
అంతటా పండుగ సందడి
గద్వాలటౌన్: జిల్లా వ్యాప్తంగా ఉగాది సందడి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆదివారం పండగను జరుపుకోనుండటంతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు శనివారం గద్వాలకు వచ్చి పండగ వస్తువులు కొనుగోలు చేశారు. దీంతో గద్వాల పాతబస్టాండ్, రథశాల, కూరగాయల మార్కెట్, గాంధీచౌక్ తదితర ప్రాంతాలన్నీ కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. గద్వాలతో పాటు అయిజ, శాంతినగర్, అలంపూర్ పట్టణాలలో సైతం ఉగాది హడావుడి కనిపించింది. ఉదయం మందకొడిగా సాగిన విక్రయాలు సాయంత్రం ఒక్కసారిగా ఊపందుకోవడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. గద్వాలలో మామిడి కాయాలు, పచ్చి ఇస్తరాకులు, బంతిపూలు, టెంకాయల కొనుగోళ్లకు డిమాండ్ నెలకొంది. మార్కెట్‌తో పాటు ప్రధాన చౌరస్తాలలో పూల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపారు. పూలు, పండ్లు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నా కొనుగోలు దారులు ఏమాత్రం రాజీ పడలేదు. అన్ని మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మామిడి తోరణాలు పెద్దమొత్తంలో తీసుకొచ్చి అమ్మకాలు జరిపారు.
ఆలయాల ముస్తాబు
ఉగాదిని పురస్కరించుకొని స్థానికంగా ఉన్న ఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో సుంకులమ్మ, ఈదమ్మ ఆలయాల వద్ద భక్తులు నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో కోళ్లను బలిస్తారు. అందుకుగాను ఆలయ నిర్వహకులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని మార్కండేయస్వామి ఆలయం, అహోబిల మఠం, శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయం, నది ఆగ్రహారంలోని ఆలయాల దగ్గర పంచాంగం శ్రవణం నిర్వహించనున్నారు. ముఖ్యంగా జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన అలంపూర్, బీచుపల్లి, మల్థకల్, పాంగుంట, చింతరేవుల తదితర ఆలయాలలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఉన్న ఆలయ నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.