ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు పొడిగింపు
గద్వాల: ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ రాయితీ గడువును ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు పొడిగించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు.
పొగాకు కొనుగోలు
కేంద్రాలు పెంచాలి
అలంపూర్ రూరల్: పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచాలని సీపీఎం మండల కార్యదర్శి జి కే ఈదన్న కోరారు. అలంపూర్ మండలంలో గురువారం కురిసిన వర్షానికి రైతులు పొలాల్లో పొగాకు మండెలను తాటిఫారంతో కప్పేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈక్రమంలో ఆయన పలు పొగాకు పంటలను పరిశీలించడంతోపాటు రైతులతో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ మండల వ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పొగాకు పంటను ఐటీసీ, వీఎస్‌టీ, జీపీఐ, అలయన్స్ తదితర కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుని పొగాకు పంటను కొనుగోలు చేస్తున్నాంటారన్నారు. అయితే పొగాకు కంపెనీలు కొనుగోలు చేయడంలో అలసత్వం వహించడంతో రైతులు అనేక అవస్థలను పడుతున్నారని, అకాల వర్షాలతో రైతులు మరింత ఆందోళన చెందున్నారని అన్నారు. గురువారం కురిసిన వర్షానికి పొగాకు పంట నాణ్యత తగ్గుతుందేమోనని రైతులు భయాందోళన చెందుతున్నారని, ఒక వైపు కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వాతావరణం సహకరించకపోవడంతో పొగాకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పొగాకు కంపెనీలు గుర్తించి నూతనంగా కొనుగోలు కేంఽద్రాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రైతుల నుండి పొగాకు పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో మోస్తరు వర్షం
గద్వాలవ్యవసాయం: గద్వాల పట్టణంలో గురువారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో చిన్నపాటి జల్లులతో వర్షం పడింది. అయితే రైతులు ఎప్పటిలాగే మార్కెట్ యార్డుకు వేరుశనగ, ఆముదాలు, వడ్లు, కందులు విక్రయానికి తీసుకొచ్చారు. పలువురు రైతులు ధాన్యాన్ని షెడ్లలో పోశారు. పది గంటల ప్రాంతంలో ఎండ ఉండటంతో కొంత మంది రైతులు వేరుశనగను యార్డు ఆవరణలో పోశారు. కాగా ధాన్యం టెండర్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, కాంటా చేసే సమయంలో చిన్నపాటి జల్లులతో వర్షం వచ్చింది. వేరుశనగ తడవకుండా వెంటనే హమాలీలు, దడవాయిలు, ఇతర చాట కూలీలు రైతులతో కలిసి కవర్లు కప్పారు. వర్షం బంద్ అయిన తర్వాత కాంటా వేసి మిల్లులకు తరలించారు. వర్షం కారణంగా కొంత వేరుశనగ ధాన్యం తడిసింది. అప్పటికే టెండర్ ప్రక్రియ ముగిసినందున విక్రయించిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని యార్డు అధికారులు తెలిపారు. కొద్దిగా తడిసిన వేరుశనగను.. కొనుగోలు చేసిన వ్యాపారస్తులు మిల్లులో ఆరబెడతారని, వారికి సైతం ఎలాంటి నష్టం జరగదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే యార్డు ఆవరణలోని సిమెంట్ ఫ్లోరింగ్‌కు పలు చోట్ల గుంతలు పడ్డాయని, దీనివల్ల చిన్నపాటి వర్షం వచ్చిన నీరు నిల్వ ఉండి ధాన్యం తడుస్తోందని, ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
వేరుశనగ క్వింటా రూ.6,380
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు గురువారం 1,517 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6380, కనిష్టం రూ.2889, సరాసరి రూ. 5810 ధరలు పలికాయి. అలాగే, 40 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6519, కనిష్టం రూ. 3029, సరాసరి రూ. 6519 ధరలు వచ్చాయి. 51 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.6021, కనిష్టం రూ.5509, సరాసరి రూ. 5979 ధరలు వచ్చాయి. 229 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2026, కనిష్టం రూ. 1751, సరాసరి ధర రూ.2016 ధరలు లభించాయి.
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు పొడిగింపు


