
ఆలయంలో సివిల్ జడ్జి పూజలు
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో వెలసిన పాగుంట లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గద్వాల సివిల్ జడ్జి గంట కవిత ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉదయం ఆలయానికి జడ్జి చేరుకోగా.. ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వేరుశనగ క్వింటా రూ.6,159
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు బుధవారం 708 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6159, కనిష్టం రూ.3150, సరాసరి రూ.5919 ధరలు పలికాయి. అలాగే, 2 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 4013 ధర వచ్చింది. దీంతోపాటు 38 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5980, కనిష్టం రూ. 4557, సరాసరి రూ. 5950 ధరలు వచ్చాయి. 262 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2057, కనిష్టం రూ. 1737, సరాసరి రూ.2026 ధరలు లభించాయి.
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (మహిళలు– మహబూబ్‌నగర్), (పురుషులు–నాగర్‌కర్నూల్)లలో విద్యార్థులకు బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని టీడబ్ల్యూ గురుకులం మహబూబ్‌నగర్ రీజియన్ కో–ఆర్డినేటర్ పీఎస్ కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కెమిస్ట్రీలో నాలుగు, ఫిజిక్స్‌లో రెండు, హిస్టరీ, కామర్స్, తెలుగు, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, లైబ్రేరియన్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని, అలాగే ఆయా సబ్జెక్టులలో సెట్, నెట్, పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఈనెల 16వ తేదీలోగా మహబూబ్‌నగర్ శివారు తిరుమల హిల్స్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ (మహిళలు) ప్రిన్సిపాల్‌కు పూర్తి చేసిన దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 17వ తేదీ ఉదయం పది గంటలకు ఇదే కళాశాలలో నిర్వహించే డెమోకు తప్పక హాజరు కావాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్ నం.7901097704, 9848616564లను సంప్రదించ వచ్చని పేర్కొన్నారు.
సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతరకు జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ యా దయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని.. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మెరుగైన విద్య
అందించాలి
తిమ్మాజిపేట/తెలకపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తిమ్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుదవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తెలకపల్లి సీఎల్‌ఆర్ విద్యాసంస్థల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల ఏర్పాటుపై కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. విద్యార్థులు అత్యాధునిక విద్యా ప్రమాణాలతో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం చైర్మన్‌ను సత్కరించారు. ఆయన వెంట అధికారులు రాధాకృష్ణ, శివరాం, రామరాజు, మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ జాకీర్ అలీ, ఎంఈఓలు శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణశెట్టి, సీఎల్‌ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం లక్ష్మారెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, రాజమహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.