గద్వాలటౌన్: పవిత్ర రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) పండుగను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షక్షలు చేపట్టి ప్రార్థనలతో ముగించారు. సోమవారం ఉదయం ముస్లింలు ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలకు తరలివెళ్లారు. జిల్లా కేంద్రంలోని ఈద్గాకు ముస్లింలు ప్రార్థనలు చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మౌలానా అబ్దుల్ హకీం నమాజ్ చేయించారు. ప్రార్థనల అనంతరం ఈద్గా దగ్గర శ్మశాన వాటికలోని తమ పెద్దల సమాదుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చుట్టు పక్కల గ్రామాల ముస్లింలు సైతం గద్వాల ఈద్గాకు వచ్చి ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ యాదయ్య ఆధ్వర్యంలో సీఐ టంగుటూరి శ్రీను గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రజాప్రతినిధుల శుభాకాంక్షలు
రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలపడానికి వివిధ పార్టీల నాయకులు ఈద్గా దగ్గరకు వచ్చారు. ప్రార్థనల అనంతరం ముస్లింలకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్, బీఆర్‌ఎస్ నాయకుడు హనుంమతునాయుడు, ఎంఐఎం జిల్లా కన్వీనర్ మున్నాబాషలతో పాటు పలువరు నాయకులు ఈద్ ముబారక్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత పేర్కొన్నారు. ప్రార్థనల అనంతరం వారు ముస్లింనుద్దేశించి మాట్లాడారు. హిందూ ముస్లింల ఐక్యతకు గద్వాల నిదర్శనమని పేర్కొన్నారు. గద్వాల సర్వమత సమైక్యతకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
కిటకిటలాడిన ఈద్గాలు, మసీదులు
ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ
పార్టీల నాయకులు
భక్తిశ్రద్ధలతో ఈద్–ఉల్–ఫితర్


