంత్రులతో చర్చలు జరిపి ఆర్డీఎస్ రైతులకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. శనివారం రైతులతో కలిసి ఏపీ–తెలంగాణ సరిహద్దులో ఉన్న సుంకేసుల డ్యాం దగ్గరకు వెళ్లి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం తుమ్మిళ్ల గ్రామంలోని నదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్డీఎస్ రైతుల ఇబ్బందులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఏపీ మంత్రులతో మాట్లాడి, ఇరు ప్రాంతాల వారు కలిసి ఇండెంట్ పెట్టినట్లు తెలిపారు. కాగా.. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న 3,600 క్యూసెక్కులకు పైగా నీటిలో ఏపీ ప్రభుత్వమే ఎక్కువగా వాడుకుంటుందని ఆయన అన్నారు. సుంకేసుల దగ్గర గల కేసీ కెనాల్ ద్వారా నీరు ఏపీకి ఎక్కువగా వెళ్లిపోతుందని, దీని వల్లనే బ్యాక్ వాటర్ ఉండాల్సిన తుమ్మిళ్ల దగ్గర గత రెడు రోజుల కంటే ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత తక్కువగా ఉందని అన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా మోటార్లకు నీరు అందడం లేదని తెలిపారు. ఈ విషయమై ఆయన తుమ్మిళ్ల ఎత్తిపోతల నుండి ఏపీ నీటి పారుదల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. కేసీ కెనాల్లో నీటి ప్రవాహాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. త్వరలో ‘మల్లమ్మకుంట’లో కదలిక తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో కీలక పాత్ర పోషించే మల్లమ్మకుంట రిజర్వాయర్‌పై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించామని, త్వరలోనే దానిపై కదలిక తీసుకువచ్చి రైతులకు శుభవార్త చెప్తామని అన్నారు. రిజర్వాయర్లను పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని ఆయన తెలిపారు. నీలి శ్రీనువాసులు, దొడ్డెప్ప, కుమార్, సీతారామి రెడ్డి, ఎల్లా రెడ్డి, ఎనుముల నాగరాజు,దస్తగిరి,వెంకటేశ్వర్లు,హసేన్,రషీద్ పాల్గొన్నారు. -
డబ్బులిచ్చుకో.. ఇష్టమొచ్చినట్లు కట్టుకో
భవన నిర్మాణ అనుమతులను టీఎస్ బీపాస్ ద్వారా జారీ చేయాల్సి ఉంది. స్వీయ మదింపులో 21 రోజుల్లో అనుమతులు వస్తాయి. అదేవిధంగా అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కొత్త మున్సిపల్ చట్టంలో పలు నిబంధనలు రూపొందించారు. అందులో ప్రధానంగా అన్ని ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తేడాలు లేకుండా కచ్చితమైన ఇంటి కొలతలు ఉండాలి. కొలతల్లో తేడాలు ఉన్నా, నిబంధనలు అతిక్రమించినా 25 రేట్లు జరిమానాతో వాస్తవ పన్ను విధిస్తారు. అంతేకాక సెట్‌బ్యాక్ నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలి. స్థలం 200 గజాల్లోపు ఉంటే రోడ్డు వైపు 5 ఫీట్లు, మిగతా మూడు వైపులా 3.5 ఫీట్లు వెనిక్కి స్లాబు వేసుకోవాలి. 100 గజాల్లోపైతే రోడ్డు వైపు 5 ఫీట్లు, మిగిలినా రెండు వైపుల 2 ఫీట్లు వదలాలి. 20 ఫీట్ల రోడ్డు ఉంటే కచ్ఛితంగా 5 ఫీట్లు మున్సిపాలిటీకి గిఫ్టు చేయాల్సిందే. ఇదిలా ఉంటే సెట్‌బ్యాక్ స్థలంలో స్లాబు, ప్రహరీ, సెప్టిక్ ట్యాంకు ఉండకూడదు. ఇళ్లకు పెట్టే తలుపులు, గేట్లు లోపలివైపునకు తెరుచుకోవాలి. ● ఇలా కాకుండా ఇంటి యజమానులు తీసుకున్న అనుమతులకు భిన్నంగా పై అంతస్తులు నిర్మిస్తున్నారు. అధికారులు తనిఖీకి వచ్చేలోపు నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఈ వ్యవహరంలో సంబంధిత యంత్రాంగం నిర్లక్ష్యంతో పాటు వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఉండటంతో చర్యలు తీసుకోకుండా వెనుదిరుగుతున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి రూ. లక్షల్లో గండి పడుతుంది. -
అందరికీ అందుబాటులోకి..
ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన గానుగ నూనె తయారు చేయాలని సంకల్పించి.. చిన్నగా ప్రారంభించాం. డిమాండ్ పెరగడంతో అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్నాం. ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించారు. యూనిట్ నిర్వహణ, రుణ సౌకర్యం, మార్కెటింగ్ వంటి అంశాలపై 1,200 మందికి శిక్షణ ఇచ్చాం. ఆయా రాష్ట్రాల్లో 250 గానుగలు ఏర్పాటుకు కృషిచేశాం. – బస్వరాజ్, గానుగ నూనె తయారీదారుడు -
గట్టు తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
గట్టు: గట్టు తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సరితారాణిపై కలెక్టర్ బీఎం సంతోష్ సస్పెన్షన్ వేటు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబందించి సాగుకు యోగ్యం కాని భూముల వివరాలను గుర్తించేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు పనులు అప్పగించింది. అయితే, రెండు రోజుల క్రితం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ గట్టు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ తహసీల్దార్ అందుబాటులో లేక పోవడంతో పాటుగా ఇతర కారణాల కారణంగా తహసీల్దార్‌పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కార్యాలయానికి ఈమెయిల్ చేసినట్లు సమాచారం. సస్పెన్షన్ విషయాన్ని సైతం అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. -
ఆరోగ్యప్రదాయిని
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వారిద్దరు ప్రాణస్నేహితులు. రామకృష్ణ మఠంలో వలంటీర్లుగా పనిచేశారు. తన తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకరు.. రాజీవ్ దీక్షిత్‌ల ప్రసంగాలతో మరొకరు.. ఇలా ఇద్దరూ కలిసి గానుగ నూనె తయారీకి శ్రీకారం చుట్టారు. తొలుత తమ ఇంటి వరకే అనుకున్న వారు.. ప్రజలకు ఆరోగ్యపరంగా మేలు చేయాలనే లక్ష్యంతో విస్తరించారు. ఆరోగ్యప్రదాయిని పేరుతో గానుగ నూనె తయారు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మారుమూల పల్లె నుంచి విదేశాలకు ఎగుమతి చేసే వరకు ఎదిగిన మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలంలోని జక్లపల్లి గ్రామానికి చెందిన కోట్ల శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజ్ విజయగాధపై ప్రత్యేక కథనం.. కోట్ల శ్రీనివాస్‌రెడ్డి తల్లి కోట్ల జయమ్మకు 2018లో రొమ్ము కేన్సర్ వచ్చింది. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చూపించారు. పదిసార్లు కీమోథెరపీ చేయాలని డాక్టర్లు సూచించగా.. రెండుసార్లు చేయించారు. ఈ క్రమంలో ఆయుర్వేద మందులతో నయమవుతుందని పలువురు చెప్పడంతో కీమోథెరపీ వదిలేసి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు వెళ్లి ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఖాదర్వల్లీని కలిశారు. కేన్సర్‌కు కల్తీ నూనెల వాడకమే ప్రధాన కారణమని.. వాటిని మానేసి గానుగ నూనె వాడాలని, దీంతోపాటు చిరుధాన్యాలు తీసుకోవాలని ఆయన సూచించారు. మైసూర్లో నూనె గానుగలు ఉన్నాయని, వాటిని ఒక్కసారి చూడాలని చెప్పడంతో శ్రీనివాస్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మైసూర్లో నూనె గానుగలను పరిశీలించిన తర్వాత శ్రీనివాస్‌రెడ్డి ఆరు నెలల పాటు మహబూబ్‌నగర్‌లో ఎలక్ట్రిక్ గానుగ నుంచి తీసిన నూనెను కొనుగోలు చేసి వినియోగించాడు. ఈ క్రమంలో సొంతంగా గానుగ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చి.. 2019లో తన స్నేహితుడు బస్వరాజ్తో కలిసి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా జక్లపల్లిలో తన పొలంలో రూ.3 లక్షల వ్యయంతో ఎద్దుల కట్టె గానుగను ఏర్పాటు చేశారు. పల్లి, కొబ్బెర, ఆవిసె, కుసుమ, నువ్వులతో నూనె తీయడం ప్రారంభించారు. ఆ తర్వాత రూ.25 లక్షల రుణంతో వాటిని ఐదు గానుగలకు పెంచారు. గానుగ నూనెకు డిమాండ్ పెరగడంతో కట్టెతోపాటు 9 రాతి గానుగలు ఏర్పాటు చేసి నూనె తీస్తున్నారు. గానుగ ద్వారా ఒక్క కిలో నూనె తయారీకి మూడు కిలోల పల్లీలు గానీ, కుసుమలు గానీ అవసరం. ఈ మేరకు వివిధ రకాల నూనెలను గానుగ ద్వారా తీసేందుకు అవసరమైన ముడి సరుకులకు వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతినెలా 6 టన్నుల పల్లీలు, 2 టన్నుల కొబ్బరి, 3 టన్నుల కుసుమ, 2 టన్నుల నువ్వులు అవసరమవుతాయని నిర్వాహకులు తెలిపారు. వీటిలో గడ్డి నువ్వులు ఒడిశా.. కుసుమ, కొబ్బరి కర్ణాటక.. పల్లీలు, నువ్వులను మహబూబ్‌నగర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎగుమతికి సిద్ధంగా ఉన్న నూనె స్నేహితుడు బస్వరాజ్తో కలిసి.. తల్లి ఆరోగ్యం కోసం... సగటున వంద కిలోలు.. ఒడిశా, కర్ణాటక నుంచి.. విదేశాలకు ఎగుమతి.. గానుగల ద్వారా తీసిన వివిధ రకాల నూనెలను మొదట స్థానికంగా విక్రయించిన వీరు.. హైదరాబాద్‌లోని ఓ సంస్థ సహకారంతో విదేశాలకు రవాణా చేస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి దాదాపు 4 వేల కిలోల మేర నూనెను దుబాయ్, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, హరియాణా తదితర రాష్ట్రాలకు కొరియర్ ద్వారా సైతం గానుగ నూనె సరఫరా చేస్తున్నారు. రకాన్ని బట్టి ఒక్కో కిలోకు రూ.300 నుంచి రూ.450 వరకు రిటైల్, హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. గానుగ తీసిన తర్వాత వచ్చే పిప్పిని పశువుల దాణా కోసం విక్రయిస్తున్నారు. దీనికి స్థానికంగా గిరాకీ ఉండగా.. కిలోకు రూ.40 చొప్పున ధర పలుకుతోంది. సిరులు కురిపిస్తున్న గానుగ నూనె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుండటంతో పెరుగుతున్న డిమాండ్ 9 గానుగల ద్వారా నెలకు 3 వేల కిలోల దాకా ఉత్పత్తి మారుమూల జక్లపల్లి నుంచి విదేశాలకు సైతం ఎగుమతి అందరి మన్ననలు అందుకుంటున్న కోట్ల శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజ్ మొదట ఇంటి వరకు మాత్రమే గానుగ నూనెను తీసేవారు. ఆ తర్వాత నెలకు 450 కిలోల నూనె తీసేవారు కాగా.. డిమాండ్ బాగా పెరగడంతో నెలకు వెయ్యి కిలోల నూనె తయారీకి శ్రమించారు. ప్రస్తుతం రోజుకు సరాసరి 50 నుంచి 100 కిలోల చొప్పున 9 గానుగల ద్వారా మొత్తంగా నెలకు 3 వేల కిలోల వరకు నూనె తీస్తున్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
గద్వాల: మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు మంజూరైన నిధులు, వాటి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా, నాణ్యతగా పూర్తి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో చేపడుతున్న అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన స్టోరేజీ రిజర్వాయర్ నీటి సరఫరా పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలన్నారు. 15వ ఫైనాన్స్, సీఎం అష్యూరెన్స్ ఫండ్, జనరల్ ఫండ్ ఇతర మున్సిపల్ నిధులతో ఇప్పటికే చేపట్టిన పనులన్నింటినీ నిర్ణీత సమయంలో చేపట్టాలన్నారు. గద్వాల మున్సిపాలిటీలో ఆడిటోరియం, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కమ్యూనిటీ హాల్స్ వంటి పనులు వెంటనే ముగించాలన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు, విద్యుత్ చార్జీలు జనరల్ ఫండ్ ద్వారా వారం రోజుల్లో చెల్లించాలన్నారు. సీఎం అష్యూరెన్స్ మిగులు నిధులతో సమ్మర్ వాటర్ ప్లాన్ కింద వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ నిధులతో అవసరమైన చోట్ల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
కదిలొచ్చిన రథం.. పులకించిన సింగపట్నం
ఉమ్మడి పాలమూరులో ప్రసిద్ధిగాంచిన సింగోటం శ్రీలక్ష్మీనరసింహస్వామి రథోత్సవం శుక్రవారం కనులపండువగా సాగింది. పట్టువస్త్రాలు, బంగారు భరణాలు, వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారి కదిలిరావడంతో సింగపట్నం పులకించిపోయింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రధాన ఆలయం నుంచి రత్నగిరికొండ వరకు స్వామివారి రథాన్ని లాగి పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు నమో.. శ్రీలక్ష్మీనారసింహాయ నామస్మరణతో మార్మోగింది. – కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్ వివరాలు IIలో.. -
మార్చి వరకుటార్గెట్ చేరుకుంటాం
స్థిరాస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు అనుకున్నంతగా జరగకపోవడంతో రిజిస్రేటషన్ శాఖకు అంతగా రాబడి రాలేదని చెప్పవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడ కూడా అనాథరైజ్డ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొనడం, ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడం వంటివి ప్రభావం చూపుతున్నాయి. ప్రజల్లో హైడ్రా భయం కూడా కారణం కావొచ్చు. మార్చి వరకు టార్గెట్ పూర్తవుతుందనే నమ్మకం ఉంది. – వి.రవీందర్, జిల్లా రిజిస్ట్రార్ -
ముందుగానే చేరుకోవాలి..
జవహార్ నవోదయ విద్యాలయం 2025– 26 విద్యా సంవత్సరం ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మొత్తం 27 పరీక్ష కేంద్రాల్లో 6,602 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు ఆన్లైన్లో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. – భాస్కర్‌కుమార్, ప్రిన్సిపల్, జవహర్ నవోదయ విద్యాలయం ● -
వైభవంగా లక్ష్మీహయగ్రీవస్వామి ఉత్సవాలు
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీహయగ్రీవ స్వామి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆలయంలో విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యహవచణం, శ్రీలక్ష్మీహయగ్రీవ స్వామి, జ్ఞాన సరస్వతి అమ్మవారికి రక్షాబంధన కార్యక్రమాలు అర్చకులు వేదమంత్రాల మధ్య జరిపారు. అదేవిధంగా యాగశాలలో వాస్తు ఆరాధనలు, వాస్తు హోమాలు, వాస్తు పర్యగ్నికరణం వంటి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజరు సురేందర్‌రాజు, అర్చకులు పాల్గొన్నారు. -
విద్యాభివృద్ధికి బాటలు..
తెలంగాణ రాష్ట్రంలో పూర్వం 10 జిల్లాలు ఉండగా.. వీటిలో అర్బన్ జిల్లాకు నవోదయ విద్యాలయాలు ఉండవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 9 జిల్లాల పరిధిలో తొమ్మిది నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రతి విద్యాలయంలో 80 సీట్లు ఉంటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరికొన్ని నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. రాబోయే కాలంలో మరికొన్ని విద్యాలయాలను మంజూరు చేస్తామని ప్రకటించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన జోగుళాంబ గద్వాల జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరైతే ఇక్కడి విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అక్షరాస్యతలో వెనకబడిన ఈ ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తే అక్షరాస్యత పెంపుతోపాటు విద్యాభివృద్ధికి బాటలు వేసినట్లవుతుంది. ఆ దిశగా పాలకులు నడిగడ్డలో కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. -
ఆదిశిలాక్షేత్రం హుండీ ఆదాయం రూ.25,62,300
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూగా వెలసిన లక్ష్మీవేంకటేశ్వరస్వామికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ.25,62,300 ఆదాయం సమకూరిందని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా.. గద్వాల ఎస్వీఎస్ సేవా సంఘం నిర్వాహకుడు అభిలాష్, ఆధ్వర్యంలో 120 మంది మహిళలు, గట్టుకు చెందిన శ్రీ భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం రూ.25,62,300 ఆదాయం సమకూరగా చింతలాముని నల్లారెడ్డిస్వామి హుండీ ఆదాయం రూ.1,32,406 వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. గతేడాది కంటే ఈసారి రూ.1,55,171 అదనంగా ఆదాయం సమకూరిందన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి, చైర్మన్ ప్రహ్లాదరావు, అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, బాబురావు, మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, నరేందర్, నారాయణ, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘హైడ్రా’ భయంతో..
పాలమూరులో చాలా వరకు ప్రజలు ప్లాట్లు కొనాలంటే భయపడుతున్నారు. హైడ్రా భయమే ఇందుకు కారణం. ఎక్కడన్నా కొద్ది పాటి నీళ్లు నిలిచినా.. ఆ భూమిని కొనడానికి ముందుకు వస్తలేరు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. భారీగా పెరిగిన సిమెంట్, స్టీల్ ఇతర సామగ్రి ధరలతో భవనాల నిర్మాణాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. దీంతో పాటు గ్రామ పంచాయతీ లేఔట్ రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు రాబడి తగ్గిందని చెప్పవచ్చు. జీపీల్లో పూర్తిస్థాయిలో లేఔట్ రిజిస్ట్రేషన్లు మొదలైతే రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. – చందుయాదవ్, మహబూబ్‌నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ప్రముఖులు దర్శించుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ షర్మిల, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి, సినీ యాంకర్ ప్రదీప్ కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ పురేందర్ కుమార్ అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు ఆలయ ధర్మకర్తలు సరస్వతి, నాగశిరోమణి, మాజీ సర్పంచ్ జోగుల రవి తదితరులు ఉన్నారు. బొల్లుగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో.. ఎర్రవల్లి: మండల కేంద్రంలోని బొల్లుగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని గురువారం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సతీమణి మహాలక్ష్మి, అదనపు కలెక్టర్ షర్మిళ, టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ మాతృమూర్తి మంచిరాజు భావన, పలువురు టాలీవుడ్ ప్రముఖులు సందర్శించారు. ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేరుశనగ క్వింటా రూ.6,201 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు గురువారం 1427 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6201, కనిష్టం రూ.2806, సరాసరి రూ.4510 ధరలు పలికాయి. అలాగే, 27 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5521, కనిష్టం రూ.4509, సరాసరి రూ.5511 ధర లభించాయి. 67 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2466, కనిష్టం రూ.2275, సరాసరి రూ.2446 ధర పలికింది. 186 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6869, కనిష్టం రూ. 3306, సరాసరి రూ. 6869 ధరలు వచ్చాయి. సింగోటం లక్ష్మీనృసింహుడి ప్రభోత్సవం కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ప్రభోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి దీక్షహవనం, లక్ష్మీగణపతి హోమతర్పణం, సతీసమేత ఆదిత్యాది నవగ్రహ, ఆంజనేయ, వాస్తు, సర్వతోభద్రహవనాలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను సింహవాహనంపై ఉంచి రత్నగిరి కొండ వరకు వేలాది మంది భక్తుల గోవిందనామస్మరణ మధ్య ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ పౌండర్ చైర్మన్ ఆదిత్య లక్ష్మణ్‌రావు, అర్చకులు పాల్గొన్నారు. అనంతరం టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనను మంత్రి జూపల్లి కృష్ణారావు తిలకించారు. అలాగే శుక్రవారం జరిగే రథోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నవోదయ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు బిజినేపల్లి: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించే నవోదయ ప్రవేశ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేశామని, పరీక్షలను అధికారులు బాద్యతగా నిర్వహించాలని నాగర్‌కర్నూల్ జిల్లా విద్యా శాఖ అదనపు కమిషనర్ రాజశేఖర్‌రావు అన్నారు. గురువారం బిజినేపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రవేశ పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6 వేల మందికిపైగా విద్యార్థులు నవోదయ విద్యాలయంలో 6వ తరగతి కోసం ప్రవేశ పరీక్షకు హజరుకానున్నారని, మొత్తం 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 27 మంది సూపరింటెండెంట్లు, 27 మంది పరీశీలకులను నియమించామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆయా జిల్లాల పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్ష నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ వైస్ ప్రిన్సిపల్ జానకిరాములు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
●● రైతు ఆత్మీయ భరోసా గొప్ప పథకమని.. దీని గురించి ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం వర్తించని వారు నిరాశ చెందకుండా ఉపాధి పనికి వెళ్లేలా అధికారులు సూచించాలని.. మరోసారి దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే సొంత స్థలం లేని వారికి మలి దఫాలో ఇళ్లు వస్తాయని సర్ది చెప్పాలన్నారు. ● కొత్త పథకాల అమలులో అర్హుల ఎంపిక సమర్థవంతంగా జరగాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సూచించారు. ● ఇందిరమ్మ ఇళ్ల పథకంలో టెక్నికల్, ప్రాక్టికల్ సమస్యలు తలెత్తుతున్నాయని.. క్షేత్రస్థాయిలో వడబోసిన జాబితాను గ్రామ సభలో పెట్టాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. ● ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారికి కూడా ప్రభుత్వ పథకాల వర్తింపులో అవకాశం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోరారు. ● మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సర్వే జరిగిన చోటే స్క్రూటినీ చేయాలని.. ఇళ్ల్లు ఉన్నవారిని అర్హుల జాబితా నుంచి వెంటనే తొలగించాలన్నారు. ఆర్అండ్ఆర్ సెంటర్లో ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. అక్కడి ప్రభుత్వంతో చర్చించి జూరాలకు ఐదు టీఎంసీల నీటిని వదిలేలా చూడాలని మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ● జర్నలిస్టులు కూడా ఇందిరమ్మ ఇళ్లు అడుగుతున్నారని, ఒకసారి పరిశీలించాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి కోరారు. అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ● ఎస్సీ నియోజకవర్గంలో ఎక్కువ ఇందిరమ్మ ఇళ్ల్లను కేటాయించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంత్రులను కోరారు. -
నెలాఖరు వరకు వాటాధనం సమకూర్చాలి
శాంతినగర్: ఈనెల చివరి వరకు రూ.15 లక్షలు వాటాధనం సమకూర్చాలని రైతు ఉత్పత్తి దారుల సంఘం చైర్మన్లు అన్నారు. వడ్డేపల్లి రైతు వేదికలో వడ్డేపల్లి, ఇటిక్యాల, రాజోళి, ఐజ, గట్టు మండలాలకు చెందిన రైతు ఉత్పత్తి దారుల సంఘాల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘంలోని వాటాదారులు, సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. సెంట్రల్ సెక్టార్ స్కీంలో బాగంగా 2022లో జిల్లాలో ఐదు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఐదు సంస్థలలో ఇప్పటివరకు 3 వేల మంది రైతులు సభ్యత్వం తీసుకున్నారన్నారు. సభ్యత్వం ద్వారా రూ.30 లక్షల వాటాధనం సమకూర్చామని, ఇప్పటివరకు రూ.2 కోట్ల వరకు ఇన్పుట్ వ్యాపారం జరిగిందన్నారు. 300 ఎకరాల్లో చీని, మామిడి మొక్కలు ఉచితంగా ఇచ్చామని, సభ్యత్వం తీసుకున్న రైతులకు విత్తనాలు, ఫర్టిలైజర్, బ్యాటరీ పంపులు, పరదలు, డ్రిప్పు మందులు, సోలార్ లైట్లు, కలుపు తీసే యంత్రాలు, విత్తనాలు వేసే పరికరాలు అందజేశారన్నారు. ప్రతి గ్రామంలో సంఘం తరపున షాపులు ఏర్పాటుచేయాలని, రైతులకు విత్తనాలు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అందుబాటులో వుండేలా చూడాలని, సంఘాలు వ్యాపారం చేసుకోడానికి న్యాబ్ కిసాన్ సంస్థ ప్రతి సంఘానికి రూ.6 లక్షలు లోన్ మంజూరుచేస్తుందని చైర్మన్లు వివరించారు. సమావేశంలో వడ్డేపల్లి రైతు సంఘం చైర్పర్సన్ దేవేంద్ర, రాజోళి వెంకటేశ్వర్లు, ఇటిక్యాల యుగంధర్‌రెడ్డి, డైరెక్టర్లు సుధాకర్‌గౌడ్, లక్ష్మికాంతరెడ్డి, హనుమంతురెడ్డి, నర్సింహులు, మహేంద్రగౌడ్, తిమ్మప్ప, సీఎస్ఏ ప్రతినిధులు రమేష్, వీరబాబులు పాల్గొన్నారు. -
ముగిసిన శివాంజనేయస్వామి ఉత్సవాలు
ఎర్రవల్లి/ఇటిక్యాల: మండలంలోని వావిలాల శివాంజనేయస్వామి బ్రహ్మాత్సవాలు గురువారం ఘనంగా ముగిసాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఆలయంలో తెప్పోత్సవం, పల్లకీసేవ కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అంతరాష్ట్ర ఆరు పండ్ల విభాగం బండలాగుడు, పొటేళ్ల పందెం పోటీలు అట్టహాసంగా జరిగాయి. అట్టహాసంగా పోటీలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పదుల సంఖ్యలో పొటేళ్లు పందెం పోటీల్లో పాల్గొనగా.. నంద్యాల జిల్లాలోని తిమ్మాపురంకు చెందిన హనుమ పొట్టేలు మొదటి స్థానంలో నిలిచింది. అయిజ మండలం బింగిదొడ్డికి చెందిన పరుశరాముడు పొట్టేలు రెండు, కర్నూలు జిల్లా ముళ్లగుర్తికి చెందిన భైరవ పొట్టేలు మూడు, అయిజ మండలానికి చెందిన నర్సింహ పోట్టేలు నాల్గో స్థానంలో నిలిచి వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు కై వసం చేసుకున్నాయి. అలాగే, ఆరుపళ్ల బండ లాగుడు పోటీల్లో కర్నూల్ జిల్లాలోని పిన్నాపురంకు చెందిన వెంకట కృష్ణయ్య వృషభాలు మొదటి స్థానంలో నిలిచి రూ.40వేలు, మండలంలోని సాతర్లకు చెందిన హర్షద్ భాషా వృషభాలు రెండోస్థానంలో నిలిచి రూ.30వేలు, వనపర్తి జిల్లాలోని పెద్దదగడకు చెందిన యశ్వంత్ యాదవ్ వృషభాలు మూడోస్థానంలో నిలిచి రూ. 20వేలు గెలుచుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీసభ్యులు రంగారెడ్డి, రామయ్య, విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మాణిక్యారెడ్డి, గ్రామ పెద్దలుపాల్గొన్నారు. -
సకాలంలో పనులు పూర్తి చేయాలి
ఎర్రవల్లి: గ్రామాల్లో డిసెంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల యాక్షన్ ప్లాన్ కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం ఉమ్మడి ఇటిక్యాల మండల కేంద్రంతో పాటు షేకుపల్లి, కోదండాపురం గ్రామ పంచాయతీలను ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రూ.25,000 వ్యయంతో చేపట్టిన రూఫ్టాఫ్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, రూ.86,000 వ్యయంతో చేపట్టిన పశువుల షెడ్ నిర్మాణాలు, రూ.18వేలతో చేపట్టిన కంపోస్టు పెట్టును అదనపు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్న హోల్డర్లు, భూమి ఐదు ఎకరాల కన్నా తక్కువగా ఉండి పశువులు ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకొచ్చిందని వివరించారు. అర్హులైన రైతులు ఈ పథకాన్ని వినియోగించుకొని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ శివజ్యోతి, పిఏలు లావణ్య, హసన్, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏ లు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రహణం వీడేదెన్నడో..?
వివరాలు 8లో u●11 ఏళ్లుగా కొనసాగుతున్న గద్వాల ఔటర్ రింగ్ రోడ్డు పనులు ● నిధుల లేమితో ముందుకు సాగని వైనం ● అసంపూర్తి పనులతో ఆరు మండలాల ప్రజల అవస్థలు ● ఇష్టానుసారంగా వెలసిన అక్రమ నిర్మాణాలు నివేదిక పంపించాం ఔటర్‌రింగు రోడ్డు పనులకు నిధులు లేకపోవడంతో ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం పనులు మొదలు పెట్టాలంటే గతంలో వేసిన రేట్లు పెరిగిపోయాయి. ప్రస్తుత ధరలకు అనుగుణంగా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడుతాం. – ప్రగతి, ఆర్అండ్బీ ఈఈ, గద్వాల గద్వాల: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఏళ్లుగా గద్వాల రింగ్‌రోడ్డు పనులు కొనసాగుతూ..నే ఉన్నాయి. ఇన్నేళ్లు పనులు ముందుకు కదలకపోయినా అటు పాలకులకు కాని, ఇటు అధికారులకు కాని చీమ కుట్టినట్లు కూడా లేదు. ఫలితంగా జిల్లాలోని ఆరు మండలాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దుగా ఉన్న రాయచూరుకు వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుతు పడుతున్న పరిస్థితి. 2013లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్వాల ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జమ్ములమ్మ నుంచి గద్వాల–రాయచూరు రోడ్డును కలుపుతూ 100 ఫీట్ల వెడల్పుతో 6.27 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం కోసం రూ.26కోట్లతో అంచనాలు రూపొందించారు. సర్వే పనులు పూర్తయిన అనంతరం 2014లో టెండర్లు నిర్వహించి మొదటి దశ పనులు చేపట్టారు. కొంతమేర పనులు పూర్తయినా ఆ తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈక్రమంలోనే నిధులు లేమితో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రూ.26 కోట్లతో రింగ్‌రోడ్డు ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్వాల చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు వెళ్లే రహదారి మార్గంలోని జమ్ములమ్మ వద్ద నుంచి గద్వాల–అయిజ రోడ్డును కలుపుతూ గద్వాల–రాయచూరుకు వెళ్లే రహదారి వరకు 6.27 కిలోమీటర్ల మేర 100 ఫీట్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రూ.26కోట్లతో అంచనాలు రూపొందించింది. ఇందులో సర్వే కోసం రూ.15 లక్షలు, భూసేకరణకు రూ.4 కోట్లు, రోడ్డు నిర్మాణం కోసం రూ.8.76 కోట్లు, ఆర్వోబి కోసం రూ.7.58 కోట్లు, వివిధ ప్రాంతాలలో స్టక్చర్స్ నిర్మాణాల కోసం రూ.1.1 2కోట్లు, విద్యుత్ పోల్స్‌కు రూ.7లక్షలతో అంచనాలతో డీపీఆర్ రూపొందించి టెండర్ ప్రక్రియ చేపట్టింది. ఇందులో గద్వాల–రాయచూరు రోడ్డు మొదలుకుని గద్వాల–అయిజ వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆ తరువాత జమ్ములమ్మ ప్రధాన రహదారి వరకు చేపట్టాల్సిన పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదిలాఉండగా, నడిగడ్డగా పిలువబడే అలంపూర్ – గద్వాల నియోజకవర్గాల ప్రజలకు నిత్యం వివిధ రకాల పనుల నిమిత్తం రోజుకు సుమారు 20 వేల నుంచి 40వేలకుపైనే రాకపోకలు కొనసాగిస్తుంటారు. రింగ్‌రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో గద్వాల పట్టణం లోపలి నుంచి రాయచూరు, అయిజ, హైదరాబాద్, కర్నూల్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెలసిన అక్రమ నిర్మాణాలు ఇదిలాఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో గద్వాల ఔటర్రింగురోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకుండా పోయిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం ఒక్క రూపాయిని ప్రభుత్వం విడుదల చేయలేదంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. దీనికితోడు గద్వాలఔటర్ రింగు రోడ్డు ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో చాలా చోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ముఖ్యంగా జమ్ములమ్మ ఆలయం వద్ద ప్రభుత్వ భూములలో అక్రంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇళ్ల నిర్మాణాలు, ఫంక్షన్ హాళ్లు వెలిశాయి. ఆక్రమణదారులు వీటిని దర్జాగా అద్దెకిచ్చుకుని నెలనెలా డబ్బులు వెనకేసుకుంటున్నారు. రింగురోడ్డు పనులు పూర్తిచేయాలంటే ఇక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆక్రమణలపై అధికారులకు తెలిసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పారదర్శకంగా లబి్ధ
26న నాలుగు పథకాల ప్రారంభం: జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘గణతంత్ర దినోత్సవం.. జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించనుంది. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి. అర్హులైన ప్రతి నిరుపేదకూ లబ్ధి చేకూరాలి’ అని ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలపై మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా కార్యాచరణ సమన్వయ సమావేశానికి ఆయన రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. ముందుగా ఆయా జిల్లాల్లో పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలపై దామోదర సమీక్షించారు. గ్రామ, వార్డు సభలను ఎలా నిర్వహిస్తున్నారు.. అధికారుల బృందాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు వంటి వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు వివరించారు. అనంతరం పథకాల సమర్థ నిర్వహణపై అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి: జూపల్లి సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగాలని, అర్హులకు అన్యాయం జరగొద్దన్నారు. ఆన్లైన్లో టిక్ చేయకపోవడం వల్ల అర్హులు కాకుండా పోతున్నారని చెప్పారు. వ్యవసాయ యోగ్యం కాని భూములపై పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో నిశితంగా సర్వే చేయాలని.. గూగుల్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేస్తున్నారా లేదా అని మంత్రి ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని.. కొత్త పథకాల అమలులో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని ఓ గ్రామంలో రేషన్ కార్డుల దరఖాస్తుల్లో వ్యత్యాసం వచ్చిందని ఉదహరించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గ్రామాల్లో ఒక రోజు ముందే చాటింపు వేయించి.. గ్రామసభలు నిర్వహించాలన్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీలు, గ్రామైక్య మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని సూచించారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల్ల దామోదర్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రత్యేక అధికారి జి.రవినాయక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి కలెక్టర్లు విజయేందిర బోయి, బదావత్ సంతోష్, బీఎం.సంతోష్, ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకూ మేలు చేకూరేలా ఎంపికలు గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశం ‘రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల’ అమలుపై దిశానిర్దేశం హాజరైన రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి, 5 జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురష్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భువనచంద్ర, దత్తుస్వాము ఆధ్వర్యంలో సీతారాముల విగ్రహాలను ముస్తాబుచేసి వేదమంత్రాల నడుమ కల్యాణం నిర్వహించారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు హాజరుకాగా.. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.