
బెట్టింగ్ నిర్వాహకుల ఆటకట్టు
విచారణ కొనసాగుతుంది
నాలుగు రోజుల క్రితం శాంతినగర్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. బెట్టింగ్ వ్యవహారంలో ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యక్తుల వివరాలపై ఆరా తీస్తున్నాం. ఇందులో ఎంతమంది ప్రమేయం ఉందనే కోణంలో కూపీ లాగుతున్నాం. జిల్లాలో ఎవరైన బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే డయల్ 100 లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. త్వరలో పూర్తి విషయాలను వెల్లడిస్తాం.
– శ్రీనివాసరావు, ఎస్పీ
గద్వాల క్రైం: ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్ కాస్తున్న ప్రధాన సూత్రధారిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నమ్మదగిన సమాచారం మేరకు నాలుగు రోజుల క్రితం శాంతినగర్ పోలీసులు నిఘా ఉంచి.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీన శాంతినగర్ పోలీసులు వడ్డేపల్లికి చెందిన కుమ్మరి వీరేంద్రచారిని అదుపులోకి తీసుకున్న క్రమంలో బెట్టింగ్ ఎంతమంది నిర్వహిస్తున్నారనే కోణంలో కూపీలాగారు. అయితే అయిజకు చెందిన వడ్ల రాఘవచారి అనే వ్యక్తి బెట్టింగ్ వ్యవహారం మొత్తాన్ని ఓ యాప్ ద్వారా నిర్వహిస్తారని, మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇదంతా నిర్వహిస్తారని తెలిసింది. ఈక్రమంలో మొత్తం ఆరుగురు బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. జిల్లాలో ఇటీవల ఇద్దరు యువకులు బెట్టింగ్ కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసి, తిరిగి చెల్లించే స్థోమత లేక బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో జిల్లా పోలీసుశాఖ బెట్టింగ్ నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఉంచింది.
ప్రాధాన బూకీ కనుసన్నల్లోనే..
ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయంటే చాలు అయిజకు చెందిన బూకీ వడ్ల రాఘవచారి కనుసన్నల్లోనే బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతుంది. 2017, 2018లో గద్వాల, అయిజ, శాంతినగర్ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు కావడంతో ప్రాధాన సూత్రధారి విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పలు పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అయితే జిల్లా కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం కోసం బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు మరికొందరిని రంగంలోకి దింపినట్లు సమాచారం. అయిజ, గద్వాలకు చెందిన ప్రధాన బూకీలు హైదరాబాద్‌లోని మణికొండ కేంద్రంగా ఆన్‌లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నట్లు పోలీసులు ఆరా తీస్తున్నారు.
పోలీసుల అదుపులో ప్రధాన సూత్రధారి
మిగతా వారి కోసం కొనసాగుతున్న
గాలింపు

బెట్టింగ్ నిర్వాహకుల ఆటకట్టు